Group 1 Paper Scam: గ్రూప్ 1 పేపర్లు గృహిణులు దిద్దారు
ABN , Publish Date - May 08 , 2025 | 05:12 AM
ఏపీపీఎస్‌సీ గ్రూప్-1 పరీక్ష పేపర్లను అక్రమంగా మూల్యాంకనం చేయించడం కలకలం రేపింది. గృహిణులు, చంటిపిల్లల తల్లులను డబ్బులు ఇచ్చి ఈ ప్రక్రియలో భాగం చేసినట్లు మధుసూదన్ వెల్లడించారు
అనామకులతో మార్కుల మ్యాపింగ్
పీఎస్‌ఆర్ డైరెక్షన్‌లో ‘క్యామ్‌సైన్’ నిర్వాకం
రిమాండ్ రిపోర్టులో విస్తుపోయే అంశాలు
అమరావతి, మే 7 (ఆంధ్రజ్యోతి): ఏపీపీఎస్‌సీ కార్యాలయం బయట పరీక్ష పేపర్ల మూల్యాంకనం చేయడం చట్టరీత్యా నేరం. కానీ మంగళగిరిలోని హాయ్‌ల్యాండ్‌కు గ్రూపు-1 పరీక్ష పేపర్లు తీసుకొచ్చారు. రూ.15,000 ఇస్తామని ఆశపెట్టి గృహిణులు, చంటిపిల్లల తల్లులతో దిద్దించారు. కాబోయే సబ్ కలెక్టర్లు, డీఎస్పీల భవిష్యత్‌ను నిర్ణయించే ఈ పరీక్షలో డిగ్రీ కూడా లేని వీరే మార్కులు వేశారు. ఈ విషయం వారికి కూడా పోలీసులు విచారణకు పిలిస్తే కానీ తెలియలేదు. వైసీపీ హయాంలో జరిగిన ఈ కుంభకోణం దర్యాప్తులో విస్తుపోయే విషయాలు ధాత్రి మధుపై పోలీసుల రిమాండ్ రిపోర్టులో బయటపడ్డాయి. అప్పట్లో ఏపీపీఎ్‌ససీ కార్యదర్శిగా పీఎస్‌ఆర్ ఆంజనేయులు వ్యవహరించారు. వైసీపీ పెద్దలు సూచించిన వ్యక్తులను ఆర్డీవోలు, డీఎస్పీలుగా చేసేందుకు ‘క్యామ్‌సైన్’ అనే మీడియా సంస్థతో కలిసి ఆయన చేసిన బాగోతాన్ని పోలీసులు నిగ్గు తేల్చారు. పమిడికాల్వ మధుసూదన్(ధాత్రి మధు)ను హైదరాబాద్‌లో అరెస్టు చేసిన విజయవాడ పోలీసులు.. నిందితుడు వెల్లడించిన అంశాలను కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారు. దాని ప్రకారం.. 2020 డిసెంబరులో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష నిర్వహించారు. ఫలితాలను 2021 ఏప్రిల్‌లో డిజిటల్ మూల్యాంకనం ద్వారా విడుదల చేశారు.
ఈ మూల్యాంకనంపై అభ్యర్థులు కోర్టుకు వెళ్లారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు ఆ మూల్యాంకనాన్ని రద్దు చేసి సాధారణ మూల్యాంకనం చేయించారు. అప్పటి ఏపీపీఎస్‌సీ కార్యదర్శి పీఎస్‌ఆర్ ఇక్కడే అడ్డదారులు తొక్కారు. కార్యాలయం నుంచి గ్రూపు 1 మెయిన్స్ పరీక్ష పత్రాలను ఆయన ఆదేశాలతో అక్రమంగా హాయ్‌ల్యాండ్‌కు తరలించారు. మధుసూదన్ క్యామ్‌సైన్ అనే మీడియా సంస్థను నిర్వహిస్తారు. ఆయన తన వద్ద పనిచేసే సిబ్బందితోపాటు కొందరు గృహిణులు, చిన్నపిల్లల తల్లులకు డబ్బులుఇచ్చి వారితో ఈ పని చేయించారు. ఈ ప్రక్రియలో 66మంది పాల్గొన్నారు. డిజిటల్ మూల్యాంకనంలో వచ్చిన మార్కులు చూసి మళ్లీ ఓంఎంఆర్ షీట్లపై వారితో రాయించారు. వారిలో ఒక్కరూ అర్హులు లేరు. గృహిణులు, చిన్నపిల్లల తల్లులను ఎంపిక చేసి ఎగ్జామినర్, క్యాంప్ ఆఫీసర్, స్కూృటినైజర్ అంటూ తప్పుడు హోదాలతో సంతకాలు చేయించారు. అత్యంత గోప్యంగా జరిగిన ఈ ప్రక్రియంతా మోసమే. ఈ రహస్య కార్యాచరణ కోసం ఏపీపీఎస్‌సీ నుంచి ధాత్రి మధు సంస్థకు రూ.1.14కోట్లు అందాయి. ఈ మూల్యాంకన ప్రక్రియపై ఐదుగురు ఏపీపీఎ్‌ససీ ఉద్యోగులు అభ్యంతరం వ్యక్తంచేయగా వారిపై పీఎస్‌ఆర్ మండిపడ్డారు.
కామ్‌సైన్ మధుకు 21 వరకు రిమాండ్
పీఎస్‌ఆర్‌పై పీటీ వారెంట్.. నేడు కోర్టులో హాజరు
ఏపీపీఎస్సీ గ్రూప్-1 పరీక్ష పత్రాల మూల్యాంకనంలో అక్రమాల కేసులో కామ్‌సైన్ సంస్థ డైరెక్టర్ పమిడికాల్వ మధుసూదన్‌కు విజయవాడ కోర్టు ఈనెల 21 వరకు రిమాండ్ విధించింది. మధుసూదన్‌కు పోలీసులు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో బుధవారం వైద్య పరీక్షలు చేయించిన అనంతరం ఒకటో ఏజేసీజే మేజిస్ట్రేట్ కోర్టులో హజరుపరిచారు. కేసు డైరీని పరిశీలించిన న్యాయాధికారి దేవిక ఆయనకు రిమాండ్ విధించారు. అనంతరం అతన్ని విజయవాడలోని జిల్లా జైలుకు తరలించారు. ఇక ఈ కేసులో ప్రధాన నిందితుడు పీఎస్‌ఆర్ ఆంజనేయులును కోర్టులో హాజరుపరిచేందుకు పోలీసులు పీటీ వారెంట్ దాఖలు చేశారు. కాదంబరి జెత్వానీ కేసులో ప్రస్తుతం ఆంజనేయులు విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.