AP Hydroelectric Project: పోలవరం-బనకచర్లతో ఆదాయార్జన
ABN , Publish Date - Jun 04 , 2025 | 04:37 AM
పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకం ద్వారా రాష్ట్రానికి ఏటా రూ.2,765 కోట్ల ఆదాయం సమకూరుతుందని ఆర్థిక శాఖ పేర్కొంది. మొత్తం రూ.81,900 కోట్ల వ్యయంతో మూడు దశల్లో ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు.
ఏటా రూ.2,765 కోట్ల రాబడి.. కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వ నివేదన
మూడు దశల్లో నిర్మాణం
మొత్తం అంచనా రూ.81,900 కోట్లు
అందులో సగం విదేశీ రుణం
కేంద్రం నుంచి 16,380 కోట్లు
ప్రజెంటేషన్‌లో రాష్ట్ర ఆర్థిక శాఖ వెల్లడి
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రాష్ట్రప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న పోలవరం-బనకచర్ల అనుసంధాన పథకం.. స్వీయ ఆదాయార్జన ప్రాజెక్టుగా ఉంటుందని రాష్ట్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. జలవిద్యుత్ ప్రాజెక్టులు, ఇళ్లు, పరిశ్రమలకు నీటి సరఫరా ద్వారా ఏటా రూ2,763 కోట్లు ఆర్జించే వీలుందని తెలిపింది. పథకం అంచనా వ్యయం రూ.81,900 కోట్లని.. మూడు దశల్లో చేపడతామని సోమవారం కేంద్ర ఆర్థిక శాఖ అధికారులకు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో వెల్లడించింది. ఆ సమాచారం ‘ఆంధ్రజ్యోతి’కి అందింది. అంచనా వ్యయంలో 50 శాతం అంటే రూ.40,950 కోట్లు విదేశీ రుణంగా తీసుకోదలిచామని.. కేంద్రం 20 శాతం అంటే రూ.16,380 కోట్లు భరిస్తే.. రాష్ట్రం పది శాతం వాటా కింద రూ.8,190 కోట్లు ఖర్చుచేస్తుందని.. మిగతా 20 శాతం వాటాను అంటే.. రూ.16,380 కోట్లను ప్రైవేటు సంస్థల ద్వారా సమీకరిస్తామని రాష్ట్ర ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్‌కుమార్ వివరించారు. ఈ ప్రాజెక్టుపై నిర్మించే పంప్డ్ స్టోరేజీ జల విద్యుత్ ప్రాజెక్టుల ద్వారా రూ.201 కోట్లు, చెరో 200 మెగావాట్ల సామర్థ్యంతో కూడిన రెండు హైడ్రో పవర్ ప్రాజెక్టుల ద్వారా రూ.651 కోట్లు, గృహాలకు మంచినీటి సరఫరా ద్వారా రూ.213 కోట్లు, పరిశ్రమలకు నీటి సరఫరాతో రూ.1,699 కోట్లు.. మొత్తంగా ఏటా రూ.2,765 కోట్ల ఆదాయం వస్తుందని వెల్లడించారు.
దశలవారీ నిర్మాణమిలా..
పోలవరం-బనకచర్ల పథకం తొలి దశలో గోదావరి వరదనీటిని తాడిపూడి వరద కాలువ ద్వారా పోలవరం కుడి ప్రధాన కాలువను కలుపుతూ 175 కి.మీ. మేర ప్రకాశం బ్యారేజీ దాకా 5,000 క్యూసెక్కుల చొప్పున తరలిస్తారు. ఇందుకయ్యే ఖర్చు రూ.13,800 కోట్లు.
ప్రకాశం బ్యారేజీ నుంచి నీటిని బొల్లాపల్లి రిజర్వాయరు(150 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తారు)కు తీసుకెళ్తారు. ఇందుకు రూ.35,750 కోట్లు ఖర్చవుతుంది.
బొల్లాపల్లి జలాశయం నుంచి బనకచర్ల హెడ్‌రెగ్యులేటర్‌కు నీటిని తరలిస్తారు. బొల్లాపల్లి వద్ద 200 మెగావాట్ల జలవిద్యుత్కేంద్రం నిర్మిస్తారు. ఎగువ చర్లోపల్లి రిజర్వాయరులోకి నీటిని తరలిస్తారు. 19.5 కి.మీ. టన్నెల్ తవ్వి సిద్దాపురం చెరువును నీటితో నింపుతారు. దానిపై రూ.582 కోట్లతో 600 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్లాంటు నిర్మిస్తారు. అక్కడే 6.6 కి.మీ. ఇంకో సొరంగం తవ్వుతారు. ఈ ప్రాంతంలో 200 మెగావాట్ల జల విద్యుత్కేంద్రం నిర్మిస్తారు. అక్కడి నుంచి బనకచర్ల రెగ్యులేటర్ వరకు తీసుకెళ్లి నీటిని ఎత్తిపోస్తారు. ఈ ప్రక్రియకు రూ.32,350 కోట్లు వ్యయమవుతుంది.
ఈ ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమలోని దుర్భిక్ష ప్రాంతాలకూ.. పల్నాడులోని కరువు ప్రాంతాలకు సాగు, తాగునీరు అందడమే గాక పారిశ్రామిక అవసరాలకు సరిపడా నీరివ్వడం సాధ్యపడుతుంది. మొత్తంగా 80 లక్షల మంది ప్రజలకు తాగునీరు, 91.4 లక్షల హెక్టార్ల ఆయకట్టు స్థిరీకరణ, కొత్తగా 3 లక్షల హెక్టార్లకు సాగునీరు, పరిశ్రమలకు 20 టీఎంసీల నీరు ఇవ్వాలన్నది ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ పథకంపై కేంద్రం సానుకూలంగా స్పందించింది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సమర్పిస్తే నిధుల మంజూరుపై కార్యాచరణను ప్రకటిస్తామని కేంద్ర ఆర్థిక శాఖ హామీ ఇచ్చినట్లు ఢిల్లీ వెళ్లిన ఉన్నతాధికారుల బృందం సభ్యుడొకరు వివరించారు.