Share News

AP FiberNet: ప్రైవేటుకు ఫైబర్‌నెట్‌

ABN , Publish Date - Jun 01 , 2025 | 03:14 AM

ఆంధ్రప్రదేశ్‌ ఫైబర్‌నెట్‌ సేవల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. వైసీపీ పాలనలో ఆర్థిక అవకతవకలు జరిగినట్లు దర్యాప్తులో తేలింది.

AP FiberNet: ప్రైవేటుకు ఫైబర్‌నెట్‌

కేంద్రం అనుమతి కోరిన మౌలిక సదుపాయాల శాఖ

ప్రభుత్వ పరిధిలోనే ఆస్తులు

నిర్వహణ మాత్రమే ప్రైవేటుకు

అమరావతి, మే 31(ఆంధ్రజ్యోతి): ఫైబర్‌నెట్‌ సేవల నిర్వహణను ప్రైవేటు సంస్థకు అప్పగించేందుకు రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పనా శాఖ(ఐఅండ్‌ఐ) సిద్ధమైంది. ఈ మేరకు కేంద్రాన్ని అనుమతి కోరింది. ఇప్పటిదాకా రాష్ట్రంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఏపీ ఫైబర్‌ నెట్‌ సేవలను సంస్థ స్వయంగా అందిస్తోంది. అయితే, వైసీపీ హయాంలో ఫైబర్‌నెట్‌ కార్పొరేషన్‌ ఆర్థిక కార్యకలాపాలు అస్తవ్యస్తంగా మారి దివాలా అంచుకు చేరింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఫైబర్‌నెట్‌ సేవలు అందిస్తున్న సిబ్బంది సమాచారం కూడా లభించని పరిస్థితి ఏర్పడింది. దీంతో.. ఫైబర్‌నెట్‌ కార్యకలాపాలపై దర్యాప్తు చేయాలని ప్రభుత్వం విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగాన్ని ఆదేశించింది. ఈ దర్యాప్తు తుదిదశకు చేరుకుంది. మరో పక్షం రోజుల్లోపే నివేదిక ప్రభుత్వానికి చేరనుంది. దీని ఆధారంగా భవిష్యత్‌ కార్యకలాపాలపై ప్రణాళికలు రచించేందుకు ఐఅండ్‌ఐ సిద్ధమైంది. 2019-24 మధ్య ఆర్థిక అవకతవకలు భారీగా జరిగాయని విచారణలో గుర్తించినట్టు తెలిసింది. ఉద్యోగ నియామకాల్లోనూ అక్రమాలు చోటు చేసుకున్నాయని తేలింది. వైసీపీ ముఖ్యనేతల అనుచరులకు చెందిన వాహన డ్రైవర్లు, తాడేపల్లి ప్యాలెస్‌ సూచించినవారికి మౌఖిక సిఫారసులతోనే ఉద్యోగాలు ఇచ్చారు. వారికి నెలకు 4 అంకెల జీతాన్ని చెల్లించారు. గత యాజమాన్య విధానంలోనే ఫైబర్‌నెట్‌ సేవలను విస్తరించాలంటే.. ఆర్థికంగా చాలా ఖర్చు చేయాల్సి ఉంటుందని భావిస్తున్న నేపథ్యంలో కేంద్రం సవరించిన ఫైబర్‌నెట్‌ పథకం కింద ప్రైవేటు సంస్థలకు నిర్వహణ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది. ఈ మేరకు అనుమతి ఇవ్వాలంటూ మే 21న డిజిటల్‌ భారత్‌ నిధి(డీబీఎన్‌) అడ్మినిస్ట్రేటర్‌ నీరజ్‌ వర్మకు ఐఅండ్‌ఐ కార్యదర్శి యువరాజ్‌ లేఖ రాశారు. అయితే, ఫైబర్‌ నెట్‌ ఆస్తులను ప్రభుత్వ నియంత్రణలోనే ఉంచనున్నారు. కేవలం సేవలను మాత్రమే ప్రైవేటుకు ఇవ్వనున్నారు. కేంద్రం నుంచి అనుమతి రాగానే కార్యాచరణను ప్రారంభించేందుకు ఐఅండ్‌ఐ సిద్ధమైంది.


ఇవి కూడా చదవండి

శ్రీకాంత్‌ ఫ్యామిలీకి ప్రత్యేక పూజ.. అర్చకుడిపై వేటు

కలెక్టరేట్‌లో కరోనా.. ఐసోలేషన్‌కు ఉద్యోగులు

Read Latest AP News And Telugu News

Updated Date - Jun 01 , 2025 | 03:14 AM