Tender Greenlit: చిన్న, మధ్య తరహా కాలువల నిర్వహణకు టెండర్లు
ABN , Publish Date - May 09 , 2025 | 04:37 AM
చిన్న, మధ్య తరహా కాలువల నిర్వహణకు రూ.344 కోట్లతో టెండర్లు పిలవడానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పనులు చేయని కాంట్రాక్టర్లకు బ్లాక్ పీరియడ్‌ను 10 ఏళ్లకు పెంచింది
344 కోట్లతో పిలిచేందుకు మంత్రివర్గం ఓకే
అమరావతి, మే 8(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని చిన్న, మధ్యతరహా ఇరిగేషన్ కాలువల యాజమాన్య నిర్వహణ కోసం రూ.344.39కోట్ల అంచనా వ్యయంతో స్వల్పకాలిక టెండర్లు పిలిచేందుకు మంత్రిమండలి ఆమోదముద్ర వేసింది. సాగునీటి సంఘాల ద్వారా రూ.పది లక్షలలోపు పనులనునామినేషన్ విధానంలో చేసుకోవచ్చని.. రూ.పది లక్షలు దాటిన పనులకు ఏడు రోజుల వ్యవధిలో షార్ట్‌టెర్మ్ కింద టెండర్లు పిలవాలని జల వనరులశాఖ గతంలో మార్గదర్శకాలు జారీ చేసింది. వీటిప్రకారం వర్షాకాలంలోపు సాగునీటి కాలువల అభివృద్ధి పనులు చేపట్టేందుకు రూ.344.39 కోట్లు ఇవ్వాలని ఆర్థిక శాఖకు ప్రతిపాదనలు పంపింది. అయితే ఈ సంవత్సరం 150కోట్లతో సరిపెట్టుకోవాలని.. మిగతా మొత్తాన్ని వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఖర్చు చేసుకోవాలని ఆ శాఖ సూచించింది. నిధులు పొదుపుగా వాడుకోవాలంటూ ఉచిత సలహాలు ఇచ్చింది. దీంతో విసిగిపోయిన జలవనరుల శాఖ చంద్రబాబుకు ఫిర్యాదుచేసింది. సదరు ఫైలును కేబినెట్ ముందుకు తీసుకురావాలని ఆయన ఇటీవల ఆదేశించారు. దరిమిలా మీడియం, మైనర్ ఇరిగేషన్ పనులు చేపట్టేందుకు రూ.344.39 కోట్లు విడుదల చేయాలని ఆ శాఖ మంత్రివర్గాన్ని ఆశ్రయించగా.. ఆమోదం తెలిపింది. అలాగే చెరువులు, కుంటల్లో మట్టిని రైతులు సొంత వినియోగానికి ఉచితంగా తవ్వుకునేందుకూ ఆమోద ముద్ర వేసింది.
కాంట్రాక్టు సంస్థల బ్లాక్ పీరియడ్ పదేళ్లకు పెంపు..
పనులు చేయని కాంట్రాక్టు సంస్థల బ్లాక్ పీరియడ్‌ను పదేళ్లకు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. జగన్ హయాంలో అభివృద్ధి కార్యక్రమాలేవీ చేపట్టలేదు. పనులకు టెండర్లు పిలవలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక అభివృద్ధి పనుల టెండర్లలో కాంట్రాక్టు సంస్థలు పాల్గొనాలంటే.. గడచిన ఐదేళ్లలో (2019-24 మధ్య) చేసిన పనులు, అనుభవం, ఆర్థిక లావాదేవీల సమాచారం ఇవ్వాలి. ఆ ఐదేళ్ల కాలాన్ని బ్లాక్ పీరియడ్‌గా పేర్కొంటారు. గత ఐదేళ్లలో పనులు జరుగకపోవడంతో కాంట్రాక్టు సంస్థలు సదరు ఆర్థిక వివరాలను ఇవ్వలేకపోతున్నాయి. ఫలితంగా పెద్ద పెద్ద కాంట్రాక్టు సంస్థలు కూడా అనర్హత జాబితాలోకి వెళ్లిపోతున్నాయి. దీంతో.. జల వనరుల శాఖ 2014 నుంచి చేసిన పనులు, అనుభవం చెప్పే వెసులుబాటు కల్పించాలని నిర్ణయించింది.