Share News

Charity Work: స్నేహితులతో కలసి.. సేవకు కదిలి..!

ABN , Publish Date - Mar 09 , 2025 | 04:57 AM

మిత్రులతో కలసి వారాంతాల్లో అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు నిత్యావసరాలు అందించడంతో మొదలుపెట్టి ఇప్పుడు ‘వదాన్య జన సొసైటీ’ పేరుతో నిరుపేద విద్యార్థుల ఉన్నతవిద్యకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు.

 Charity Work: స్నేహితులతో కలసి.. సేవకు కదిలి..!

  • వదాన్య జనసొసైటీ పేరిట సేవా కార్యక్రమాలు

  • నిరుపేద విద్యార్థుల ఉన్నత విద్యకు ఆర్థికసాయం

  • డీఎస్సీ, కానిస్టేబుల్‌ ఉద్యోగ అభ్యర్థులకు ప్రోత్సాహం

  • నేడు శ్రీసత్యసాయి జిల్లాలో వదాన్య అభినందన సభ : అశోక్‌

హైదరాబాద్‌ సిటీ, మార్చి 8(ఆంధ్రజ్యోతి): నలుగురు స్నేహితులు కలిస్తే పార్టీలు, పబ్‌లు అంటూ సరదాగా కాలం గడిపేస్తారు. కానీ అశోక్‌ పడపాటి మాత్రం అందుకు పూర్తి భిన్నం. ఓవైపు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీరుగా ఉద్యోగం చేస్తూనే మరోవైపు పల్లెల్లోని ప్రతిభావంతులకు బాసటగా నిలిచేందుకు విభిన్న సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. మిత్రులతో కలసి వారాంతాల్లో అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలకు నిత్యావసరాలు అందించడంతో మొదలుపెట్టి ఇప్పుడు ‘వదాన్య జన సొసైటీ’ పేరుతో నిరుపేద విద్యార్థుల ఉన్నతవిద్యకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. ఆ వివరాలు అశోక్‌ మాటల్లోనే... ‘సాటివారికి సాయపడేలా ఏదైనా చేద్దామని నా మిత్రుడు అరుణ్‌ అనంత రామన్‌ను కదిలించాను. అతని మద్దతుతో మరికొంతమంది స్నేహితులూ ముందుకొచ్చారు. నెల జీతంలో 0.5 శాతం సొమ్మును సామాజిక సేవకు కేటాయించడానికి అంగీకరించారు. మొదట్లో నెలలో ఒక వారాంతం అనాథ, వృద్ధాశ్రమాలకు వెళ్లి నిత్యావసరాలు అందించడంతో సేవ మొదలుపెట్టాం. తర్వాత కూకట్‌పల్లి, బాలానగర్‌, మోతీనగర్‌ తదితర ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్‌ తరగతి గదుల ఏర్పాటుతో పాటు కొన్నాళ్లు హైస్కూలు విద్యార్థులకు ఉచిత ట్యూషన్లు చెప్పాం.


ఆర్థిక ఇబ్బందులతో ఫీజులు చెల్లించలేక ఎంతోమంది అర్ధంతరంగా చదువు ఆపేయడం చూసి చలించిపోయాం. మా వంతుగా వీలైనంతమందికి విద్యాదానం చేయాలని నిర్ణయించుకున్నాం. 2010 నుంచి ఇప్పటివరకు సుమారు 400 మంది పేద విద్యార్థుల చదువుకు ఆర్థిక సాయం అందించాం. కరోనా కాలంలో సొంతూరైన శ్రీసత్యసాయి జిల్లా కొత్తచెరువు గ్రామంలో పేద రోగులకు ఆక్సిజన్‌ సిలిండర్లు అందించాం.ఆర్థిక స్థోమత లేక ఆన్‌లైన్‌ తరగతులకు దూరమవుతున్న 80మందికి ఉచితంగా ల్యాప్‌టా్‌పలు ఇచ్చాం. జిల్లాలోని స్థానిక ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాప్రమాణాలు పెంపొందించే లక్ష్యంతో మండల, జిల్లా స్థాయిల్లో తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు నాలుగేళ్లుగా ప్రతిభా పరీక్షలు నిర్వహిస్తున్నాం. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలతో పాటు వారి ఉన్నత విద్యకు సహకరిస్తున్నాం. జిల్లావ్యాప్తంగా డీఎస్సీకి సిద్ధమవుతున్న అభ్యుర్థులకు రాతపరీక్ష నిర్వహించి నగదు బహుమతులు అందజేస్తున్నాం. గత డిసెంబరులో నిర్వహించిన పరీక్షల్లో టాప్‌లో నిలిచినవారికి ఈ నెల 9న కొత్తచెరువులో మొత్తం రూ.4లక్షలు బహుమతిగా అందిస్తున్నాం. కానిస్టేబుల్‌ తదితర ఉద్యోగాలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకూ సాయం చేయాలని నిర్ణయించాం.’’


రాజ్‌భవన్‌లో తేనీటి విందుకు ఆహ్వానం

అశోక్‌ సేవలను గుర్తించిన గవర్నర్‌ సయ్యద్‌ అబ్దుల్‌ నజీర్‌, జనవరి 26న రాజ్‌భవన్‌లోని తేనీటి విందుకు ఆహ్వానించారు. ఆహా ఓటీటీలో ప్రసారమయ్యే ‘అన్‌స్టాపబుల్‌’ కార్యక్రమంలోనూ ప్రత్యేక అతిథిగా పాల్గొని నందమూరి బాలకృష్ణ ప్రశంసలు అందుకున్నారు. భారత వికాస సంఘం అశోక్‌ను భారతీయ యువ పురస్కారంతో సత్కరించింది. వదాన్య ఆర్థిక సాయంతో ఉన్నత విద్యను అభ్యసించిన కొందరు సాఫ్ట్‌వేర్‌, సీఏ, మేనేజ్‌మెంట్‌ తదితర రంగాల్లో స్థిరపడటం తమకెంతో సంతృప్తినిచ్చిందని అశోక్‌ ఆనందం వెలిబుచ్చారు. ఇదంతా మిత్ర బృందం సమష్టి సహకారంతోనే సాధ్యమైందని చెప్పారు. ఉమ్మడి అనంతపురం జిల్లాను విద్యా, ఉద్యోగుల నిలయంగా తీర్చిదిద్దాలన్నదే వదాన్య సంకల్పమని వెల్లడించారు.

Updated Date - Mar 09 , 2025 | 04:57 AM