Share News

CM Chandrababu Naidu: గేట్స్‌ తో కలిసి క్యాన్సర్‌ నిర్మూలనకు కృషి

ABN , Publish Date - Jun 01 , 2025 | 04:15 AM

ఆంధ్రప్రదేశ్‌లో క్యాన్సర్ నివారణ కోసం బిల్‌గేట్స్‌ ఫౌండేషన్‌తో కలిసి చర్యలు తీసుకోనున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. కోనసీమ జిల్లా చెయ్యేరు గ్రామంలో పీ4 కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రజల సమస్యలు కూడా ప్రత్యక్షంగా అడిగి తెలుసుకున్నారు.

CM Chandrababu Naidu: గేట్స్‌ తో కలిసి క్యాన్సర్‌ నిర్మూలనకు కృషి

ప్రజల ఆరోగ్య వివరాలు ఆన్‌లైన్‌లోకి: చంద్రబాబు

అమలాపురం, మే 31(ఆంధ్రజ్యోతి): క్యాన్సర్‌ను నిరోధించడంతో పాటు రాకుండా చేసేందుకు ఏ చర్యలు చేపట్టాలనే దానిపై ప్రభుత్వం ఆలోచన చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇందుకోసం బిల్‌గేట్స్‌ ఫౌండేషన్‌తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఒక కార్యాచరణ చేపట్టనుందని వెల్లడించారు. శనివారం డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా కాట్రేనికోన మండలం చెయ్యేరు గ్రామంలో బంగారు కుటుంబం(పీ4) కార్యక్రమం సందర్భంగా ప్రజావేదిక సభలో సీఎం మాట్లాడారు. బిల్‌గేట్స్‌కు వచ్చే ఆదాయంలో 99 శాతం ఫౌండేషన్‌ ద్వారా ఆరోగ్యం, వ్యవసాయం, ఉపాధి అంశాలకు ఖర్చు చేయాలని నిర్ణయించారని, రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించాలని కోరినట్టు చెప్పారు. టెక్నాలజీ ఆధారంగా ఎన్నో మార్పులు వస్తున్నాయంటూ తన చేతికి ఉన్న ఓ రింగ్‌ను చూపించి.. ‘ఇదేంటో మీకు తెలుసా? ఇది మానిటర్‌ రింగ్‌. ఎంతసేపు నిద్రపోవాలి, హార్ట్‌బీట్‌ ఎలా ఉంది, ఎంత కేలరీలు తినాలి’ అనే గైడెన్స్‌ ఇస్తుందని చంద్రబాబు చెప్పారు. చెయ్యేరు గ్రామానికి చెందిన మడికి లక్ష్మి అనే మహిళ మాట్లాడుతూ.. తన భర్త క్యాన్సర్‌తో చనిపోయాడని చెప్పారు. తనకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారని, సొంతిల్లు కూడా లేదని, పూట గడవడం కష్టంగా ఉందని, వితంతు పెన్షన్‌ ఇప్పించి ఇల్లు కట్టించి ఆదుకోవాలని అభ్యర్థించారు. హాస్టల్‌లో ఉంటూ ఇంటర్మీడియట్‌ చదువుతున్న లక్ష్మి పెద్దకుమార్తెను.. ‘నువ్వు ఏం కావాలనుకుంటున్నావ్‌’ అని సీఎం అడిగారు. తాను డాక్టర్‌ కావాలని కోరుకుంటున్నానని ఆ అమ్మాయి చెప్పింది. మరో అమ్మాయి ఐపీఎస్‌ కావాలనుకుంటున్నానని బదులిచ్చింది. గ్రామానికి చెందిన ప్రముఖ వ్యక్తి త్సవటపల్లి నాగేంద్రరావు వీరిని దత్తత తీసుకుంటానని ప్రకటించారు. వారికి చేదోడు వాదోడుగా ఉంటానని, ఇల్లు నిర్మాణం పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో మరో 4 కుటుంబాలను దత్తత తీసుకుంటానని ప్రకటించారు.


సొంత ఇల్లు కూడా లేదు: సత్యవతి

చెయ్యేరుకు చెందిన ఉప్పలగుప్తం సత్యవతి ప్రజావేదికపై మాట్లాడారు. తన భర్త ఓ చెట్టుకింద ఇస్ర్తీ చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడని, తమకు సొంత ఇల్లు కూడా లేదని, ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. ఆమె కుటుంబానికి ఇల్లు మంజూరు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. దాతగా ముందుకు వచ్చిన మంతెన రామరాజు స్పందిస్తూ.. సత్యవతి పిల్లలు చదువుకునేంత వరకు తానే బాధ్యత తీసుకుంటానని, ఇల్లు నిర్మాణంలో సహకారం అందిస్తానని, కిరాణా వ్యాపారం పెట్టుకునేందుకు ప్రోత్సహిస్తానని హామీ ఇచ్చారు.

15 నిమిషాలు కూలీలతో సీఎం ముచ్చట్లు

చెయ్యేరు గ్రామంలో రూ.9.86 లక్షల వ్యయంతో చేపట్టనున్న చెరువు పూడికతీత పనులకు చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఉపాధి మహిళా కూలీలతో ముచ్చటించారు. వారితో కలిసి చెరువు గట్టున తిరుగుతూ ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ల పథకంపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. గ్రామంలో ఉన్న టీడీపీ నాయకుల పనితీరుపై అడిగి తెలుసుకున్నారు. ఉపాధి కూలీల సమస్యలను చంద్రబాబు అడిగి తెలుసుకున్నారు. 15నిమిషాల పాటు వారితో గడిపారు. ఇద్దరు ఉపాధి కూలీలకు సీఎం పింఛను సొమ్ముఅందజేశారు.


ఇవి కూడా చదవండి

శ్రీకాంత్‌ ఫ్యామిలీకి ప్రత్యేక పూజ.. అర్చకుడిపై వేటు

కలెక్టరేట్‌లో కరోనా.. ఐసోలేషన్‌కు ఉద్యోగులు

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 01 , 2025 | 04:15 AM