Share News

cold wave: పొంచి ఉన్న మరో తుఫాన్‌ ముప్పు.!

ABN , Publish Date - Nov 20 , 2025 | 04:37 AM

రాష్ట్రంలో వరి పంట కోతల దశకు వచ్చిన తరుణంలో..తుఫాన్‌ ముప్పు ఉందన్న సమాచారం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈనెల 22వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి 24వ తేదీకల్లా దక్షిణ...

cold wave: పొంచి ఉన్న మరో తుఫాన్‌ ముప్పు.!

  • 22న బంగాళాఖాతంలో అల్పపీడనం

  • తుఫాన్‌గా బలపడే అవకాశం

  • దక్షిణ కోస్తాలోనే తీరం దాటుతుందంటున్న నిపుణులు

విశాఖపట్నం, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వరి పంట కోతల దశకు వచ్చిన తరుణంలో..తుఫాన్‌ ముప్పు ఉందన్న సమాచారం రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈనెల 22వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఇది పశ్చిమ వాయవ్యంగా పయనించి 24వ తేదీకల్లా దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించే క్రమంలో వాయుగుండంగా బలపడనుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అయితే ఈ క్రమంలో అది తుఫాన్‌గా మారుతుందా? లేదా? అన్నది ఐఎండీ నిర్ధారించలేదు. కానీ ఈనెల 25వ తేదీ తరువాత బంగాళాఖాతంలో తుఫాన్‌ ఏర్పడుతుందని ఇది దక్షిణ కోస్తాలోనే తీరం దాటుతుందని ఇస్రో వాతావరణ నిపుణుడు ఒకరు పేర్కొన్నారు.

ఇదిలాఉండగా ఉత్తరాది నుంచి వస్తున్న గాలులతో రాష్ట్రంలో అనేకచోట్ల చలి తీవ్రత కొనసాగుతోంది. అల్లూరి జిల్లా జి.మాడుగులలో 4.6 డిగ్రీలు, ముంచంగిపుట్టు మండలం కిలగాడలో 5.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్న 24 గంటల్లో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రెండు, మూడు రోజులు చలి ప్రభావం కొనసాగి ఆ తరువాత స్వల్పంగా తగ్గుతుందని పేర్కొంది.

మన్యం గజగజ...

పాడేరు/అమరావతి, నవంబరు 19(ఆంధ్రజ్యోతి): మన్యంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతున్నాయి. ఏజెన్సీలో ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు డివిజన్‌లోని జి.మాడుగులలో బుధవారం 4.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది ఇప్పటివరకూ నమోదైన అత్యల్ప ఉష్ణోగ్రత ఇదే.

రాష్ట్రంలో నేడు, రేపు వర్షాలు

రాష్ట్రంలో రానున్న రెండు రోజులు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. గురువారం ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాలు, శుక్రవారం కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఈనెల 22 నాటికి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని, తదుపరి 48గంటల్లో అది పశ్చిమ-వాయవ్య దిశగా కదిలే అవకాశం ఉందని తెలిపింది.

ఇవీ చదవండి:

హిడ్మా ఎన్‌కౌంటర్.. ప్రొ.హరగోపాల్ కీలక వ్యాఖ్యలు

అందుకే మారేడుమిల్లికి వచ్చిన మావోయిస్టులు.. జిల్లా ఎస్పీ

Updated Date - Nov 20 , 2025 | 06:44 AM