Share News

P Narayana: సింగపూర్‌లో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన.. వరుస కీలక భేటీలు

ABN , Publish Date - Jul 31 , 2025 | 04:09 PM

సింగపూర్‌లో ఏపీ మంత్రి పి. నారాయణ పర్యటన కొనసాగుతోంది. అందులోభాగంగా వివిధ సంస్థలతో ఆయన సమావేశమవుతున్నారు.

P Narayana: సింగపూర్‌లో కొనసాగుతున్న మంత్రి నారాయణ పర్యటన.. వరుస కీలక భేటీలు
AP Minister P Narayana

సింగపూర్, జులై 31: సింగపూర్‌లో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి. నారాయణ పర్యటన కొనసాగుతోంది. రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి ఆయన అధ్యయనం చేస్తున్నారు. అందులో భాగంగా గురువారం సింగపూర్ ల్యాండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ ప్రతినిధులతో మంత్రి నారాయణతోపాటు సీఆర్డీయే కమిషనర్ కన్నబాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రాజధాని అమరావతి ప్రాంతంలో రోడ్డు రవాణాపై వారితో చర్చించారు. సింగపూర్‌లో ఉపరితల రవాణా మౌలిక వసతుల కల్పనను ల్యాండ్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ పర్యవేక్షిస్తోంది. ప్రజా రవాణా వ్యవస్థ, వాకింగ్, సైక్లింగ్ ట్రాక్‌ల ఏర్పాటును ఈ అథారిటీ పర్యవేక్షించనుంది.


ఇక సింగపూర్‌లో జేటీసీ పౌల్ట్రీ ప్రాసెసింగ్ హబ్‌ను సైతం మంత్రి నారాయణ బృందం సందర్శించింది. ఈ యూనిట్‌ సింగపూర్‌లోని మొట్టమొదటి వన్ స్టాప్ పౌల్ట్రీ ప్రాసెసింగ్ యూనిట్‌గా పని చేస్తుంది. అంటే.. లైవ్ చికెన్, చికెన్ ప్రాసెసింగ్, ప్యాకింగ్, డెలివరీ చేస్తున్న విధానాలను ఈ బృందం అధ్యాయనం చేసింది. ఇక చికెన్ వ్యర్థాలతో సైతం ఇతర ఉత్పత్తులను ఈ యూనిట్ తయారు చేస్తుంది. రాష్ట్రంలో చికెన్ వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో ప్రాసెస్ చేసే ఈ తరహా యూనిట్లను ఏర్పాటు చేసే దిశా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది.


బ్రాండ్ ఏపీ ప్రమోషన్‌ కోసం.. రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా జులై 26వ తేదీన సింగపూర్‌కు సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, టీజీ భరత్, పి నారాయణతోపాటు పలువురు ఉన్నతాధికారులు రాజధాని అమరావతి నుంచి బయలుదేరి వెళ్లిన విషయం విదితమే. ఈ పర్యటనలో భాగంగా సింగపూర్ దేశాధ్యక్షుడితో సీఎం చంద్రబాబు ప్రతినిధి బృందం సమావేశమైంది. అలాగే పలు దిగ్గజ సంస్థల ప్రతినిధులు, కంపెనీ సీఈఓలు, పారిశ్రామికవేత్తలతో సైతం సమావేశం అయింది.


ఆ క్రమంలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో ఉన్న అవకాశాలు, వనరులు, ప్రభుత్వం ఇస్తున్న రాయితీలు, పారిశ్రామిక పాలసీ, భూమి లభ్యత తదితర అంశాలను ఈ సందర్భంగా వారికి సీఎం చంద్రబాబుతోపాటు ప్రతినిధి బృందం సోదాహరణంగా వివరించారు. అలాగే ఈ ఏడాది నవంబర్‌లో విశాఖపట్నం వేదికగా జరగనున్న సదస్సుకు సింగపూర్‌లోని పారిశ్రామికవేత్తలను ఆహ్వానించింది. ఈ పర్యటన ముగించుకుని సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం సింగపూర్ నుంచి ఏపీకి బయలుదేరి వచ్చారు. ఇంకా మంత్రి నారాయణ ప్రతినిధి బృందం సింగపూర్‌లో పర్యటిస్తుంది.

ఈ వార్తలు కూడా చదవండి..

మద్యం స్కామ్‌లో స్వాధీనం చేసుకున్న సొమ్ముపై కోర్టు కీలక నిర్ణయం

ఏఆర్ కానిస్టేబుల్‌పై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సన్నిహితుడు దాడి

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Jul 31 , 2025 | 04:44 PM