APSRTC :మహిళల ఉచిత ప్రయాణానికి ఆర్టీసీ రెడీ
ABN , Publish Date - Aug 08 , 2025 | 04:47 AM
రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ఆర్టీసీ సిద్ధమైందని సంస్థ చైర్మన్ కొనకళ్ల నారాయణ తెలిపారు.
అదనపు బస్సులు, సిబ్బందిని సమకూర్చుకున్నాం
కార్పొరేషన్ చైర్మన్ కొనకళ్ల నారాయణ వెల్లడి
రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు
త్వరలో 1,050 ఎలక్ట్రిక్ బస్సులు: ఎండీ
విజయనగరం జోన్ అధికారులతో సమీక్ష
విశాఖపట్నం, ఆగస్టు 7(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించేందుకు ఆర్టీసీ సిద్ధమైందని సంస్థ చైర్మన్ కొనకళ్ల నారాయణ తెలిపారు. ఈ పథకం విధివిధానాలపై విజయనగరం జోన్ పరిధిలోని అన్ని జిల్లాల ఆర్టీసీ అధికారులతో గురువారం విశాఖ ద్వారకా బస్‌స్టేషన్ ఆవరణలోని స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. మహిళల సాధికారత కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయనుందని చెప్పారు. ఇందుకోసం అదనపు బస్సులను, సిబ్బందిని సమకూర్చుకున్నామన్నారు.
ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ.. మహిళలు రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు. పల్లె వెలుగు, అలా్ట్ర పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీఆర్డినరీ, మెటో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికులు ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారై ఉండాలని.. ప్రభుత్వ గుర్తింపు కార్డులైన ఆధార్‌కార్డు, ఓటరు కార్డు కలిగి ఉండాలని తెలిపారు. ఆర్టీసీకి త్వరలో 1,050 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని.. డీజిల్ బస్సుల స్థానంలో క్రమేపీ ఎలక్ట్రిక్ బస్సులు ప్రవేశపెట్టబోతున్నామని తెలిపారు.
బస్సు ప్రయాణికుల్లో 76 శాతం మంది మహిళలేనని.. వారందరికీ ఉచిత ప్రయాణ పథకం ఉపయోగకరంగా ఉంటుందని ఆర్టీసీ విజయనగరం జోనల్ చైర్మన్ దొన్ను దొర అన్నారు. సమావేశంలో జోనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేఎస్ బ్రహ్మానందరెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఎం.అప్పలరాజు (ఆపరేషన్స్), టి.చెంగల్‌రెడ్డి (ఇంజనీరింగ్), విశాఖ రీజినల్ మేనేజర్ బి.అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
సమస్యలు పరిష్కరించకపోతే పోరాటం: బొప్పరాజు
మరో విద్యుత్ ఉద్యమం చేపడతాం: అక్కినేని వనజ