AP High Court : గ్రూప్-2 నోటిఫికేషన్‌పై హైకోర్టులో పిటిషన్లు
ABN , Publish Date - Feb 19 , 2025 | 04:34 AM
గ్రూప్-2 నోటిఫికేషన్‌లో మహిళలు, దివ్యాంగులు, ఎక్స్ సర్వీ్‌సమెన్, స్పోర్ట్స్ పర్సన్లకు ప్రత్యేక రిజర్వేషన్ పాయింట్లు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ
అనుబంధ పిటిషన్లపై తీర్పు రిజర్వ్
అమరావతి, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): గ్రూప్-2 నోటిఫికేషన్‌లో మహిళలు, దివ్యాంగులు, ఎక్స్ సర్వీ్‌సమెన్, స్పోర్ట్స్ పర్సన్లకు ప్రత్యేక రిజర్వేషన్ పాయింట్లు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై మంగళవారం హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం ఈ నెల 23న నిర్వహించనున్న ప్రధాన పరీక్షను నిలుపుదల చేయాలంటూ వేసిన అనుబంధ పిటిషన్లపై న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. ప్రధాన వ్యాజ్యాలపై కౌంటర్లు దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈమేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సత్తి సుబ్బారెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రోస్టర్ ఆఫ్ రిజర్వేషన్‌ను ఫిక్స్ చేసి గ్రూప్-2 పోస్టులకు తాజాగా నోటిఫికేషన్ ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ విశాఖకు చెందిన ఎం.పార్థసారథి, కడపకు చెందిన కనుపర్తి పెంచలయ్య మరో ఇద్దరు హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. గ్రూప్-2 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీలో మహిళలు, దివ్యాంగులు, ఎక్స్ సర్వీ్‌సమెన్, స్పోర్ట్స్ పర్సన్లకు ప్రత్యేకంగా రోస్టర్ స్లాట్స్ (రిజర్వేషన్ పాయింట్లు) కేటాయిస్తూ 2023 డిసెంబరు 7న ఏపీపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్‌ను చట్టవిరుద్ధమైనదిగా ప్రకటించాలని కోరారు. ఈ వ్యాజ్యాలు మంగళవారం విచారణకు రాగా పిటిషనర్ల తరఫున న్యాయవాదులు బొద్దులూరి శ్రీనివాసరావు, జీవీ శివాజీ వాదనలు వినిపించారు. ఏపీపీఎస్సీ ఇచ్చిన నోటిఫికేషన్.. రిజర్వేషన్ల అమలులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, ప్రభుత్వ జీవోకు విరుద్ధంగా ఉందన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, ప్రభుత్వ జీవోను కోర్టు ముందుంచారు. ఈ నెల 23న జరగే గ్రూప్-2 ప్రధాన పరీక్షను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. అడ్వొకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ ప్రిలిమినరీ పరీక్ష ఇప్పటికే ముగిసిందని, ప్రధాన పరీక్షను నిలువరించవద్దని కోరారు. ప్రధాన వ్యాజ్యంపై కౌంటర్ వేసేందుకు సమయం కోరారు.