Autism Support Centers: వికసించని బాల్యానికి చేయూత
ABN , Publish Date - May 15 , 2025 | 02:36 AM
ఆటిజంతో బాధపడే పిల్లలకు సహాయం చేసేందుకు ఏపీ ప్రభుత్వం దేశంలో తొలిసారిగా 125 ఆటిజం సపోర్ట్ కేంద్రాల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. మంగళగిరిలో తొలి కేంద్రం జూన్‌లో ప్రారంభం కానుండగా, రాష్ట్ర వ్యాప్తంగా 20 వేల మంది చిన్నారులకు ఇది ఉపయోగపడనుంది.
విద్యా శాఖ ఆధ్వర్యంలో భవిత ఆటిజం కేంద్రాలు
రాష్ర్టానికి 125 మంజూరు చేసిన కేంద్రం
దేశానికి పైలెట్ ప్రాజెక్టులా ఏపీలో అమలు
వికసించని బాల్యానికి చేయూత..!
విద్యాశాఖ ఆధ్వర్యంలో భవిత ఆటిజం కేంద్రాలు
రాష్ర్టానికి 125 మంజూరు చేసిన కేంద్రం
తొలివిడతలో 71, రెండో విడతలో 54 ఏర్పాటు
దేశానికి పైలెట్ ప్రాజెక్టులా ఏపీలో అమలు
ప్రతి కేంద్రంలోనూ ముగ్గురు థెరపి్‌స్టలు
పాఠశాలలకు అనుసంధానంగా ఏర్పాటు
జూన్‌లో మంగళగిరిలో తొలి కేంద్రం ప్రారంభం
(అమరావతి-ఆంధ్రజ్యోతి)
వయసుకు తగ్గ మానసిక ఎదుగుదల లేకపోవడం.. తోటి పిల్లలతో కలవకుండా ఒంటరిగా ఉండడం.. నేరుగా కళ్లలోకి చూసి మాట్లాడలేకపోవడం.. ఇవన్నీ ఆటిజం లక్షణాలు. ఇలా మానసిక వికాసం లేని చిన్నారులకు చేయూతనిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. దేశంలోనే మొట్టమొదటిసారి విద్యాశాఖ ఆధ్వర్యంలో భవిత ఆటిజం సపోర్ట్ కేంద్రాల ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్ర ప్రభుత్వ చొరవతో ఏపీకి 125 ఆటిజం కేంద్రాలు మంజూరయ్యాయి. ఒక్కో కేంద్రం నిర్మాణానికి రూ.27.75 లక్షలు, ఉపకరణాలకు మరో రూ.5లక్షలు చొప్పున కేంద్రం నిధులు ఇస్తుంది. పైలెట్ ప్రాజెక్టుగా ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేసే కేంద్రాల పనితీరు, ఫలితాల ఆధారంగా మిగిలిన రాష్ట్రాలకూ ఈ కేంద్రాలు మంజూరు కానున్నాయి. రాష్ట్రంలో ఆటిజంతో బాధపడుతున్న సుమారు 20వేల మంది చిన్నారులకు ఈ కేంద్రాల ద్వారా మేలు జరగనుంది. ప్రస్తుతం బాధిత చిన్నారుల తల్లిదండ్రులు ప్రైవేటు ఆటిజం కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. అవి కూడా చాలా పరిమిత సంఖ్యలోనే ఉన్నాయి. వాటిలో ఫీజులు పేదలు భరించే స్థాయిలో లేవు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రభుత్వ కేంద్రాలు అందుబాటులోకి రానుండడంతో వారికి కాస్త ఉపశమనం కలుగుతుంది.
ఆటిజం అంటే ఏమిటి..?
ఆటిజం అంటే వయసుకు తగ్గ మానసిక ఎదుగుదల లేకపోవడం. ఇది సాధారణ మానసిక రుగ్మత కాదు. ఆటిజం బాధితుల్లో మెదడు నుంచి వచ్చే సమాచారం పంచేంద్రియాలకు సక్రమంగా సమన్వయం కాదు. దీనివల్ల చూడటం, వినడం, గుర్తించలేకపోవడం లాంటి సమస్యలు బాధిత పిల్లల్లో కనిపిస్తాయి. ఆటిజం పిల్లల్లో ముఖ్యంగా కనిపించే లక్షణాలు...
మంగళగిరిలో తొలి కేంద్రం
ప్రస్తుతం రాష్ట్రంలోని కొన్ని నగరాల్లోనే ప్రైవేటు ఆటిజం కేంద్రాలున్నాయి. వాటిలోని థెరపిస్టులు ఆటిజం బాధితులకు థెరపీ ఇస్తున్నారు. రోజుకు లేదా రోజు మార్చి రోజు గంట చొప్పున థెరపీ ఇస్తారు. ఇందుకోసం నెలకు రూ.20వేల నుంచి రూ.30వేల వరకూ తీసుకుంటున్నారు. ఇంత మొత్తం భరించే పరిస్థితి పేదలకు ఉండదు. ప్రైవేటులోనూ చాలా తక్కువ కేంద్రాలు ఉండటంతో అందరికీ థెరపీ అందడం లేదు. గ్రామీణ ప్రాంతాల వారికైతే అసలే అవకాశం లేకుండా పోయింది. కాగా, రాష్ట్రంలో 125 కేంద్రాలను రెండు దశల్లో ఏర్పాటు చేయనున్నారు. తొలి విడతలో 71, రెండో విడతలో 54 కేంద్రాలు ప్రారంభిస్తారు. వచ్చే జూన్‌లో మొదటి కేంద్రం మంగళగిరి సమీపంలోని వెంకటరెడ్డిపాలెంలో ప్రారంభించేలా ప్రణాళిక రూపొందించారు. రాష్ట్రం లో ఆటిజం బాధితులపై సర్వేచేసి అవసరమైన ప్రాంతాల్లోనే వీటిని ఏర్పా టు చేయనున్నారు.
లక్షణాలు
తోటి పిల్లలతో కలవలేరు. ఒంటరిగా ఉండటానికే ఇష్టపడతారు.
మాట్లాడే సమయంలో ఎదుటివారి కళ్లలోకి చూసి మాట్లాడలేరు.
పేరుతో పిలిచినా చూడరు. అందరు పిల్లాల్లా.. ప్రమాదాలను గుర్తించలేరు.
వస్తువులను సక్రమంగా పట్టుకోలేరు.. ఎప్పుడూ ఒకే ఆట ఆడుతుంటారు.
ఎప్పుడూ టెన్షన్‌గా ఉంటారు.. కొన్ని సమయాల్లో ఇతరుల స్పర్శను కూడా ఇష్టపడరు.
ఎలాంటి కారణం లేకుండానే ఏడుస్తారు. కారణం లేకుండానే నవ్వుతారు.
చెప్పిన మాటలు అర్థం చేసుకోకుండా.. చెప్పిందే మళ్లీ మళ్లీ చెబుతుంటారు.
రాష్ట్రంలో 20 వేల మంది బాధితులు
ఆటిజం బాధిత పిల్లల్లో మానసిక ఎదుగుదల చాలా నెమ్మదిగా ఉంటుంది. ఆటిజంను పలు రకాలుగా విభజించారు. బడికి వెళ్లే పిల్లలను పాఠశాల విద్యాశాఖ గుర్తించగా.. రాష్ట్రంలో సుమారు 20వేల మంది బాధితులు ఉన్నట్లు తేలింది. వారిలో ఇంటలెక్చువల్ డిజేబిలిటీ బాధితులు 13,889 మంది, సెలబ్రల్ పాల్సీ బాధితులు 4,665 మంది, ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్టర్ బాధితులు 1,264 మంది ఉన్నారు.
పాఠశాలల్లోనే ఆటిజం కేంద్రాలు
ప్రైవేటు తరహాలో కాకుండా ఆటిజం కేంద్రాలను కొంత భిన్నంగా నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల ఆవరణలోనే వీటిని ఏర్పాటు చేస్తారు. మొదట నాలుగైదు నెలలు ఆటిజం పిల్లలకు థెరపీ ఇస్తారు. వారిలో వచ్చిన సానుకూల మార్పుల ఆధారంగా సాధారణ తరగతుల్లో వారిని కూర్చోబెడతారు. తరగతుల్లోని ఉపాధ్యాయులు, విద్యార్థులకు కూడా ఆటిజంపై అవగాహన కల్పిస్తారు. ఆటిజం పిల్లలను తక్కువ చేయకుండా అందరితో కలుపుకొని వెళ్లేలా చర్యలు తీసుకుంటారు. ప్రతి కేంద్రంలో ముగ్గురు థెరపి్‌స్టలు, ఇద్దరు సహాయకులను నియమిస్తారు. తొలుత ప్రైవేటు థెరపి్‌స్టలను తీసుకుంటారు. ఆ తర్వాత ప్రభుత్వంలోని స్పెషల్ ఎడ్యుకేటర్లకు శిక్షణ ఇచ్చి నియమించాలనే ఆలోచన చేస్తున్నారు.
సాధారణ విద్యార్థులతో కలపడమే లక్ష్యం
‘‘వీలైనంత త్వరగా 125 కేంద్రాలు ప్రారంభిస్తాం. దేశంలోనే ఇది విద్యాశాఖ ఆధ్వర్యంలో తొలిసారి కావడంతో లోతుగా అధ్యయనం చేస్తున్నాం. ఆటిజం బాధిత విద్యార్థులను వీలైనంత త్వరగా సాధారణ విద్యార్థులతో కలపాలన్నది మా లక్ష్యం. బడి ఈడు పిల్లలు 6 నుంచి 14 ఏళ్లలోపు విద్యార్థులకు ఆటిజం కేంద్రాల్లో చేరవచ్చు. భవిత ఆటిజం సపోర్ట్ కేంద్రాల పేరుతో వీటిని ఏర్పాటు చేస్తున్నాం. విద్యా శాఖ ఆధ్వర్యంలో ఏపీలో ఏర్పాటయ్యే ఆటిజం కేంద్రాలు మిగిలిన రాష్ట్రాలకు మోడల్ అవుతాయి’’
- బి.శ్రీనివాసరావు, సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్
ఈ వార్తలు కూడా చదవండి..
Operation Sindoor: మసూద్ అజార్‌కు రూ. 14 కోట్లు చెల్లించనున్న పాక్
Donald Trump: అమెరికాకు సౌదీ బహుమతి.. స్పందించిన ట్రంప్
Teachers in Class Room: క్లాస్ రూమ్‌లోనే దుకాణం పెట్టిన హెడ్ మాస్టర్లు.. వీడియో వైరల్
For AndhraPradesh News And Telugu News