మరో విద్యుత్ ఉద్యమం చేపడతాం: అక్కినేని వనజ
ABN , Publish Date - Aug 08 , 2025 | 06:12 AM
జగన్ ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడు అదే స్మార్ట్ మీటర్లను బిగించాలని ప్రయత్నిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ విమర్శించారు.
రాజమహేంద్రవరం సిటీ, ఆగస్టు 7( ఆంధ్రజ్యోతి): జగన్ ప్రభుత్వంలో స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించిన చంద్రబాబు ఇప్పుడు అదే స్మార్ట్ మీటర్లను బిగించాలని ప్రయత్నిస్తున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ విమర్శించారు. సీపీఐ జాతీయ మహాసభల్లో భాగంగా రాజమహేంద్రవరం ఆనంరోటరీ హాలులో గురువారం విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. అదానీ మీటర్లను ప్రజలు వ్యతిరేకిస్తున్నారని, సీపీఐ రాష్ట్ర మహాసభల అనంతరం రాష్ట్రంలో మరో విద్యుత్ ఉద్యమాన్ని చేపడతామని స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్ట్ ఎత్తును జగన్ ప్రభుత్వం తగ్గించిందని ఆందోళన చేసిన చంద్రబాబు ఇప్పుడు అదే ఎత్తును ఎందుకు అంగీకరించారని ప్రశ్నించారు. పైౖగా అదే కాంట్రాక్టర్‌కు మళ్లీ ప్రాజెక్టును ఎలా అప్పగించారని నిలదీశారు. రాష్ట్రంలో ఎన్నో ప్రాజెక్టులు ఉండగా వాటిని పూర్తి చేయకుండా కొత్తగా బనకచర్ల ప్రాజెక్టును తెరమీదకు తేవడం చూస్తే ఈ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులు, కాంట్రాక్టర్ల కోసం పనిచేస్తుందని స్పష్టంగా తెలుస్తోందని ధ్వజమెత్తారు. దేశంలో మోదీ, రాష్ట్రంలో చంద్రబాబు దొందూ దొందే అని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణ విమర్శించారు. ఈ నెల 23,24 తేదీల్లో ఒంగోలులో జరిగే సీపీఐ రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర పరిస్థితులపై చర్చించి ప్రజా పోరాటాలపై కార్యాచరణ తీసుకుంటామన్నారు.