Deadline Extension: ఆ విద్యార్థులకు మరో చాన్స్
ABN , Publish Date - Aug 05 , 2025 | 04:39 AM
యూనివర్సిటీలు, ప్రైవేటు కాలేజీలు సర్టిఫికెట్లు మంజూరు చేయని కారణంగా.. గడువు పూర్తవడంతో ఎంటెక్
బీటెక్ సర్టిఫికెట్ల అప్‌లోడ్‌కు గడువు పొడిగింపు
ఎట్టకేలకు స్పందించిన ఉన్నత విద్యామండలి
ఎంటెక్ ప్రవేశాలపై త్వరలో సవరణ షెడ్యూల్
‘ఆంధ్రజ్యోతి’ కథనంతో కదలిక
అమరావతి, ఆగస్టు 4 (ఆంధ్రజ్యోతి): యూనివర్సిటీలు, ప్రైవేటు కాలేజీలు సర్టిఫికెట్లు మంజూరు చేయని కారణంగా.. గడువు పూర్తవడంతో ఎంటెక్ అడ్మిషన్ అవకాశం కోల్పోయిన విద్యార్థులకు మరో అవకాశం లభించింది. పీజీఈసెట్‌లో సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేసేందుకు మరో అవకాశం ఇవ్వనున్నట్లు ఉన్నత విద్యామండలి సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది. యూనివర్సిటీల నుంచి బీటెక్ సర్టిఫికెట్లు జారీకానందున కొంత సమయం ఇవ్వాలని రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల నుంచి వినతులు వచ్చిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. ఆయా విద్యార్థుల కోసం ఆప్షన్ల ప్రక్రియతో సహా సవరణ షెడ్యూల్‌ను త్వరలో విడుదల చేస్తామని తెలిపింది. ప్రభుత్వం వద్ద ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నందున పలు యూనివర్సిటీలు, ప్రైవేటు కాలేజీలు విద్యార్థులకు బీటెక్ సర్టిఫికెట్లు నిలిపివేశాయి. ఈలోగా పీజీఈసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ దాదాపు పూర్తయ్యింది. ఈ అంశంపై ‘ఆంధ్రజ్యోతి’ కథనాలు ప్రచురించింది. సోమవారం ప్రచురితమైన ‘చేజారిన ఎంటెక్ చాన్స్’ కథనంపై స్పందించిన ప్రభుత్వం సర్టిఫికెట్ల అప్‌లోడ్‌కు మరోసారి విద్యార్థులకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వేల మంది విద్యార్థులకు మేలు జరగనుంది. అయితే సర్టిఫికెట్ల అప్‌లోడ్‌కు గడువు పొడిగించడంతో తమ గ్రాడ్యుయేషన్ సర్టిఫికెట్ల జారీపై యూనివర్సిటీలు, కాలేజీలకు ఆదేశాలు ఇవ్వాలని విద్యార్థులు కోరుతున్నారు. లేకుంటే గడువు పొడిగించినా ఉపయోగం లేదని అభిప్రాయపడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
For More AP News and Telugu News