Nara Lokesh: పరిశ్రమలు పెట్టేదాకా నిరంతర పర్యవేక్షణ
ABN , Publish Date - Jun 05 , 2025 | 05:53 AM
వైసీపీ ఐదేళ్ల పాలనలో సాధించలేని పెట్టుబడులను 11 నెలల్లోనే రాష్ట్రానికి తీసుకువచ్చామని ఐటీ, మానవవనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు.
రూ.9.5 లక్షల కోట్ల పెట్టుబడులు ..
8.5 లక్షల ఉద్యోగ కల్పనకు ఒప్పందాలు
ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు మా లక్ష్యం
వైసీపీ ఐదేళ్లలో సాధించలేనివి 11 నెలల్లోనే తెచ్చాం
పెట్టుబడుల ఆకర్షణతోపాటు ప్రాజెక్టుల పూర్తికీ చర్యలు
ఉపాధి కల్పనపై భేటీలో అధికారులకు లోకేశ్ ఆదేశం
అమరావతి, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ఐదేళ్ల పాలనలో సాధించలేని పెట్టుబడులను 11 నెలల్లోనే రాష్ట్రానికి తీసుకువచ్చామని ఐటీ, మానవవనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. వెలగపూడి సచివాలయంలో బుధవారం ఆయన ఉపాధి కల్పనపై మంత్రులు, అధికారులతో సమావేశమయ్యారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలను కల్పించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని, ఇప్పటి వరకూ 9.20 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు ముందుకొచ్చాయని, వాటి ద్వారా 8.5 లక్షల మంది యువతకు ఉద్యోగాలను కల్పించేలా అవగాహనా ఒప్పందాలను చేసుకున్నామన్నారు. రాష్ట్రంలో భారీపెట్టుబడులు, అత్యధిక ఉద్యోగాలను కల్పించేందుకు ఎన్‌టీపీసీ, బీపీసీఎల్, రిలయన్స్ , టాటాపవర్ వంటి సంస్థలు ముందుకొచ్చాయని తెలిపారు. అవి రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేవరకూ ఆ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించాలని లోకేశ్ సూచించారు. పునరుద్పాదక ఇంధన ప్రాజెక్టులకు భూమితోపాటు ఇతర మౌలిక సదుపాయాలను యుద్ధప్రాతిపదికన కల్పించాలని కోరారు. అతి పెద్ద తీరప్రాంతం కలిగిన మన రాష్ట్రం పర్యాటకరంగానికి అనువైందని, ఆ రంగంలో విస్తృతమైన ఉపాధి అవకాశాలున్నాయన్నారు.
విశాఖలో వరుణ్ బీచ్ శాండ్, ఓబెరాయ్ వంటి స్టార్ హోటళ్ల నిర్మాణాలకు అవసరమైన అనుమతులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో బీచ్‌శాండ్, కోల్ గ్యాసిఫికేషన్ మైనింగ్ రంగాల్లో పెట్టుబడులు, ఉపాధి అవకాశాలను అన్వేషించాలన్నారు. రాష్ట్రానికి కొత్తగా వచ్చే పరిశ్రమలకు అవసరమైన మానవ వనరులను సమకూర్చడంలో భాగంగా యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ అందించాలని సూచించారు. స్కిల్ ఎకోసిస్టమ్ కల్పించాలని, బీసీసీఐ సహకారంతో అమరావతిలో వరల్డ్ క్లాస్ స్టేడియం నిర్మాణానికి త్వరతిగతిన చర్యలు చేపట్టాలని కోరారు. పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే పారిశ్రామికవేత్తలకు త్వరితగతిన అనుమతులు ఇచ్చేందుకు వీలుగా వాట్సప్ గవర్నెన్స్‌తో అనుసంధానం చేయాలన్నారు. అధిక ఉపాధికి అవకాశం ఉన్న చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ ప్రోగ్రామ్‌తో అనుసంధానం చేయాలని కోరారు. దానివల్ల ఆ పరిశ్రమలకు పెట్టుబడుల మద్దతు లభిస్తుందని తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తవుతున్న నేపథ్యంలో ఒక వైపు పెట్టుబడులను ఆకర్షించే కార్యక్రమాలను కొనసాగిస్తూనే, ఇప్పటికే ఒప్పందాలు కుదిరిన ప్రాజెక్టుల ప్రారంభానికి వేగవంతంగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రాష్ట్రంలో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ విధానాలను అనుసరిస్తున్నామని వెల్లడించారు. వివిధ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపేవారితో నేరుగా సంప్రదించాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు పి.నారాయణ, కందుల దుర్గేశ్, టీజీ భరత్, కొండపల్లి శ్రీనివాస్, కొల్లు రవీంద్ర, గొట్టిపాటి రవికుమార్, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, టూరిజం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్, ఎకనామిక్ డెవల్‌పమెంట్ బోర్డు సీఈవో సాయికాంత్ వర్మ, ఐటీ, ఎలకా్ట్రనిక్స్ శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్, ఏపీఐఐసీ ఎండీ అభిషిక్త్ కిశోర్, నెడ్‌క్యాప్ ఎండీ కమలాకరబాబు, గనుల శాఖ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
For AndhraPradesh News And Telugu News