Share News

AP university admissions: మన సీట్లు మనకే

ABN , Publish Date - May 13 , 2025 | 04:33 AM

ఉన్నత విద్యా సీట్ల కేటాయింపులో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ఉస్మానియా రీజియన్‌ను తొలగించి, ఆంధ్రా-వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్ల మధ్యే 100% సీట్లను పరిమితం చేసింది.

AP university admissions: మన సీట్లు మనకే

ఉన్నత విద్యపై నిర్ణయం.. తెలంగాణ బాటనే ఏపీ

ఆంధ్రా, ఎస్వీయూ రీజియన్లే ప్రామాణికం

రెండు రీజియన్ల మధ్య 85:15 నిష్పత్తి

రాష్ట్ర యూనివర్సిటీలకు 65.62: 34.38

ఉత్తర్వులు జారీ చేసిన ఉన్నత విద్యాశాఖ

వర్సిటీలకు కేటాయింపు ఇదీ..

రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయాలుగా ఉన్న పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, ద్రవిడియన్‌ యూనివర్సిటీ, ఉర్దూ యూనివర్సిటీ, వైఎ్‌సఆర్‌ ఆర్కిటెక్చర్‌ వర్సిటీ, ఆర్జేయూకేటీతో పాటుగా క్లస్టర్‌ యూనివర్సిటీలోని సిల్వర్‌ జూబ్లీ కాలేజీకి రెండు రీజియన్ల మధ్య 85 శాతం సీట్లను 65.62:34.38 నిష్పత్తిలో విభజించారు. మిగిలిన 15 శాతం సీట్లను అన్‌రిజర్వ్‌డ్‌ కోటా ప్రకారం రాష్ట్రంలోని విద్యార్థులందరూ పొందవచ్చు. కాగా, ఈ నిబంధనలు 2025-26 విద్యా సంవత్సరానికి మాత్రమే వర్తిస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. అలాగే ప్రవేశ పరీక్షలకు, డిగ్రీ అడ్మిషన్లకు కూడా ఇవే నిబంధనలతో మరో రెండు జీవోలు జారీ చేసింది.

అమరావతి, మే 12(ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్య అడ్మిషన్లపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ ఉన్నత విద్యాసంస్థల్లోని సీట్లలో ఆంధ్రా యూనివర్సిటీ, శ్రీవేంకటేశ్వరయూనివర్సిటీ(ఎస్వీ), ఉస్మానియా యూనివర్సిటీ మూడు రీజియన్ల ప్రకారం సీట్ల కేటాయింపు జరుగుతోంది. రాష్ట్ర విభజన జరిగి పదేళ్లు పూర్తయిన నేపథ్యంలో ఉస్మానియా యూనివర్సిటీ(తెలంగాణ) రీజియన్‌లో ఆంధ్రాకు చెందిన విద్యార్థులకు సీట్లు కేటాయించబోమని తెలంగాణ ప్రభుత్వం కొత్త నిబంధన అమల్లోకి తెచ్చింది. దీంతో ఏపీ ప్రభుత్వం కూడా అదే కోణంలో ఇకపై ఉన్నత విద్యాసంస్థల్లో సీట్లు మన రాష్ట్ర విద్యార్థులకు మాత్రమే దక్కేలా అడ్మిషన్ల నిబంధనలకు సవరణలు చేసింది. వీటి ప్రకారం రాష్ట్రంలోని ఆంధ్రా, వెంకటేశ్వర యూనివర్సిటీల మధ్య మాత్రమే సీట్ల పంపిణీ జరుగుతుంది. ఉదాహరణకు ఆంధ్రా యూనివర్సిటీ రీజియన్‌లో.. ఏయూ రీజియన్‌కు 85శాతం సీట్లు వస్తాయి. మిగిలిన 15శాతం సీట్లు అన్‌ రిజర్వ్‌డ్‌గా ఉంటాయి. వాటిలో అటు ఆంధ్రా, ఇటు వెంకటేశ్వర యూనివర్సిటీల విద్యార్థులు అడ్మిషన్లు పొందవచ్చు. అంటే మొత్తం వంద శాతం సీట్ల పంపిణీ ఆంధ్రా, వెంకటేశ్వరా రీజియన్ల మధ్యే జరుగుతుంది. గతంలో 15 శాతం కోటాలో ఉస్మానియా వర్సిటీ రీజియన్‌ కూడా ఉండేది. ఇప్పుడు దానిని తొలగించారు.


స్థానిక కోటా(85ు) అర్హత ఇలా..

స్థానిక కోటాలో అడ్మిషన్‌ పొందేందుకు అవసరమైన అర్హతను నిర్ధారించే కోర్సుతో పాటు అంతకముందు వరుసగా నాలుగేళ్లు ఆ ప్రాంతంలోనే చదివి ఉండాలి. ఉదాహరణ: బీటెక్‌లో అడ్మిషన్‌ పొందాలంటే ఇంటర్మీడియట్‌ రెండేళ్లు, పదో తరగతి, తొమ్మిదో తరగతి అదే ప్రాంతంలో చదివి ఉండాలి.

వరుసగా నాలుగేళ్లు అదే ప్రాంతంలో చదవని విద్యార్థులు అర్హత పరీక్ష ప్రారంభమయ్యే నాటికి ముందు వరుసగా ఆ ప్రాంతంలో నాలుగేళ్ల పాటు నివాసం ఉండి ఉండాలి.

మొత్తం నాలుగేళ్లు లేదా అందులో కొంతకాలం వేర్వేరు ప్రాంతాల్లో చదివి ఉంటే.. అర్హత పరీక్ష నాటికి ముందు వరుసగా ఏడేళ్లు రాష్ట్రంలో చదివి, అందులో ఎక్కువ కాలం ఏ రీజియన్‌లో చదివితే దానిని స్థానికతకు ప్రామాణికంగా తీసుకుంటారు. ఒకవేళ రెండు ప్రాంతాల్లో సమానంగా చదివి ఉంటే చివరి సంవత్సరం చదివిన ప్రాంతాన్ని స్థానికంగా గుర్తిస్తారు.

మొత్తం ఏడేళ్లు లేదా అందులో కొంతకాలం వేర్వేరు ప్రాంతాల్లో చదివి ఉంటే అర్హత పరీక్ష రాసే సమయానికి ముందు ఏడేళ్లు ఆ ప్రాంతంలో నివాసం ఉండాలి. దీనిలో ఎక్కువ ఏళ్లు ఎక్కడ ఉంటే దానిని స్థానిక ప్రాంతంగా గుర్తిస్తారు. ఒకవేళ రెండు ప్రాంతాల్లో సమానంగా చదివి ఉంటే చివరి సంవత్సరం చదివిన ప్రాంతాన్ని స్థానికతగా గుర్తిస్తారు.


అన్‌రిజర్వ్‌డ్‌ కోటా(15%) అర్హత ఇలా..

రాష్ట్రంలోని అందరూ అన్‌రిజర్వ్‌డ్‌ కోటా 15 శాతానికి అర్హులే.

ఒకవేళ విద్యార్థులు బయట రాష్ర్టాల్లో చదివి ఉంటే.. అలా చదివిన కాలం కాకుండా పదేళ్లు రాష్ట్రంలో నివాసం ఉండాలి. లేదా వారి తల్లిదండ్రులు రాష్ట్రంలో పదేళ్లు నివాసం ఉండాలి. అప్పుడే వీరు అన్‌రిజర్వ్‌ కోటాకు అర్హులు.

రాష్ట్రంలో పనిచేస్తున్న రాష్ట్ర, కేంద్ర, ప్రభుత్వ రంగ సంస్థల, స్థానిక సంస్థల, విశ్వవిద్యాలయాల, ఇతర ప్రభుత్వ సంస్థలలోని ఉద్యోగుల పిల్లలు, జీవిత భాగస్వాములు అర్హులు.


ఇవి కూడా చదవండి..

Operation Sindoor: మళ్లీ అడ్డంగా దొరికిన పాక్..

Operation Sindoor: పాక్ ఎయిర్ బేస్‌ల ధ్వంసం.. వీడియోలు విడుదల

Operation Sindoor: పాక్ దాడులను సమర్థంగా తిప్పికొట్టాం: ఎయిర్ మార్షల్ ఎ.కె. భార్తీ

For AndhraPradesh News And Telugu News

Updated Date - May 13 , 2025 | 04:33 AM