Share News

Quartz Mining Scam: క్వార్ట్జ్‌ కేసులో చిక్కిన మరో వైసీపీ నేత

ABN , Publish Date - Jul 22 , 2025 | 06:00 AM

నెల్లూరు జిల్లాలోని రుస్తుం మైన్స్‌లో అక్రమంగా క్వార్ట్జ్‌ తవ్వకాలు జరిపిన కేసులో మరో వైసీపీ నేత బిరదవోలు

Quartz Mining Scam: క్వార్ట్జ్‌ కేసులో చిక్కిన మరో వైసీపీ నేత

  • విచారణలో కీలక విషయాలు వెలుగులోకి

  • మాజీ మంత్రికి బిగుస్తున్న ఉచ్చు!

నెల్లూరు, జూలై 21 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లాలోని రుస్తుం మైన్స్‌లో అక్రమంగా క్వార్ట్జ్‌ తవ్వకాలు జరిపిన కేసులో మరో వైసీపీ నేత బిరదవోలు శ్రీకాంత్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణ లోతుగా సాగుతున్న నేపథ్యంలో శ్రీకాంత్‌రెడ్డి పాత్ర బయటపడింది. ఈ క్రమంలో రుస్తుం మైన్స్‌ కేసులో శ్రీకాంత్‌రెడ్డిని కూడా నిందితుడిగా పోలీసులు మూడు రోజుల క్రితం చేర్చారు. అప్పటి నుంచి ఆయన కోసం వెతుకుతున్న పోలీసులు ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకుని సోమవారం నెల్లూరు తీసుకొచ్చారు. ఒకటి, రెండు రోజుల్లో అరెస్టు చూపించే అవకాశాలున్నట్టు పోలీసు వర్గాల ద్వారా తెలుస్తోంది. శ్రీకాంత్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత అతడి నుంచి అనేక కీలక విషయాలు రాబట్టినట్టు సమాచారం. గత ప్రభుత్వంలో ఓ మాజీ మంత్రికి అత్యంత సన్నిహితుడిగా శ్రీకాంత్‌రెడ్డి వ్యవహరించారు. క్వార్ట్జ్‌ అక్రమ తవ్వకాలన్నీ ఆ మాజీ మంత్రి కనుసన్నల్లోనే జరిగాయనేది బహిరంగ రహస్యం. ఇప్పుడు శ్రీకాంత్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఆ మామూళ్ల వ్యవహారాలన్నీ బయటపడినట్టు తెలుస్తోంది. ఈ అక్రమ సంపాదనను నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో రియల్‌ ఎస్టేట్‌ కింద పెట్టుబడిగా పెట్టినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ మాజీ మంత్రికి కూడా ఉచ్చు బిగుస్తోంది. త్వరలోనే ఆయన పేరును కూడా క్వార్ట్జ్‌ అక్రమ తవ్వకాల కేసులో చేర్చే అవకాశాలున్నట్టు సమాచారం. కాగా ఇప్పటికే క్వార్ట్జ్‌ అక్రమ తవ్వకాల కేసులో మాజీ మంత్రి, నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు కాకాణి గోవర్థన్‌రెడ్డి రిమాండ్‌లో ఉన్నారు. రెండు నెలలుగా ఆయన రిమాండ్‌లో ఉండగా, పలు మార్లు బెయిల్‌ పిటిషన్లను కోర్టు తిరస్కరించింది.

ఈ వార్తలు కూడా చదవండి..

ఆర్టీఐలో సామాజిక న్యాయం ఎక్కడ? ప్రభుత్వానికి ఎమ్మెల్సీ కవిత సూటి ప్రశ్న..

రేవంత్‌ నాటుకోడి.. కేటీఆర్‌ బాయిలర్‌ కోడి

Read latest Telangana News And Telugu News

Updated Date - Jul 22 , 2025 | 06:00 AM