Share News

Nandyal Crime News: ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ హత్య

ABN , Publish Date - Apr 19 , 2025 | 04:04 AM

నంద్యాలలో ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగించిన ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ ఫరూక్‌ను ఆమె కుమార్తె స్నేహితులు హత్య చేశారు. అసభ్య ప్రవర్తనపై గొడవ తర్వాత పక్కా ప్రణాళికతో ఫరూక్‌ను చంపి వంతెన కింద పడేశారు

 Nandyal Crime News: ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ హత్య

  • ఓ మహిళతో వివాహేతర సంబంధం

  • ఆమె కుమార్తెతో అసభ్య ప్రవర్తన

  • తీవ్రంగా గొడవపడ్డ యువతి స్నేహితుడు

  • తర్వాత పక్కా ప్లాన్‌తో హతమార్చిన వైనం

నంద్యాల, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): వివాహేతర సంబంధం నంద్యాలలో ఓ ఏపీఎస్పీ కానిస్టేబుల్‌ హత్యకు దారితీసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ మండలం పెద్ద కందుకూరు గ్రామానికి చెందిన ఫరూక్‌(33) మంగళగిరి ఆక్టోపస్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. భార్య, పిల్లలతో మంగళగిరిలో నివాసం ఉంటున్నారు. ఆయన స్వగ్రామంలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు సమాచారం. సదరు మహిళను భర్త వదిలేయడంతో తన కుమార్తెతో కలిసి నంద్యాల శివారు నందమూరినగర్‌లో నివాసం ఉంటోంది. ఫరూక్‌ స్వగ్రామంలో పని ఉందని భార్యకు చెప్పి, 4రోజుల సెలవు తీసుకుని ఈ నెల 8న మంగళగిరి నుంచి వచ్చాడు. స్వగ్రామానికి వెళ్లకుండా ఆ మహిళ ఇంటికి వచ్చాడు. అక్కడ ఆమె కుమార్తె పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో వాగ్వాదం జరిగినట్లు తెలిసింది. కుమార్తె స్నేహితుడు ఫరూక్‌తో గొడవ పడ్డాడు. ఈ నెల 9న మాట్లాడుదామని.. ఆ యువకుడు ఫరూక్‌ను పిలిచాడు. ఫరూక్‌ను తన వాహనంలో ఎక్కించుకుని ఆళ్లగడ్డ నియోజకవర్గం చాగలమర్రి మండల సమీపంలోకి తీసుకెళ్లాడు. పథకం ప్రకారం యువతి స్నేహితులు నలుగురు అక్కడకు వచ్చి కానిస్టేబుల్‌ను హతమార్చి నంద్యాల-గిద్దలూరు అటవీ ప్రాంతంలోని ఓ వంతెన కింద పడేసి పరారయ్యారు. మృతుడి భార్య ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఫరూక్‌ హత్యకు గురైనట్లు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హత్యకు పాల్పడిన వారితో పాటు మహిళను కూడా అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

Updated Date - Apr 19 , 2025 | 04:12 AM