AP Government: విదేశీ విద్యకు సర్కారు ఊతం
ABN , Publish Date - Oct 07 , 2025 | 04:19 AM
రాష్ట్రంలోని విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు మరో వరం ఇవ్వాలని నిర్ణయించారు. విదేశాల్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవాలనుకునే ప్రతి విద్యార్థికీ పావలా వడ్డీకే...
విద్యార్థులకు పావలా వడ్డీకే రుణాలు
వారి కలలకు రెక్కలు తొడుగుదాం
14 ఏళ్లలో రుణం చెల్లించే వెసులుబాటు
బ్యాంకులకు రాష్ట్ర ప్రభుత్వమే గ్యారంటీ
రెసిడెన్షియల్ సూళ్లుగా వసతిగృహాలు
ఒక కుటుంబం- ఒక పారిశ్రామికవేత్త.. అమలు బాధ్యత సంక్షేమ శాఖలదే
ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టీకరణ
అమరావతి, అక్టోబరు 6(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని విద్యార్థులకు ముఖ్యమంత్రి చంద్రబాబు మరో వరం ఇవ్వాలని నిర్ణయించారు. విదేశాల్లో గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవాలనుకునే ప్రతి విద్యార్థికీ పావలా వడ్డీకే బ్యాంకు రుణాలుఇచ్చేలా సరికొత్త పథకాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, దివ్యాంగుల సంక్షేమంపై మంత్రులు డోలా బాలవీరాంజనేయస్వామి, ఫరూఖ్, సవిత, ఆయాశాఖల ఉన్నతాధికారులతో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఎంతమంది విద్యార్థులైనా చదువుకునే వీలుండేలా ఈ పథకం ఉండాలని అధికారులకు నిర్దేశించారు. ఐఐటీ, ఐఐఎం, నిట్ వంటి ఉన్నత విద్యా సంస్థల్లో చదవాలనుకునే వారికి కూడా పథకం వర్తింపజేయాలని సూచించారు. ‘‘4 శాతం వడ్డీకే బ్యాంకులు రుణాలు ఇవ్వడంతోపాటు, వాటికి ప్రభుత్వమే గ్యారంటీ ఇస్తుంది. 14 ఏళ్ల పాటు రుణాలు చెల్లించుకునే వెసులుబాటు కల్పిస్తాం. ఐఐటీ, నీట్ ఎంట్రన్స్‌కు సిద్ధమవుతున్న బీసీ విద్యార్థుల కోసం రెండు ప్రాంతాల్లో శిక్షణా కేంద్రాలు ఏర్పాటుచేస్తాం’’ అని చంద్రబాబు తెలిపారు.
ఆ స్కూళ్లు జూనియర్ కాలేజీలుగా మార్పు
రాష్ట్రంలోని అన్ని సంక్షేమ హాస్టళ్లనూ రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చడంపై అధ్యయనం చేయాలని, దీనిపై సమగ్ర నివేదిక అందించాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ‘‘ప్రతి విద్యార్థికీ నాణ్యమైన విద్యను అందించాలన్నదే ప్రభుత్వ సంకల్పం. హాస్టళ్లలో మౌలిక వసతులు, సౌకర్యాల కల్పనతోపాటు ఏడాది వ్యవధిలో మరమ్మతులు పూర్తి చేయాలి’’ అని ఆదేశించారు. నసనకోట, ఆత్మకూరు బీసీ బాలికల పాఠశాలలను రూ.2.65 కోట్లతో జూనియర్ కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేసేందుకు సీఎం అనుమతించారు. అలాగే తల్లికి వందనం పథకం నుంచి పాఠశాల నిర్వహణ నిధి, టాయిలెట్ మెయింటినెన్స్ ఫండ్‌కు నిధులిస్తామని వెల్లడించారు. అన్ని రెసిడెన్షియల్ స్కూళ్ల హాస్టళ్లలో సౌర విద్యుత్ ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలన్నారు. గత ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కింద చెల్లించాల్సిన రూ.1,700 కోట్లు చెల్లించకపోవడం వల్ల విద్యార్థులే రూ.900 కోట్లు కాలేజీలకు చెల్లించాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. ఇంకా యాజమాన్యాలకు రూ.800 కోట్ల బకాయి ఉన్నట్లు వివరించారు.
ఖర్చుపెడుతున్న స్థాయిలో ఫలితాలు లేవు : సీఎం అసంతృప్తి
సంక్షేమశాఖలు ‘వన్ ఫ్యామిలీ--వన్ ఎంటర్‌ప్రెన్యూర్’ విధాన అమలు బాధ్యత తీసుకోవాలని అధికారులకు చంద్రబాబు సూచించారు. ఈలక్ష్యం నెరవేరితే ఆయావర్గాలు ఆర్థికంగా బలోపేతం అవుతాయన్నారు. ఇమామ్‌లకు, పాస్టర్లకు బకాయిలు ఏమైనాఉంటే వెంటనే విడుదల చేయాలని ఆదేశించారు. హజ్ యాత్రకు దరఖాస్తుల గడువును పెంచాలని సూచించారు. ఆదరణ-3 కింద ఇచ్చే పనిముట్లు ఆధునికంగా ఆయా కుల వృత్తులకు ఉపయుక్తంగా ఉండాలని స్పష్టంచేశారు. రజకులకు గ్యాస్‌తో పనిచేసే ఇస్త్రీ పెట్టెలు, రాయితీపై సిలిండర్లు ఇచ్చే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. మత్స్యకారులు సీవీడ్ లాంటి సరికొత్త ప్రత్యామ్నాయాలను ఎంచుకునేలా చైతన్య పరచాలని సూచించారు. ‘‘వెనుకబడిన వర్గాల ఆదాయార్జనకు కొత్త మార్గాలను అన్వేషించాలి. ఉన్నత స్థానానికి ఈ వర్గాలను తీసుకువెళ్లడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నా ఆశించిన ఫలితాలు కనబడడం లేదు. ఈ వర్గాల్లో పథకాల పట్ల సంతృప్తిస్థాయిని పెంచాల్సిన బాధ్యత అధికారులదే. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పన విషయంలో న్యాయపరమైన ఆటంకాలు తలెత్తకుండాచూడాలి. పురోగతిలో ఉన్న నెల్లూరు, ఏలూరు, కర్నూలులోని బీసీ భవనాలను పూర్తి చేయండి. కార్పొరేషన్లలో అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాల అధ్యయనం కోసం వర్క్‌షాపులు నిర్వహించాలి’’ అని సీఎం సూచించారు. కాగా, ట్రిపుల్ ఐటీకి ఎంపికైన బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లకు చెందిన కొందరు విద్యార్థులు సీఎం చంద్రబాబు కలిశారు. ఉన్నత విద్యలో మరింతగా రాణించాలంటూ వారిని ఆయన అభినందించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
ఏపీలో భారీ అగ్ని ప్రమాదం.. ఏమైందంటే..
వాయుగుండం ఎఫెక్ట్.. ఏపీలో భారీ వర్షాలు