Share News

AP State Government : మద్యం లైసెన్సీలకు ఊరట

ABN , Publish Date - Jan 01 , 2025 | 03:47 AM

మద్యం షాపుల పాలసీ విషయంలో రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఇస్తున్న తక్కువ మార్జిన్‌తో నష్టపోతున్నామని ఆవేదన చెందుతున్న లైసెన్సీలకు ఊరటనిచ్చింది.

AP State Government : మద్యం లైసెన్సీలకు ఊరట

  • మార్జిన్‌ 14 శాతానికి పెంపు

  • గీత కులాలకు వారంలో 340 షాపులు

  • ముఖ్యమంత్రి ఆదేశం.. ఎక్సైజ్‌పై సమీక్ష

  • క్వార్టర్‌ రూ.99 మద్యంతో ఆదాయం రావడం లేదన్న అధికారులు

  • అయినా తప్పదన్న సీఎం.. అన్ని చోట్లా అందుబాటులో ఉంచాలని స్పష్టీకరణ

  • బెల్టు షాపులపై కఠినంగా వ్యవహరించాలని నిర్దేశం

అమరావతి, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): మద్యం షాపుల పాలసీ విషయంలో రాష్ట్రప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వం ఇస్తున్న తక్కువ మార్జిన్‌తో నష్టపోతున్నామని ఆవేదన చెందుతున్న లైసెన్సీలకు ఊరటనిచ్చింది. ప్రస్తుతం సగటున 10.5 శాతం ఉన్న మార్జిన్‌ను 14 శాతానికి పెంచాలని నిర్ణయించింది. మంగళవారమిక్కడ ఎక్సైజ్‌ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు జరిపిన సమీక్షలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అలాగే కూటమి మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 10 శాతం మద్యం షాపులను గీత కులాలకు కేటాయించడంపైనా చర్చించారు. వారం రోజుల్లో షాపుల కేటాయింపుపై నోటిఫికేషన్‌ జారీచేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. అంటే 340 షాపులు గీత కులాలకు దక్కుతాయి. వారికి 50 శాతం లైసెన్స్‌ ఫీజుతోనే షాపులు కేటాయిస్తారు. కల్లు గీతపై ఆధారపడే గౌడ, యాత, సోంది, శెట్టిబలిజ, ఈడిగ, గామల్ల, కలాలీ, శ్రీశయన, శెడిగ, గౌండ్ల కులాలకు వీటిని కేటాయిస్తారు. ఒకరికి ఒక షాపు మాత్రమే కేటాయిస్తారు. ఈ షాపుల కాలపరిమితి 2026 సెప్టెంబరు 30 వరకు ఉంటుంది.


  • ఆదాయం తక్కువొచ్చినా సరే..

క్వార్టర్‌ రూ.99 మద్యం అందుబాటులోకి తేవడంతో అనుకున్న స్థాయిలో ఆదాయం రావడం లేదని అధికారులు ఈ సందర్భంగా వివరించారు. 21 శాతం అమ్మకాలు అవే ఉన్నాయన్నారు. 72 శాతం అమ్మకాలు జరుగుతున్న 19 రకాల బ్రాండ్ల ధరలు తెలంగాణ కంటే మన వద్దే తక్కువని తెలిపారు. ప్రభుత్వానికి ఆదాయం తగ్గినా తక్కువ రేటు మద్యం అన్ని చోట్లా అందుబాటులో ఉంచాలని సీఎం స్పష్టంచేశారు. అలాగే బెల్టు షాపుల విషయంలో కఠినంగా వ్యవహరించాలన్నారు. మద్యం తయారీ, సరఫరా, అమ్మకాలను టెక్నాలజీ ద్వారా పర్యవేక్షించాలని.. ఇతర రాష్ర్టాల మద్యం, నకిలీ మద్యం రాకుండా చూడాలని చెప్పారు. గత ఆరు నెలల్లో బెల్టులపై 8,842 కేసులు నమోదుచేసి, 26వేల లీటర్ల మద్యం సీజ్‌ చేసినట్లు అధికారులు తెలిపారు. బెల్టులకు మద్యం అమ్మిన షాపులపైనా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. నాటుసారా నియంత్రణకు నవోదయం 2.0 పేరుతో జనవరి నుంచి కొత్త కార్యక్రమం ప్రారంభిస్తున్నామని అధికారులు చెప్పారు. సమీక్షలో ఎక్సైజ్‌ మంత్రి కొల్లు రవీంద్ర, ఉన్నతాధికారులు ఎంకే మీనా, నిషాంత్‌ కుమార్‌, రాహుల్‌దేవ్‌శర్మ పాల్గొన్నారు.

Updated Date - Jan 01 , 2025 | 03:47 AM