AP Transport Minister : ‘ఉచిత బస్సు’ బాగుంది
ABN , Publish Date - Jan 04 , 2025 | 05:26 AM
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం త్వరలోనే అమలు చేస్తామని ఏపీ రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు.

కర్ణాటకలో పథకం బాగా అమలవుతోంది
త్వరలోనే సీఎం చంద్రబాబుకు నివేదిక ఇస్తాం: ఏపీ మంత్రులు
బెంగళూరు, జనవరి 3(ఆంధ్రజ్యోతి): మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం త్వరలోనే అమలు చేస్తామని ఏపీ రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్‌రెడ్డి తెలిపారు. ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి, పలువురు అధికారుల బృందంతో కలిసి ఆయన శుక్రవారం బెంగళూరులో పర్యటించారు. శాంతినగర్ డిపోలో బస్సుల మరమ్మతు, నిర్వహణా విధానాలను పరిశీలించారు. మెట్రో ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సులో ప్రయాణించి శక్తి గ్యారెంటీ పథకంపై మహిళలను అడిగి తెలుసుకున్నారు. విధానసౌధలో ముఖ్యమంత్రి సిద్దరామయ్య, కర్ణాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి, అధికారులతో పథకం అమలుపై చర్చించారు. అనంతరం ఏపీ మంత్రులు మీడియాతో మాట్లాడారు. ఏపీలో ఉచిత బస్సు ప్రయాణం అమలు చేసేందుకు ఈ పథకం అమలులో ఉన్న రాష్ట్రాలలో పర్యటిస్తున్నామని తెలిపారు. తమిళనాడు, ఢిల్లీలోనూ పర్యటించి రెండు నెలల్లో సీఎం చంద్రబాబుకు సమగ్ర నివేదికను అందిస్తామని వెల్లడించారు.