Antarvedi Chariot: అంతర్వేది రథానికి రూ.96లక్షల ఇన్సూరెన్సు
ABN , Publish Date - Jun 09 , 2025 | 03:34 AM
దక్షిణకాశీగా పేరొందిన ప్రఖ్యాత అంతర్వేది పుణ్యక్షేత్రంలో దగ్ధమైన లక్ష్మీనరసింహస్వామివారి రథానికి ఇన్సూరెన్సు మంజూరైంది. ఈ విషయాన్ని దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ ఆదివారం మీడియాకు తెలిపారు.
దేవస్థానం ఖాతాలో జమ చేసిన అధికారులు
అంతర్వేది, జూన్ 8(ఆంధ్రజ్యోతి): దక్షిణకాశీగా పేరొందిన ప్రఖ్యాత అంతర్వేది పుణ్యక్షేత్రంలో దగ్ధమైన లక్ష్మీనరసింహస్వామివారి రథానికి ఇన్సూరెన్సు మంజూరైంది. ఈ విషయాన్ని దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ ఆదివారం మీడియాకు తెలిపారు. 2020 సెప్టెంబరు 5 అర్ధరాత్రి ఇక్కడి పురాతన రథం దగ్ధమైన ఘటన రాష్ట్రంలో సంచలనం రేపిన విషయం తెలిసిందే. దీంతో దేవదాయశాఖ అధికారులు ఇన్సూరెన్సు కోసం యునైటెడ్ ఇన్సూరెన్సు కంపెనీకి 2021లో దరఖాస్తు చేశారు. కాకినాడ జిల్లా వినియోగదారుల కోర్టులో సీసీ దాఖలు చేయగా దేవస్థానానికి అనుకూలంగా తీర్పు వచ్చింది. ఇన్సూరెన్సు కంపెనీ ఆ తీర్పును నిరాకరించింది. దీనిపై దేవస్థానం అధికారులు విజయవాడలోని రాష్ట్ర కన్జ్యూమర్ కోర్టులో 2023లో అప్పీల్ చేశారు. సుమారు రూ.84లక్షలు మంజూరు కాగా కాలయాపన చేస్తూ ఇన్సూరెన్సు కంపెనీ పట్టించుకోలేదు. చివరికి విజయవాడ కోర్టులో వడ్డీతో సహా ఇన్సూరెన్సు కంపెనీ రూ.96,39,361 డీడీ రూపంలో దేవస్థానం అధికారులకు అందించినట్టు ఏసీ సత్యనారాయణ తెలిపారు. ఆ డీడీలను దేవస్థానం బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేశామన్నారు. కాగా, ఐదేళ్ల తర్వాత రథం దహనమైన ఘటనలో ఇన్సూరెన్సు మంజూరు కాగా, రథం శకలాలు ఇంకా అంతర్వేది ఆలయ ప్రాంగణంలోనే ఉండడంపై భక్తులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు.