CM Chandrababu Naidu: రెవెన్యూ ప్రక్షాళన!
ABN , Publish Date - Dec 25 , 2025 | 04:30 AM
రెవెన్యూ శాఖపై ప్రజల్లో సంతృప్త స్థాయిని 80 శాతానికి ఎలా తీసుకురావాలి? వారి పిటిషన్ల పరిష్కారంలో జాప్యాన్ని నివారించాలంటే తక్షణ చర్యలు ఏంతీసుకోవాలి....
ప్రజల్లో అసంతృప్తి తొలగింపే లక్ష్యంగా రోడ్‌మ్యాప్
సీఎం ఆదేశాలతో కీలక భేటీ
భూముల సర్వే, మ్యుటేషన్, పాస్‌పుస్తకాలు, 22ఏపై చర్చ
జేసీ నుంచి కొన్ని కీలక అధికారాలు ఆర్‌డీవోకు బదలాయింపు
మరికొన్ని అధికారాలు తహశీల్దార్‌కు
22ఏ నుంచి పట్టా భూముల తొలగింపు
ప్రజల ఇంటి స్థలాలకూ నిషేధ విముక్తి
జాయింట్ ఎల్‌పీఎమ్‌లు, విస్తీర్ణంలో తేడాలకు నిర్దిష్ట గడువులో పరిష్కారం
సమావేశంలో కీలక నిర్ణయాలు!
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
రెవెన్యూ శాఖపై ప్రజల్లో సంతృప్త స్థాయిని 80 శాతానికి ఎలా తీసుకురావాలి? వారి పిటిషన్ల పరిష్కారంలో జాప్యాన్ని నివారించాలంటే తక్షణ చర్యలు ఏంతీసుకోవాలి? పారదర్శకత కోసం, అవినీతిరహిత సేవలు అందించడానికి చేపట్టాల్సిన మౌలిక చర్యలు ఏమిటి.. ఈ శాఖపై ఉన్న చెడు ముద్ర తొలగించి.. ఫీల్ గుడ్‌లోకి తీసుకొచ్చేందుకు ఏ సంస్కరణలు తీసుకురావాలన్న అంశాలపై ప్రభుత్వం సమాలోచనలు మొదలుపెట్టింది. బుధవారం రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధ్యక్షతన కీలక సమావేశం జరిగింది. రెవెన్యూ ప్రక్షాళనకు అవసరమైన రోడ్‌మ్యాప్ సిద్ధం చేయాలని ఆయన ఆదేశించారు. ఆ శాఖ స్పెషల్ సీఎస్ సాయిప్రసాద్ దీనిపై నివేదిక రూపొందించనున్నారు. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళికను త్వరలో సీఎంతో జరిగే భేటీలో అందించనున్నారు.
కలెక్టర్ల సదస్సులో సీఎం అసంతృప్తి
ఆర్టీజీఎస్ సర్వేల్లో రెవెన్యూ శాఖ సేవలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రజల నుంచి వస్తున్న ఫిర్యాదులు, పిటిషన్లలో సింహభాగం రెవెన్యూవే ఉంటున్నాయు. దీంతో ఈ శాఖ పనితీరుపై సీఎం చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారు. అధికారులు కష్టపడి పనిచేస్తున్నా గుర్తింపు ఉండడం లేదని, రెవెన్యూ అంటేనే బ్యాడ్ అని ప్రజలు భావిస్తున్నారని ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఆయన వ్యాఖ్యలు చేశారు. ప్రజల్లో విశ్వసనీయత పెంచుకోవాలంటూ ఏడాది గడువు పెట్టారు. రెవెన్యూ శాఖ ప్రక్షాళనకు ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఫీల్ బెటర్‌కు తీసుకొచ్చేందుకు అమలు చేయాల్సిన సంస్కరణలపై ఆశాఖ కసరత్తు ప్రారంభించింది. ఇందులో భాగంగా మంత్రి అనగాని బుధవారం కీలక భేటీ నిర్వహించారు.
ఆ శాఖ స్పెషల్ సీఎస్ సాయిప్రసాద్, సీసీఎల్‌ఏ జయలక్ష్మి, అదనపు సీసీఎల్‌ఏ వెంకటమురళి, సర్వే డైరెక్టర్ కూర్మనాథ్, ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు. రెవెన్యూ సర్వీసుల్లో ప్రజల అసంతృప్తికి ప్రధాన కారణమవుతున్న భూముల సర్వే, మ్యుటేషన్, పాస్‌పుస్తకాల పంపిణీ, పిటిషన్లపై అధికారుల సంతకాలు తీసుకోవాలన్న ఒత్తిళ్లు, ప్రైవేటు పట్టా భూములను 22(ఏ)లో చేర్చడం.. సరిహద్దు వివాదాల పరిష్కారం తదితర అంశాల్లో తీసుకురావలసిన మార్పులపై ప్రతిపాదనలు తయారు చేయాలని ఆయన ఆదేశించారు. జేసీల స్థాయిలో పలు కీలక అధికారాలు ఉంటున్నాయని, వారిపై ఉండే ఒత్తిళ్ల వల్ల సకాలంలో రెవెన్యూ అంశాల్లో సత్వర నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారని, ఫైళ్ల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతోందని గుర్తించారు. ఈ నేపఽథ్యంలో జేసీ వద్ద ఉన్న అధికారాల్లో కొన్నింటిని రెవెన్యూ డివిజనల్ అధికారి(ఆర్‌డీవో)కి బదలాయించాలని.. మరికొన్నిటిని తహశీల్దార్‌కు ఇస్తే సరిపోతుందన్న నిర్ణయానికి వచ్చారు. ప్రజలు రెవెన్యూ సేవలు కోరుతూ గ్రామ సచివాలయాల్లో ఇచ్చే పిటిషన్లపై స్థానిక వీఆర్‌వో లేదా సర్వేయర్ సంతకం ఉండాలన్న నిబంధన వల్ల అవినీతి జరుగుతోందన్న ఫిర్యాదులు అందాయు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ఆర్టీజీఎస్ నిర్వహిస్తున్న సర్వేల్లోనూ ఇదే కీలకంగా ఉంటోంది. సంతకాల పేరిట అవినీతి జరుగుతోందని, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చోటుచేసుకుంటోందని తేలింది. ఈ నేపథ్యంలో ప్రజలు ఇచ్చే ఫిర్యాదులకు ఏ అధికారి సంతకమూ అవసరం లేదంటూ స్పష్టమైన ఆదేశాలివ్వాలని తాజాగా నిర్ణయించారు.
ఆ భూములకు విముక్తి..
గత ప్రభుత్వంలో అన్యాయంగా, చట్టవిరుద్ధంగా 22(ఏ) జాబితాలో చేర్చిన పట్టా భూములను తొలగించాలని, ప్రజల ఇంటి స్ధలాలకూ నిషేధ విముక్తి కల్పించాలని నిర్ణయించారు. జాయింట్ ఎల్‌పీఎమ్‌లు, భూమి విస్తీర్ణంలో తేడాల సవరణ వంటి విన్నపాలను నిర్దిష్ట గడువులోగా పరిష్కరించేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సీఎం ఆదేశాల మేరకు రెవెన్యూ ప్రక్షాళనకు అవసరమైన రోడ్‌మ్యాప్ సిద్ధం చేయాలన్నారు. దీనిపై స్పెషల్ సీఎస్ సాయిప్రసాద్ నివేదిక రూపొందించనున్నారు. అనంతరం త్వరలో ముఖ్యమంత్రి వద్ద జరిగే భేటీలో కార్యాచరణ ప్రణాళిక అందించాలని నిర్ణయించినట్లు తెలిసింది. శాఖాపరంగా చేపట్టాల్సిన చర్యలపై వెంటనే రెవెన్యూ యంత్రాంగానికి ఆదేశాలివ్వాలని, వాటి అమలుపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని సమావేశం నిర్ణయించింది.