PG Medical Reservations: పీజీ వైద్య విద్యలో రిజర్వేషన్లు
ABN , Publish Date - Aug 05 , 2025 | 04:18 AM
పీజీ వైద్య విద్య ప్రవేశాల్లో ప్రభుత్వ వైద్యుల రిజర్వేషన్ కోటా ను సర్కారు నిర్ధారించింది. దీనికి సంబంధించి ఆరోగ్యశాఖ
నాన్ క్లినికల్‌లో 30ు చొప్పున వర్తింపు
స్పెషలిస్టుల అవసరాల మేరకు ఖరారు
ఆమోదం తెలిపిన సీఎం చంద్రబాబు
అమరావతి, ఆగస్టు 4(ఆంధ్రజ్యోతి): పీజీ వైద్య విద్య ప్రవేశాల్లో ప్రభుత్వ వైద్యుల రిజర్వేషన్ కోటా ను సర్కారు నిర్ధారించింది. దీనికి సంబంధించి ఆరోగ్యశాఖ చేసిన ప్రతిపాదనలను సీఎం చంద్రబాబు ఆమోదించారు. 2028-29 సంవత్సరానికిగాను ప్రభుత్వాసుపత్రుల్లో క్లినికల్, నాన్ క్లినికల్ స్పెషలిస్టుల అవసరాన్ని మదింపు చేసిన ప్రభుత్వం.. రిజర్వేషన్‌పై నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేసే వైద్యుల ఆకాంక్షలను కూడా పరిగణనలోకి తీసుకుంది. 7 క్లినికల్ కోర్సుల్లో 15 శాతం రిజర్వేషన్ కల్పించాలని నిర్ణయించింది. వీటితో పాటు 9 నాన్‌క్లినికల్ కోర్సుల్లో 30 శాతం రిజర్వేషన్ కల్పించారు. 1,144 ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్న 2,288 మంది వైద్యుల ఆకాంక్షను దృష్టిలో పెట్టుకుని రిజర్వేషన్‌పై నిర్ణయం తీసుకున్నామని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. ఉన్నతాధికారుల కమిటీ మదింపు చేసి వివిధ విభాగాల్లో అవసరాలను గుర్తిస్తూ నివేదిక ఇచ్చిందన్నారు. ఉన్నత విద్యను అభ్యసించాలనే ప్రభుత్వ వైద్యుల ఆశలు, ఆకాంక్షలను కూడా పరిగణనలోకి తీసుకుని పీజీ కోర్సుల్లో రిజర్వేషన్లు కల్పించామని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద లభించే 50 శాతం కోర్సుల్లో ప్రభుత్వం నిర్ణయించిన రిజర్వేషన్ మేరకు వైద్యులకు ప్రవేశాలు లభించనున్నాయని తెలిపారు. 15 శాతం రిజర్వేషన్ ప్రకారం 7 క్లినికల్ విభాగాల్లో 154 సీట్లు, 9 నాన్ క్లినికల్ విభాగాల్లో 30 శాతం రిజర్వేషన్ మేరకు 118 సీట్లు ఉంటాయి.