High Court: పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాల నిర్వహణకు ప్రణాళిక రూపొందించండి
ABN , Publish Date - May 13 , 2025 | 04:45 AM
ఏపీ హైకోర్టు పోలీస్ స్టేషన్లలో సీసీటీవీ కెమెరాల నిర్వహణకు సంబంధించిన ప్రణాళికను డీజీపీకి రూపొందించాలన్న ఆదేశం ఇచ్చింది. జూన్ 17 నాటికి ఈ ప్రణాళిక కోర్టు ముందు ఉంచాలని ఆదేశించింది.
జూన్ 17 విచారణ నాటికి సిద్ధం చేయండి
కోర్టు ధిక్కరణ పిటిషన్‌లో హైకోర్టు ధర్మాసనం ఆదేశం
అమరావతి, మే 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాల నిర్వహణ, వాటి మరమ్మతుల విషయంలో సంబంధిత అధికారులతో కలసి ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర డీజీపీని హైకోర్టు ఆదేశించింది. ఈ ప్రణాళికలో పలు అంశాలను పొందుపర్చాలని సూచించింది. సీసీ కెమెరాల నిర్వహణకు బాధ్యత వహించేలా ప్రతి జిల్లాలో ఓ అథారిటీ ఏర్పాటు చేయాలని ఆదేశించింది. సీసీ కెమెరాలతో పాటు సీసీటీవీ ఫుటేజ్ నిల్వలో ఏదైనా లోపాలు తలెత్తినప్పుడు సంబంధిత అథారిటీకి ఎలా తెలియజేయాలనే విధానాన్ని రూపొందించాలని స్పష్టం చేసింది. పరికరాలకు మరమ్మతులు, పాడైన వాటి స్థానంలో మరొక పరికరం ఏర్పాటు వంటివాటికి ‘టైమ్ ఫ్రేమ్’ నిర్ణయించాలని తెలిపింది. నిర్దేశిత సమయంలో సమస్యలు పరిష్కరించకుంటే సంబంధిత అధికారులను బాధ్యులను చేయాలని పేర్కొంది. జిల్లాల వారీగా సీసీ కెమెరాల, స్టోరేజ్ పరికరాల పనితీరుపై క్రమం తప్పకుండా నిర్ణీత కాలంలో టెక్నికల్ ఆడిట్ నిర్వహించాలని స్పష్టం చేసింది. తదుపరి విచారణ నాటికి ప్రణాళికను కోర్టు ముందు ఉంచాలని డీజీపీకి స్పష్టం చేసింది.
విచారణను జూన్ 17కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్.రఘునందనరావుతో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రంలోని పోలీస్ స్టేషన్లు, జైళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటుపై 2019లో న్యాయవాది తాండవ యేగేష్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. కెమెరాలు ఏర్పాటు చేయాలంటూ 2019 జూలై 15న ఆదేశాలిచ్చింది. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వుల అమలులో నిర్లక్ష్యం ప్రదర్శించవద్దని స్పష్టం చేసింది. ఏళ్లు గడుస్తున్నా ఉత్తర్వులు అమలు కాకపోవడంతో యోగేష్ 2022లో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు పల్నాడు జిల్లా, మాచవరం పోలీసులు తన సోదరుడు గోపిరాజును అక్రమంగా నిర్బంధించారని పేర్కొంటూ కటారు నాగరాజు గత ఏడాది నవంబరులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలు ఇటీవల విచారణకు రాగా పోలీస్ స్టేషన్లలో సీసీ కెమెరాల నిర్వహణకు ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర డీజీపీని ధర్మాసనం ఆదేశించింది.
ఇవి కూడా చదవండి..
Operation Sindoor: మళ్లీ అడ్డంగా దొరికిన పాక్..
Operation Sindoor: పాక్ ఎయిర్ బేస్‌ల ధ్వంసం.. వీడియోలు విడుదల
Operation Sindoor: పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం: ఎయిర్ మార్షల్ ఎ.కె. భార్తీ
For AndhraPradesh News And Telugu News