Business Fraud: వ్యాపారం పేరిట ఘరానా మోసం
ABN , Publish Date - Jun 16 , 2025 | 05:34 AM
వ్యాపారం పేరుతో అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరుకు చెందిన దంపతులు ఘరానా మోసానికి తెరదీశారు. మధు గ్రూప్స్ పేరుతో ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ వ్యాపారమని, పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని ఆశ పెట్టారు.

ఒకే కుటుంబానికి కోటికి టోకరా
పెట్టుబడి పెట్టించి.. తిరిగివ్వని వైనం
వైసీపీ నేతల అండతోనే: బాధితులు
అన్నమయ్య జిల్లాలో దంపతుల మోసం
వైసీపీ ఎంపీ సాయంపై అనుమానాలు
అరెస్టు చేసిన అనంతపురం పోలీసులు
కడపలో ఉద్యోగాల పేరుతో యువతకు టోపీ
అనంతపురం క్రైం, జూన్ 15(ఆంధ్రజ్యోతి): వ్యాపారం పేరుతో అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరుకు చెందిన దంపతులు ఘరానా మోసానికి తెరదీశారు. మధు గ్రూప్స్ పేరుతో ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ వ్యాపారమని, పెట్టుబడులు పెడితే మంచి లాభాలు వస్తాయని ఆశ పెట్టారు. వారి మాటలను నమ్మి అనంతపురానికి చెందిన ఓ కుటుంబం రూ.కోటికి పైగా పెట్టుబడి పెట్టింది. లాభాలు చూపకపోవడంతోపాటు ఇచ్చిన డబ్బు కూడా చెల్లించకపోవడంతో బాధిత కుటుంబం రైల్వే కోడూరులో పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు యత్నించినా పట్టించుకోలేదు. గత ప్రభుత్వంలో వైసీపీ నేతల అండదండలతో కేసులు లేకుండా చేసుకున్నట్లు తెలుస్తోంది. వైసీపీకి చెందిన ఓ ఎంపీ అండదండలున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో బాధితులు అనంతపురం టూటౌన్‌లో ఫిర్యాదు చేయడంతోపాటు కోర్టుకెళ్లారు. కోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు ఈ నెల 14న అనంతపురం టూటౌన్ పోలీసులు.. చింతా మధురవాణి, చింతా రామసుబ్బారెడ్డి అలియాస్ మన్నూరు రమణయ్య దంపతులను అరెస్టు చేశారు. వీరి బాధితులు కడప జిల్లాలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
ఆశ చూపి...
బాధితులు, అనంతపురం టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. అనంతపురానికి చెందిన పిడుగు సుబ్బారెడ్డి... కువైట్‌లో దుస్తుల వ్యాపారం చేసేవారు. కడప జిల్లా రైల్వేకోడూరులోని న్యూక్రిష్ణానగర్‌కు చెందిన చింతా రామసుబ్బారెడ్డి అలియాస్ మన్నూరు రమణయ్య కువైట్‌లో పోలీసు డిపార్టుమెంట్‌లో పనిచేస్తున్నారు. అలా వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. తన భార్య చింతా మధురవాణి రైల్వేకోడూరులో మధు గ్రూప్స్ పేరుతో ఇంపో ర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్ బిజినెస్ చేస్తోందని, దీనిలో పెట్టుబడి పెడితే మంచి లాభాలొస్తాయ ని రామసుబ్బారెడ్డి నమ్మబలికారు. ఈ విషయాన్ని సుబ్బారెడ్డి.. తన కుమార్తెకు చెప్పడంతో తొలుత వారు నమ్మలేదు. అయితే, మధురవాణి అనంతపురం వచ్చి సుబ్బారెడ్డి కుమార్తెతో మాట్లాడి, తన ఆఫీ్‌సకు తీసుకెళ్లి చేస్తున్న బిజినెస్ గురించి వివరిం చి, ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్నట్లు సర్టిఫికెట్లు చూపించారు. ఖతార్ దేశానికి రెండు కంటైనర్లలో బియ్యం పంపుతున్నామనీ, పెట్టుబడి పెట్టాల ని కోరారు. దీంతో 2024, జూలై 17న ఒప్పందం కిం ద రూ.25 లక్షలు ఇచ్చారు. అనంతరం కంటైనర్స్ పంపించడానికి రూ.6.94 లక్షలు చెల్లించాలని చెప్పడంతో ఆ మొత్తం కూడా ఇచ్చారు. ఆ తరువాత ఇక ఆమెతో బిజినెస్ చేయకూడదని నిర్ణయించుకున్నారు. డబ్బు ఇవ్వాలని అడిగారు. అదిగో.. ఇదిగో.. అంటూ మధురవాణి కాలయాపన చేశారు. ఇదే సమయంలో బాధితురాలి తండ్రి సుబ్బారెడ్డి అనారోగ్యం బారినపడి వ్యాపారంలో ఇబ్బందులు తలెత్తాయి. దీనిని కూడా మధురవాణి అనుకూలంగా మలచుకుని, ‘మీ పిల్లలు డబ్బు అడుగుతున్నారని, మరికొంత ఇస్తేనే మీ సమస్య తీరుస్తాన’ని చెప్పా రు. ఆ డబ్బు ఇస్తేనే పెట్టుబడిగా పెట్టిన డబ్బు వస్తుందని భయపెట్టారు. దీంతో ఆమె చెప్పినట్లుగా సుబ్బారెడ్డి మరోసారి ఖతార్‌కు కంటైనర్లు పంపడానికి గతేడాది సెప్టెంబరు 21న రూ.33.76 లక్షలు వారి బ్యాంకు అకౌంట్‌కు పంపారు. కొన్ని రోజులకు మొదట పెట్టిన పెట్టుబడికి సంబంధించి రూ.2 లక్షలు బాధితురాలి భర్త అకౌంట్‌కు పంపారు. తర్వాత ఆయిల్ బిజినెస్ పేరుతోనూ సొమ్ము మధురవాణి సొమ్ము రాబట్టింది. ఇలా రూ1.15 కోట్లకు మోసపోయామనిబాధితులుఫిర్యాదు చేశారు.
వైసీపీ నేతల అండ
వైసీపీ నేతల అండతోనే మధురవాణి దంపతులు టోకరా పెట్టినట్లు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి జగన్ వద్దకెళ్లి కొన్ని పనులు చేయించుకున్నట్లు సమాచారం. స్థానికంగా ఎంపీ మిథున్‌రెడ్డితో సన్నిహిత సంబంధాల నేపథ్యంలోనే పోలీసు స్టేషన్లలో కేసులు లేకుండా వ్యవహారం నడిపినట్లు తెలిసింది. ఈ కారణంలోనే బాధితులు ఫిర్యాదు కూడా చేయలేకపోయారని తెలిసింది.
ఉద్యోగాల పేరిట కడపలో..
ఉమ్మడి కడప జిల్లాలో మధురవాణి దంపతులు మరెన్నో మోసాలు చేసినట్లు తెలుస్తోంది. ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కొందరు యువకుల నుంచి డబ్బు వసూలు చేసినట్లు ఆరోపణలున్నాయి. కొందరు యువతులను కువైట్‌లో ఉద్యోగం పేరుతో పంపి వారిని ట్రాప్ చేసినట్లు సమాచారం. భర్త కువైట్‌లో పోలీసు ఆఫీసర్‌గా ఉండటంతో ఈ పని సులువైనట్లు తెలుస్తోంది. అయితే, బాధితులు ఫిర్యాదు చేయడం లేదు. దీనికి ఆ కుటుంబానికి ఉన్న రాజకీయ పలుకుబడేకారణమని సమాచారం.