Share News

AP Assigned Lands: అసైన్డ్‌పై మూడో సారీ

ABN , Publish Date - Jun 12 , 2025 | 04:53 AM

రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం మూడో సమావేశం ముచ్చటగానే ముగిసింది. గత పది నెలలుగా పెండింగ్‌లో ఉన్న అసైన్డ్‌ భూముల సమస్యకు ఈ సమావేశంలో అయినా మంత్రుల బృందం పరిష్కారం చూపిస్తుందని....

AP Assigned Lands: అసైన్డ్‌పై మూడో సారీ

  • ఉసూరుమనిపించిన ఉపసంఘం.. తాజా భేటీలోనూ ఏ నిర్ణయమూ లేదు

  • కలెక్టర్ల కాన్ఫరెన్స్‌ నిర్ణయాలపైనే చర్చ

  • ఈ మాత్రం దానికి ఉపసంఘం ఎందుకో?

  • నాలా చట్టం రద్దు అంటూ హడావుడి

  • ఇలాగైతే భూ సమస్యలు తీరేదెన్నడు?

  • ఫ్రీ హోల్డ్‌పై రైతుల్లో తీవ్ర ఆందోళన

  • సర్కారు నిషేధం విధించి 10 నెలలు

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం మూడో సమావేశం ముచ్చటగానే ముగిసింది. గత పది నెలలుగా పెండింగ్‌లో ఉన్న అసైన్డ్‌ భూముల సమస్యకు ఈ సమావేశంలో అయినా మంత్రుల బృందం పరిష్కారం చూపిస్తుందని ఎదురు చూసిన లక్షలాది మంది రైతుల ఆశలను అడియాశలు చేశారు. అసైన్డ్‌ భూముల అంశం ఎజెండాలో లేకుండా, చర్చే చేయకుండా కేవలం నాలా చట్టం ఉపసంహరణపై మాట్లాడుకుని సమావేశాన్ని ముగించారు. అది కూడా ఎప్పుడో జిల్లా కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన ఆదేశం. దానిపై చర్చ కు మంత్రివర్గ ఉపసంఘం అవసరమా? అన్న విమర్శలు వస్తున్నాయి. నాలా చట్టం వల్ల రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేవారికి, రూ.కోట్ల విలువైన వెంచర్లు వేస్తున్న వారికి ఇబ్బందులున్నాయి. ఆ సమస్యపైనే ఉపసంఘం దృష్టిపెట్టింది కానీ లక్షలాది మంది పేద రైతులకు చెందిన ఫ్రీ హోల్డ్‌ అంశంపై నిర్ణయాత్మక చర్చ చేయలేదు. దీంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పగించిన బాధ్యత నెరవేర్చడంలో రెవెన్యూ శాఖ ఇలాగే వ్యవహరిస్తుందా? అన్న ఆగ్రహం కూటమి వర్గాల నుంచే వ్యక్తమవుతోంది. ఆంధ్రప్రదేశ్‌ అసైన్‌మెంట్‌ భూముల(పీఓటీ) చట్టం-1977లో 2023లో అప్పటి జగన్‌ సర్కారు సవరణలు చేసిన సంగతి తెలిసిందే. పేదలకు అసైన్‌ చేసిన భూముల కాలపరిమితి 20 ఏళ్లు దాటి ఉంటే వాటిని నిషేఽధిత జాబితా(22)(ఏ) నుంచి తొలగించి (ఫ్రీ హోల్డ్‌) లబ్ధిదారులకు శాశ్వత యాజమాన్య హక్కులు కల్పించాలని చట్టసవరణ చేశారు.


దీని అమలుకు అదే ఏడాది డిసెంబరు 19న 596 జీఓ ఇచ్చారు. దీన్ని ప్రామాణికంగా తీసుకొని అసైన్డ్‌ భూములను ఫ్రీ హోల్డ్‌ చేయాలి. ఆ తర్వాత ఆ భూములను రైతుల పేరిట మార్చాలి. ఆ తర్వాత రైతులు స్వేచ్ఛగా ఆ భూములను అమ్ముకోవచ్చు. అయితే, జగన్‌ సర్కారులోని పెద్దలు ఈ చట్టసవరణను అడ్డు పెట్టుకొని భూ దందాకు పాల్పడ్డారు. 13 లక్షల ఎకరాలను ఫ్రీ హోల్డ్‌ చేయగా, అందులో 5.73 లక్షల ఎకరాలను జీఓ 596ని ఉల్లంఘించి పీఓటీ చట్టవిరుద్ధంగా నిషేఽధిత జాబితా నుంచి తొలగించారు. కూటమి ప్రభుత్వ విచారణలో ఈ దందా బయటపడింది. దీంతో గత ఏడాది ఆగస్టులో ఫ్రీ హోల్డ్‌ భూముల రిజిస్ట్రేషన్‌లు, ఇతర వ్యవహారాలన్నింటిపై నిషేధం విధించారు. త్వరలో ప్రభుత్వం ఓ విధాన నిర్ణయం తీసుకొని అసలైన లబ్ధిదారులకు న్యాయం జరిగేలా పరిష్కారం చూపిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ మేరకు రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసింది.


లక్షలాది రైతులకు ఇబ్బందులు

జగన్‌ జమానాలో 13 లక్షల అసైన్డ్‌ భూములు ఫ్రీ హోల్డ్‌ అయితే 5.75 లక్షల ఎకరాలే అక్రమని తేలింది. మిగిలిన భూములు అంటే.. 7.25 లక్షల ఎకరాలు జీఓ 596 ప్రకారమే నిబంధనలకు లోబడి ఫ్రీ హోల్డ్‌ చేశారని రెవెన్యూ శాఖ చెబుతోంది. ఈ భూముల్లో అత్యధిక శాతం ఎకరం, రెండు ఎకరాలున్న రైతులే ఉన్నారు. వారందరికీ చట్టప్రకారం రిజిస్ట్రేషన్‌ చేసే హక్కులు ఉన్నాయి. అక్రమార్కులున్నారనే పేరిట అందరికీ నిషేధం వర్తింపచేసి 10 నెలలవుతోంది. ఫ్రీ హోల్డ్‌ తర్వాత బినామీ, అక్రమ లావాదేవీలతో ముడిపడిన భూముల రిజిస్ట్రేషన్‌లు నిలిపివేయాలి. అలాంటి వాటిపై సామాజిక నిఘా ఉంచి రిజిస్ట్రేషన్లు జరగకుండా చర్యలు తీసుకోవాలి. ఇందుకు రెవెన్యూ శాఖ గట్టి కసరత్తు చేయాలి. కానీ ఇంత వరకు ఆ శాఖ నుంచి ఏ చిన్న ప్రయత్నం జరగకపోగా, మొత్తం అసైన్డ్‌ భూముల రిజిస్ట్రేషన్‌లపై నిషేధం విధించారు. దీంతో చట్టబద్ధంగా నిజమైన హక్కుదారులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఎవరో తప్పు చేస్తే వారిపై చర్యలు తీసుకోకుండా, అందరికీ నిషేధం వర్తింపజేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అసలు ఉపసంఘం తీరుపైనే ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకసారి సమీక్ష చేస్తే అక్కడ జరిగిన చర్చలు, తీసుకున్న నిర్ణయాలేమిటో తెలిసిపోతాయని, కనీసం అప్పుడైనా అసైన్డ్‌ భూముల సమస్యకు పరిష్కారం లభిస్తుందేమోనని ఓ రిటైర్డ్‌ ఐఏఎస్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Updated Date - Jun 12 , 2025 | 04:54 AM