Share News

High Court: దయనీయ స్థితిలోసంక్షేమ హాస్టళ్లు

ABN , Publish Date - Jul 17 , 2025 | 04:21 AM

రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ, బీసీ, గురుకుల హాస్టళ్లు, అక్కడ చదివే విద్యార్థుల పరిస్థితి దయనీయంగా ఉందని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది.

High Court: దయనీయ స్థితిలోసంక్షేమ హాస్టళ్లు

అక్కడ పరిస్థితులు ఆందోళనకరం

  • వాటిల్లో కంటే పిల్లలు ఇంటి వద్ద ఉండటమే మేలు

  • పరిస్థితి చక్కదిద్దేందుకు ఏమి చర్యలు తీసుకుంటున్నారు?

  • నిర్దిష్ట ప్రతిపాదనలతో మా ముందుకు రండి

  • సీఎస్‌, సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్‌కు హైకోర్టు ఆదేశం

అమరావతి, జూలై 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని సాంఘిక సంక్షేమ, బీసీ, గురుకుల హాస్టళ్లు, అక్కడ చదివే విద్యార్థుల పరిస్థితి దయనీయంగా ఉందని హైకోర్టు ధర్మాసనం పేర్కొంది. రాష్ట్రంలోని ఉమ్మడి 13 జిల్లాల్లో ప్రభుత్వం నిర్వహించే 65 హాస్టళ్లను పరిశీలించి డిస్ట్రిక్ట్‌ లీగల్‌ సర్వీసెస్‌ అథారిటీ అధికారులు సమర్పించిన నివేదికను చూసి విస్మ యం వ్యక్తం చేసింది. హాస్టళ్లలో విద్యార్థులకు శుభ్రమైన తాగునీరు, పౌష్టికాహారం అందడం లేదని, బెడ్లు, బెడ్‌ షీట్లు, దిండ్లు కూడా లేవని తెలిపింది. తగినన్ని మరుగుదొడ్లు, బాత్‌రూమ్‌లు లేవని తెలిపింది. చాలాచోట్ల హాస్టల్‌ భవనాలు కూలిపోయే దశలో ఉన్నాయని ఆందోళన వ్యక్తంచేసింది. నర్సీపట్నంలోని సాంఘిక సంక్షేమ బాలికల వసతి గృహంలో 228 మంది విద్యార్థినులుంటే అక్కడ ఒక మరుగుదొడ్డి, ఒక బాత్‌రూమ్‌ మాత్రమే వినియోగించే స్థితిలో ఉన్నాయంది. అలాగే విజయనగరంలోని ప్రభుత్వ అంధుల పాఠశాలలో 33 మంది విద్యార్థుల ఉండగా సహాయకుల పోస్టులు అన్నీ ఖాళీగా ఉన్నాయని పేర్కొంది. విజయనగరంలోని ఓ ప్రభుత్వ హాస్టల్‌లో 168 మంది విద్యార్థినులకు 10 గదులే అందుబాటులో ఉన్నాయని తెలిపింది. ప్రభుత్వ వసతి గృహాల్లో కంటే పిల్లలు తల్లిదండ్రులు వద్ద ఉండడమే మేలని వ్యాఖ్యానించింది. ఏ ఉద్దేశంతో ఈ వసతి గృహాలు ఏర్పాటు చేశారో అది నెరవేరడం లేదని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సాంఘిక సంక్షేమ, బీసీ, గురుకుల హాస్టళ్లు, పాఠశాలల్లో మౌలికవసతుల కల్పనకు రూ.633 కోట్లు కేటాయించామని ప్రభుత్వం చెబుతోందని ధర్మాసనం తెలిపింది. ఈ నేపథ్యంలో నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్‌ మార్గదర్శకాల ప్రకారం వసతుల కల్పన కోసం ఎంత సొమ్ము అవసరం అవుతుంది? పరిస్థితిని చక్కదిద్దేందుకు ఏమి చర్యలు తీసుకుంటున్నారు? నిర్దిష్ట ప్రతిపాదనలతో తమముందు హాజరుకావాలని రాష్ట్ర సీఎస్‌, సాంఘిక సంక్షేమశాఖ డైరెక్టర్‌ను ఆదేశించింది. ఈనెల 21న ఆన్‌లైన్‌ ద్వారా విచారణకు హాజరుకావాలంది. తదుపరి విచారణను 21కి వాయిదా వేస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్‌, జస్టిస్‌ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది.


2019-24 మధ్య నామమాత్రపు నిధులు: ఎస్‌జీపీ

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే సంక్షేమ హాస్టళ్లలో నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చైల్డ్‌ రైట్స్‌ మార్గదర్శకాల మేరకు కల్పించాల్సిన మౌలికసదుపాయాలు కూడా కల్పించకపోవడాన్ని సవాల్‌ చేస్తూ కాకినాడకు చెందిన కీతినీడి అఖిల్‌ శ్రీగురు తేజ 2023లో హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిల్‌ ఇటీవల విచారణకు రాగా... ప్రతీ జిల్లాలో కనీసం 5 సంక్షేమ హాస్టళ్లను పరిశీలించి నివేదిక సమర్పించాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థలను ధర్మాసనం ఆదేశించింది. కోర్టు ఆదేశాలకు అనుగుణంగా అధికారులు సంక్షేమ హాస్టళ్లను సందర్శించి హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఈ పిల్‌ బుధవారం మరోసారి విచారణకురాగా పిటిషనర్‌ తరఫున న్యాయవాది జి.అరుణ్‌శౌరి వాదనలు వినిపించారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) ఎస్‌.ప్రణతి వాదనలు వినిపిస్తూ.. గురుకుల హాస్టళ్లలో 2019-24 మధ్య మౌలికవసతుల కల్పనకు నామమాత్రం సొమ్ము కేటాయించారన్నారు. రూ.20 కోట్లు కూడా ఖర్చు చేయలేదన్నారు. ప్రస్తుత ఆర్థికసంవత్సరంలో మౌలికవసతులకు రూ.633 కోట్లు కేటాయించిందన్నారు.

Updated Date - Jul 17 , 2025 | 04:21 AM