CM Chandrababu: పీ 4 అమలులో కీలక పరిణామం
ABN , Publish Date - Jul 04 , 2025 | 08:07 PM
పీ-4 పథకం సమర్థవంతంగా అమలు కావడం కోసం రెండు కమిటీలు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు నిర్ణయించారు. పీ-4 అమలు, పర్యవేక్షణ కోసం జిల్లా, నియోజకవర్గస్థాయి ఛాప్టర్లు ఏర్పాటుకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.
అమరావతి, జులై 04: పీ-4 అమలులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. అందులో భాగంగా పీ-4 భవిష్యత్తు కార్యాచరణపై సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. ఏపీ సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మరోవైపు ఈ సమావేశానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా, మండల స్థాయి అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పీ-4 పథకం సమర్థవంతంగా అమలు చేసేందుకు రెండు కమిటీలు ఏర్పాటు చేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. పీ -4 అమలు, పర్యవేక్షణ కోసం జిల్లా, నియోజకవర్గస్థాయి ఛాప్టర్లు ఏర్పాటుకు కీలక ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ కమిటీల్లో ఇన్‌ఛార్జ్ మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా, నియోజకవర్గ స్థాయి అధికారులు సభ్యులుగా ఉండనున్నారు.
ఆగస్టు 15వ తేదీ నాటికి 15లక్షల బంగారు కుటుంబాలు, లక్ష మంది మార్గదర్శకులను గుర్తించే లక్ష్యాన్ని సీఎం చంద్రబాబు నిర్దేశించారు. పీ-4 అమల్లో బాపట్ల జిల్లా నెంబర్ వన్ స్థానంలో నిలిచిందని ఆయన వెల్లడించారు. అదే విధంగా పీ-4 పథకం అమలుపై ప్రజల్లో నెలకొన్న సందేహాలను ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు దృష్టికి ఎమ్మెల్యేలు తీసుకువెళ్లారు. పీ-4 వల్ల సంక్షేమ పథకాల్లో కోత ఉండదని.. ఇది సంక్షేమానికి అదనమని ఎమ్మెల్యేలకు సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
పీ-4 పథకంపై ప్రజల్లోని అపోహలను తొలగించాలని ఈ సందర్భంగా వారికి సీఎం చంద్రబాబు ఆదేశించారు. బంగారు కుటుంబాలకు సరైన సమయంలో సహకారం.. నిరంతర గైడెన్స్ ఇవ్వడమనేది మార్గదర్శకులు బాధ్యతగా తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ రోజు జరిగింది స్వర్ణాంధ్ర పీ-4 ఫౌండేషన్ తొలి జనరల్ బాడీ సమావేశం కావడంతో.. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా, మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు. ఇక జూమ్‌లో జరిగిన ఈ సమావేశానికి ఎమ్మెల్యేలు, జిల్లా, మండలస్థాయి అధికారులు ఆన్ లైన్ ద్వారా హాజరయ్యారు. మరోవైపు ఇదే సమావేశంలో పీ-4 లోగోను సీఎం చంద్రబాబు ఖరారు చేశారు.