Share News

Andhra Pradesh High Court: ఆ పత్రాలను.. హాయ్‌ల్యాండ్‌కు పంపాలన్న నిర్ణయం ఎవరిది..?

ABN , Publish Date - Nov 04 , 2025 | 05:51 AM

ఏపీపీఎస్సీ స్ట్రాంగ్‌ రూమ్‌లో ఉన్న గ్రూప్‌ 1 మెయిన్స్‌ జవాబు పత్రాలను మూల్యాంకనం నిమిత్తం హాయ్‌ల్యాండ్‌కు తరలించాలని ఎవరు..

Andhra Pradesh High Court: ఆ పత్రాలను.. హాయ్‌ల్యాండ్‌కు పంపాలన్న నిర్ణయం ఎవరిది..?

  • తిరిగి వాటిని ఎప్పుడు ఏపీపీఎస్సీకి తరలించారు?

  • బిల్లుల చెల్లింపు వివరాలను కోర్టు ముందుంచండి

  • అభ్యర్థుల జవాబుపత్రాలను సీల్డ్‌ కవర్‌లో ఇవ్వండి

  • ఏపీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం... తీర్పు రిజర్వ్‌

అమరావతి, నవంబరు 3(ఆంధ్రజ్యోతి): ఏపీపీఎస్సీ స్ట్రాంగ్‌ రూమ్‌లో ఉన్న గ్రూప్‌-1 మెయిన్స్‌ జవాబు పత్రాలను మూల్యాంకనం నిమిత్తం హాయ్‌ల్యాండ్‌కు తరలించాలని ఎవరు నిర్ణయించారని హైకోర్టు ప్రశ్నించింది. ‘‘ఏపీపీఎస్సీనే ఈ నిర్ణయం తీసుకుందా?. అప్పటి చైర్మన్‌, సెక్రెటరీ సూచనలకు అనుగుణంగా వాటిని తరలించారా?. దీనికి సంబంధించి ఏమైనా ఉత్తర్వులు ఉన్నాయా?. అనే విషయంపై స్పష్టత ఇవ్వండి.’’ అని ఏపీపీఎస్సీని హైకోర్టు ఆదేశించింది. హాయ్‌ల్యాండ్‌కు తరలించిన జవాబు పత్రాలను ఏపీపీఎస్సీ కార్యాలయానికి తిరిగి ఎప్పుడు తీసుకొచ్చారనే వివరాలను కూడా తమ ముందు ఉంచాలని స్పష్టం చేసింది. హాయ్‌ల్యాండ్‌లో మొదటిసారి మాన్యువల్‌ మూల్యాంకనం జరిగిందని, దీనికోసం ఏపీపీఎస్సీ సొమ్ము చెల్లించిందని అభ్యర్థులు సదరు చెక్కు వివరాలతో సహా చెబుతున్న నేపథ్యంలో చెల్లింపులు ఏమైనా జరిగాయా?. దేని నిమిత్తం ఆ సొమ్ము చెల్లించారనే విషయంపై స్పష్టత ఇవ్వాలని ఆదేశించింది. 2022, జూన్‌ 24న హైకోర్టు డివిజనల్‌ బెంచ్‌ ఉత్తర్వులకు అనుగుణంగా అభ్యర్థుల జవాబు పత్రాలను సీల్డ్‌ కవర్‌లో ధర్మాసనం ముందు ఉంచేందుకు సిద్ధంగా ఉన్నామని అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) చెప్పిన వివరాలను నమోదు చేసింది. ధర్మాసనం అడిగిన ఇతర వివరాలు సమర్పించేందుకు ఏజీ సమయం కోరడంతో అప్పీళ్లపై తదుపరి విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ బట్టు దేవానంద్‌, జస్టిస్‌ హరిహరనాథశర్మతో కూడిన ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.


తీర్పు ప్రతి సిద్ధం చేస్తుండగా..

2018 నాటి నోటిఫికేషన్‌ ఆధారంగా ఏపీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని గతంలో హైకోర్టు ఏకసభ్య ధర్మాసనం నిర్ధారించింది. ఈ నేపథ్యంలో 2022, మే 26న ఏపీపీఎస్సీ ఇచ్చిన అర్హుల జాబితాను హైకోర్టు సింగిల్‌ జడ్జి రద్దు చేశారు. మరోసారి పరీక్ష నిర్వహించి ఎంపిక ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేయాలని ఆదేశిస్తూ 2024, మార్చి 13న తీర్పు ఇచ్చారు. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ ఏపీపీఎస్సీ సహా ఉద్యోగాలు పొందిన వారు ధర్మాసనం ముందు అప్పీల్‌ దాఖలు చేశారు. అలాగే తీర్పులోని కొంతభాగంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ మరికొందరు అప్పీల్‌ వేశారు. ఈ అప్పీళ్లపై ఇటీవల తుది విచారణ జరిపిన ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది. అయితే, తీర్పు ప్రతి సిద్ధం చేస్తుండగా 2022, జూన్‌ 24న కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల అమలులో లోపాలను గుర్తించిన ధర్మాసనం.. వాటిని నివృత్తి చేసుకునేందుకు మరోసారి విచారణ చేపట్టింది. విచారణ ప్రారంభమైన వెంటనే ధర్మాసనం స్పందిస్తూ.. గ్రూప్‌-1 ప్రధాన పరీక్షలో ఎంపికైన అభ్యర్థులకు షెడ్యూల్‌ ప్రకారం ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక ప్రక్రియను కొనసాగించేందుకు అనుమతిస్తూ 2022, జూన్‌ 24న డివిజన్‌ బెంచ్‌ పలు షరతులు విధించిందని గుర్తు చేసింది. ‘‘ఫలితాల ప్రకటన, పోస్టింగ్‌ ఆర్డర్స్‌ కోర్టు ఇచ్చే తుది తీర్పుకి లోబడి ఉంటాయని, ఈ విషయాన్ని పోస్టింగ్‌ ఆర్డర్స్‌లో ప్రస్తావించాలని, అలాగే కోర్టు ఇచ్చే తుది తీర్పుకి కట్టుబడి ఉంటామని, భవిష్యత్తులో చట్టబద్ధమైన హక్కు కోరబోమని పోస్టింగ్‌ తీసుకున్న అభ్యర్థుల నుంచి హామీపత్రం తీసుకోవాలని ఏపీపీఎస్సీని డివిజన్‌ బెంచ్‌ ఆదేశించింది. సింగిల్‌ జడ్జి వద్ద ఉన్న వ్యాజ్యాలలో ప్రతివాదులుగా చేరాలంటే ఎంపికైన అభ్యర్థులు చేరవచ్చని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలని ఏపీపీఎస్సీకి స్పష్టం చేసింది. అవసరమైతే పరిశీలించేందుకు వీలుగా డిజిటల్‌ మూల్యాంకనంలో ఇంటర్వ్యూకు అర్హత సాధించిన అభ్యర్థుల జవాబు పత్రాలతో పాటు మాన్యువల్‌ విధానంలో వారు సాధించిన మార్కుల వివరాలు, అలాగే మాన్యువల్‌ మూల్యాంకనం ద్వారా ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జవాబు పత్రాలను సీల్డ్‌ కవర్‌లో రిజిస్ట్రార్‌ జ్యుడీషియల్‌కు అందజేయాలని ఏపీపీఎస్సీని ఆదేశించింది. ఈ ఆదేశాలు అమలు చేశారా?.’’ అని ఏపీపీఎస్సీని ప్రశ్నించింది. డిజిటల్‌ మూల్యాంకనం జరిపినప్పుడు జబాబుపత్రాలకు ఉన్న ఓఎంఆర్‌ షీట్లు, బార్‌కోడ్‌లు వినియోగించలేదని అభ్యర్థులు చెబుతున్న నేపథ్యంలో జవాబు పత్రాలకు అవి జత చేసి ఉన్నాయా? అనే విషయాన్ని పరిశీలించాల్సి ఉందని పేర్కొంది.


హామీ పత్రాలు తీసుకున్నాం: ఏజీ

ఏపీపీఎస్సీ తరఫున అడ్వొకేట్‌ జనరల్‌(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ బదులిస్తూ.. ‘‘డివిజన్‌ బెంచ్‌ ఉత్తర్వులకు అనుగుణంగా ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల నుంచి హామీపత్రం తీసుకున్నాం. ఏకసభ్య ధర్మాసనం వద్ద ఉన్న వ్యాజ్యాలలో ఇంప్లీడ్‌ అవుతామని కూడా ఎంపికైన అభ్యర్థులు హామీ ఇచ్చారు. అభ్యర్థుల జవాబుపత్రాలు, మార్కుల వివరాలను సీల్డ్‌ కవర్‌లో రిజిస్ట్రార్‌(జ్యుడీషియల్‌) వద్ద ఉంచలేదు. రిట్‌ అప్పీళ్ల తుది విచారణ సందర్భంగా వాటిని కోర్టు ముందు ఉంచితే సరిపోతుందని ఏపీపీఎస్సీ తరఫున అప్పటి సీనియర్‌ న్యాయవాది సలహా ఇచ్చినట్లు తెలిసింది. ఈ నెల 5 నాటికి జవాబు పత్రాలను సీల్డ్‌ కవర్‌లో కోర్టు ముందు ఉంచుతాం. హాయ్‌ల్యాండ్‌లో మాన్యువల్‌ మూల్యాంకనం జరిపారు. దీనికిగాను సొమ్ము చెల్లించారని పిటిషనర్లు చేస్తున్న ఆరోపణలకు సంబంధించిన బిల్లులు అందుబాటులో ఉంటే, వాటిని కూడా కోర్టు ముందు ఉంచుతాం. దీనికి కొంత సమయం కావాలి.’’ అని ఏజీ అభ్యర్థించారు.

Updated Date - Nov 04 , 2025 | 06:40 AM