AP High Court : ప్రాసిక్యూటర్ల నియామకంపై వివరణ ఇవ్వండి
ABN , Publish Date - Mar 06 , 2025 | 06:52 AM
రాష్ట్రంలోని కింది కోర్టుల్లో ప్రాసిక్యూటర్లు, సీనియర్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ ప్రాసిక్యూటర్ల నియామకం విషయంలో జరుగుతున్న జాప్యంపై వివరణ...
తదుపరి విచారణకు ఆన్‌లైన్‌లో మా ముందు హాజరుకండి
రాష్ట్ర సీఎస్‌కు హైకోర్టు ఆదేశం
అమరావతి, మార్చి 5(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని కింది కోర్టుల్లో ప్రాసిక్యూటర్లు, సీనియర్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ ప్రాసిక్యూటర్ల నియామకం విషయంలో జరుగుతున్న జాప్యంపై వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణకు ఆన్‌లైన్ ద్వారా తమ ముందు హాజరు కావాలని సీఎ్‌సకు స్పష్టం చేసింది. విచారణను మార్చి 19వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఆదేశాలిచ్చింది. రాష్ట్రంలోని కింది కోర్టుల్లో ప్రాసిక్యూటర్లు, సీనియర్ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ల ఖాళీలను భర్తీ చేయకపోవడంతో పెండింగ్ కేసుల సంఖ్య పెరిగిపోతోందని, ఆరు నెలల్లో ఖాళీలను భర్తీ చేసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది తాండవ యోగేష్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం బుధవారం మరోసారి విచారణకు రాగా పార్టీ ఇన్ పర్సన్ న్యాయవాది తాండవ యోగేష్ వాదనలు వినిపించారు. కోర్టుల అవసరాలకు అనుగుణంగా ప్రాసిక్యూటర్ల సంఖ్యను పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది(ఎ్‌సజీపీ) ప్రణతి స్పందిస్తూ... ‘పిటిషనర్ చెబుతున్న స్థాయిలో ప్రాసిక్యూటర్ల అవసరం ఉండదు. రాష్ట్రంలోని కోర్టుల్లో ఎంతమంది అవసరమో అధ్యయనం చేసేందుకు, వారి నియామకంలో నిబంధనలు రూపొందించేందుకు ప్రభుత్వం కమిటీని నియమించింది. ఈ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. వాటిని నోటిఫై చేసేందుకు మరికొంత సమయం పడుతుంది. విచారణను వాయిదా వేయాలి’ అని కోరారు.
ఏపీపీఎస్సీ నియామకాల నోట్ ఫైళ్లు మా ముందు ఉంచండి: హైకోర్టు
జగన్ ప్రభుత్వ హయాంలో జరిపిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) చైర్మన్, సభ్యుల నియామకానికి సంబంధించిన నోట్‌ఫైళ్లను తమ ముందు ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. విచారణను 19కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్‌సింగ్ ఠాకూర్, జస్టిస్ చీమలపాటి రవితో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఏపీపీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామకాలను సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం జరపడం లేదని పేర్కొంటూ న్యాయవాది తాండవ యేగేష్ 2022లో పిల్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యం బుధవారం మరోసారి విచారణకు రాగా, పిటిషనర్ తాండవ యేగేష్ వాదనలు వినిపించారు. కనీస అర్హతలు లేని రాజకీయ నాయకులు, మెడికల్ షాపులు నడిపేవారు, ఎల్‌ఐసీ ఏజెంట్లు, అధికార పార్టీతో అంటకాగినవారిని కమిషన్ సభ్యులుగా నియమించారని తెలిపారు. మార్గదర్శకాలకు విరుద్ధంగా నియామకాలు జరిగాయని, ఆ నోట్ ఫైళ్లను కోర్టు ముందు ఉంచేలా ఆదేశాలివ్వాలని కోరారు. ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్. ప్రణతి స్పందిస్తూ.. గత ప్రభుత్వంలో నియమితులైన సభ్యులు ఇప్పటికే కొంతమంది రాజీనామా చేయగా, మరికొందరు పదవీ విరమణ చేశారని పేర్కొన్నారు. ఏపీపీఎస్సీ చైర్మన్, సభ్యుల నియామక అర్హతల విషయంలో స్పెషల్ సీఎస్ నేతృత్వంలో వేసిన కమిటీ గతేడాది డిసెంబరులో నివేదిక ఇచ్చిందని, ఆ వివరాలతో అదనపు అఫిడవిట్ దాఖలు చేస్తామని నివేదించారు.