Assistant Rationalization: రైతులకు మెరుగైన సేవలే లక్ష్యం
ABN , Publish Date - Apr 30 , 2025 | 04:48 AM
రైతులకు మెరుగైన సేవల కోసం 5,678 క్లస్టర్ సచివాలయాల్లో వీఏఏ, వీహెచ్‌ఏ, వీఎస్‌ఏల హేతుబద్ధీకరణకు వ్యవసాయశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ-క్రాప్ నమోదు, వ్యవసాయ విస్తీర్ణం ఆధారంగా పారదర్శకంగా కేటాయింపులు జరుగుతాయి
ప్రతి సచివాలయానికీ వీఏఏ, వీహెచ్‌ఏ లేదా వీఎస్‌ఏ
వ్యవసాయశాఖ హేతుబద్ధీకరణపై మార్గదర్శకాలు
అమరావతి, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 10,965 గ్రామ, వార్డు సచివాలయాల విలీనం ద్వారా కొత్తగా ఏర్పాటు చేసిన 5,678 క్లస్టర్లలో వ్యవసాయ, ఉద్యా న, పట్టు సహాయకుల హేతుబద్ధీకరణకు వ్యవసాయశాఖ చర్యలు చేపట్టింది. గ్రామీణ క్లస్టర్ల హేతుబద్ధీకరణకు మా ర్గదర్శకాలు జారీ చేసింది. రైతులకు మెరుగైన సేవలను అందించే లక్ష్యంతో ఉమ్మడి జిల్లా యూనిట్‌గా ప్రతి సచివాలయానికి వీఏఏ, వీహెచ్‌ఏ లేదా వీఎస్‌ఏను కేటాయించనున్నారు. ఇందుకోసం జిల్లా జాయింట్ కలెక్టర్ల అధ్యక్షతన జిల్లా వ్యవసాయ, ఉద్యాన, పట్టుశాఖల అధికారులు హేతుబద్ధీకరణ ప్రక్రియను పారదర్శకంగా, కార్యనిర్వాహకుల మధ్య పని భారాన్ని సమానంగా పంపిణీ చేయనున్నారు.
సామాజిక అటవీ ప్రాంతాన్ని, ఉద్యాన వనాలతో సహా, 2024 ఖరీఫ్, 2024-25 రబీలో ఈ-క్రాప్ నమోదు ప్రాంతాన్ని తీసుకుని, వీఏఏ, వీహెచ్‌ఏ, వీఎస్‌ఏలను సచివాలయాలకు కేటాయించనున్నారు. అత్యధికంగా ఉన్న వ్యవసాయ, ఉద్యాన, పట్టు విస్తీర్ణాన్ని బట్టి, వీఏఏ లేదా వీహెచ్‌ఏ లేదా వీఎస్‌ఏలను కేటాయించి, పేర్లు నమోదు చేయకుండా, క్యాడర్‌ను మాత్రమే చూపుతారు. ఈ-క్రాప్ పరిధిలోకి రాదని చెప్పబడే ప్రాంతాన్ని పరిశీలించి, సచివాలయాల తుది పరిధిని నిర్ధారించనున్నారు. కొన్ని జిల్లాల్లో విస్తీర్ణం హెచ్చుతగ్గులుగా ఉన్నా భూభాగాల గణాంకాలను పరిగణలోకి తీసుకుని, వీఏఏ, వీహెచ్‌ఏ, వీఎ్‌సవోలలో ఒకరిని నియమించనున్నారు. ఈ మేరకు వ్యవసాయశాఖ డైరెక్టర్ డిల్లీరావు పేర్కొన్నారు.