AP Government: యువత కోసం అధునాతన ట్రైనింగ్ ల్యాబ్‌లు
ABN , Publish Date - May 06 , 2025 | 05:06 AM
రాష్ట్ర ప్రభుత్వం యువతకు నైపుణ్యాభివృద్ధి కోసం ష్నైడర్ ఎలక్రటానిక్స్, ఒరాకిల్‌తో కీలక ఒప్పందాలు చేసుకుంది. ఈ ఒప్పందాల ద్వారా శిక్షణ, ఉపాధి అవకాశాలు పెరిగి యువతకు కొత్త దారులు తెరవబడతాయి
ఎలక్ర్టానిక్స్, గ్రీన్ ఎనర్జీ, నిర్మాణ రంగాల్లో శిక్షణకు ‘ష్నైడర్ ఎలక్ట్రిక్’తో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఒప్పందం
యువతకు ఉచితంగా ఒరాకిల్ శిక్షణకు డీల్
అమరావతి, మే 5(ఆంధ్రజ్యోతి): యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా.. ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా, ఒరాకిల్ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం సోమవారం రెండు కీలక ఒప్పందాలు చేసుకుంది. ఎలక్ర్టానిక్స్, గ్రీన్ ఎనర్జీ, నిర్మాణ రంగాల్లో యువతకు ఉపాధి అవకాశాలు పెంచడానికి ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియాతో ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి లోకేశ్ సమక్షంలో సోమవారం ఉండవల్లిలో నైపుణ్యాభివృద్ధి సంస్థ, ష్నైడర్ ఇండియా మధ్య ఈ ఒప్పందం జరిగింది. ఒప్పందంలో భాగంగా 2027 మార్చిలోగా ప్రభుత్వ ఐటీఐలు, పాలిటెక్నిక్ కాలేజీలు, ఎన్‌ఏసీ శిక్షణ కేంద్రాల్లో 20 అధునాతన ట్రైనింగ్ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తారు. 9 వేల మందికి ఈ ల్యాబ్‌ల్లో శిక్షణ ఇస్తారు. శిక్షణా పరికరాలు, డిజిటల్ సామగ్రి కోసం ష్నైడర్ ఇండియా రూ.5 కోట్లు ఖర్చు చేయనుంది. శిక్షణ పొందిన అభ్యర్థులకు ప్లేస్‌మెంట్ చూపించడంలోనూ సహకారం అందిస్తుంది. మంత్రి లోకేశ్ విజ్ఞప్తితో రూ.15 కోట్లతో మంగళగిరిలో ష్నైడర్ ఎలక్ర్టిక్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటుకు కంపెనీ ప్రతినిధులు అంగీకరించారు. అనంతపురంలో ష్నైడర్ ఎలక్ట్రిక్ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పా టు చేయనున్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ జి.గణేష్‌కుమార్, ఏపీఎస్‌స్‌డీసీ ఈడీ కె.దినేష్‌కుమార్, ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా హెడ్ దీపక్ శర్మ, ఎస్ జీఎం రిచా గౌతమ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మూడేళ్లలో 4లక్షల మందికి ఒరాకిల్ శిక్షణ
ఐటీ పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ స్‌లో యువతకు శిక్షణ ఇచ్చి, వర్క్‌ఫోర్స్‌ను సిద్ధం చేయడానికి ప్రఖ్యాత సంస్థ ఒరాకిల్‌తో నైపుణ్యాభివృద్ధి సంస్థ మరో ఒప్పందం చేసుకుంది. మంత్రి లోకేశ్ సమక్షంలో సోమవారం ఈ ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం ద్వారా యువతకు ఒరాకిల్ యూనివర్సిటీ లెర్నింగ్ సబ్‌స్ర్కిప్షన్ ఉచితంగా లభించనుంది. మహిళలు, ఆర్థికంగా వెనకబడిన వర్గాల యువత ఒరాకిల్ క్లౌడ్‌లో నైపుణ్యం సాధించేందుకు చేయూత అందించడం ఈ ఒప్పందం ప్రధాన ఉద్దేశం. తొలి ఏడాది లక్ష మందికి, రెండో ఏడాది లక్షన్నర, మూడో ఏడాది మరో లక్షన్నర మందికి ఒరాకిల్ మై లెర్న్ డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా శిక్షణ అందిస్తారు. కార్యక్రమలంలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ జి.గణేష్‌కుమార్, ఒరాకిల్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ శైలేంద్రకుమార్, ఇతర ప్రతినిధులు పాల్గొన్నారు.