సమయానికి ఇస్తారా..!
ABN , Publish Date - Sep 19 , 2025 | 12:32 AM
పప్పుశనగ రైతుకు విత్తన దిగులు పట్టుకుంది. వరుస వర్షాలు రబీ సీజనపై ఆశలు రేపుతున్నాయి. అన్నదాతలు పొలాలను దున్ని సిద్ధంగా ఉంచారు. అక్టోబరులో తొలి వర్షం కురవగానే విత్తనం వేస్తామని అంటున్నారు. కానీ ...
పప్పు శనగ సాగుకు రైతులు సిద్ధం
సబ్సిడీ విత్తనం కోసం ఎదురు చూపులు
పాత బకాయిలపై సరఫరాదారుల పేచీ
టెండరు ప్రక్రియ పూర్తయ్యేది ఎన్నడు..?
పప్పుశనగ రైతుకు విత్తన దిగులు పట్టుకుంది. వరుస వర్షాలు రబీ సీజనపై ఆశలు రేపుతున్నాయి. అన్నదాతలు పొలాలను దున్ని సిద్ధంగా ఉంచారు. అక్టోబరులో తొలి వర్షం కురవగానే విత్తనం వేస్తామని అంటున్నారు. కానీ విత్తన సరఫరా టెండర్లు ఇంకా ఖరారు కాలేదు. పాత బకాయిలు చెల్లిస్తేనే అగ్రిమెంట్‌కు వస్తామని సరఫరాదారులు పేచీ పెడుతున్నారు. జిల్లాలో గత ఏడాది 72 వేల హెక్టార్లలో పప్పు శనగ సాగు అవుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. కానీ 50 వేల హెక్టార్లకు పరిమితమైంది. ఈ ఏడాది 50 వేల నుంచి 60 వేల హెక్టార్లలో పప్పు శనగ సాగయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రభుత్వం సకాలంలో విత్తనాలను అందిస్తే.. రైతులకు మేలు జరుగుతుంది.
అనంతపురం అర్బన, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): అక్టోబరు ఒకటో తేదీ నుంచి రబీ సీజన మొదలవుతుంది. అంటే.. మరో 12 రోజులే గడువు ఉంది. ఈ సీజనలో జిల్లాలోని నల్లరేగడి భూముల్లో పప్పుశనగ పంటను రైతులు సాగు చేస్తారు. ఆగస్టు నుంచి జిల్లాలో వరుసగా వర్షాలు కురుస్తున్నాయి. రబీ సాగు కోసం నల్లరేగడి భూములను ఇప్పటికే రైతులు సిద్ధం చేసుకున్నారు. సీజన మొదటై.. ఒక్క వర్షం కురిస్తే చాలు పప్పుశనగ విత్తనం వేస్తారు. రబీ సాగు కోసం ఏటా ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు పప్పుశనగ విత్తనాలను ఇస్తోంది. కానీ ఈ సారి జాప్యం జరిగేలా ఉంది. రాష్ట్ర స్థాయిలో పప్పుశనగ సరఫరా కోసం టెండర్ల ఖరారు ఇంకా పూర్తి కాలేదు. గత ఏడాది ఇదే సమయానికి టెండర్లు ఖరారు చేశారు. సెప్టెంబరు చివరి వారంలో సబ్సిడీ ధరలను ఖరారు చేశారు. అక్టోబరు మొదటి వారంలో పప్పుశనగ విత్తన పంపిణీ ప్రారంభించారు. కానీ ఈ ఏడాది టెండరు ప్రక్రియ ఎప్పుడు పూర్తి అవుతుందో తెలియడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బకాయిలే సమస్య
రబీ సీజనలో పప్పుశనగ విత్తనాల సరఫరా కోసం ఆగస్టు 13న ఈ-టెండర్ నోటిఫికేషన జారీ చేశారు. ఆ నెల 25వ తేదీ వరకూ టెండర్ల దాఖలుకు అవకాశం కల్పించారు. రాష్ట్రస్థాయిలో 12 మంది, ఉమ్మడి జిల్లాకు సంబంధించి నలుగురు విత్తన సరఫరాదారులు టెండర్లు దాఖలు చేసినట్లు సమాచారం. గత ఏడాది ఉమ్మడి జిల్లాలో 16 మంది విత్తన సరఫరాదారులు టెండర్లు దాఖలు చేశారు. గత ఏడాది రబీ సీజనలో పప్పుశనగ, ఈ ఏడాది ఖరీ్‌ఫలో వేరుశనగ విత్తన సరఫరాకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో రూ.70 కోట్లు బకాయిలు ఉన్నాయి. అందుకే ఈ సారి తక్కువ మంది విత్తన సరఫరాకు టెండర్లు వేశారని అంటున్నారు. టెండర్లు వేసిన విత్తన సరఫరాదారులతో రాష్ట్రస్థాయి అధికారులు ఈ నెల మొదటి వారంలో ఒకసారి, ఇటీవల రెండోసారి చర్చలు జరిపారు. బకాయిలు చెల్లిస్తేనే విత్తన సరఫరాకు అగ్రిమెంట్ చేసుకుంటామని సరఫరాదారులు ఖరాకండిగా చెప్పినట్లు సమాచారం. మరో వారంలో బకాయిలు చెల్లిస్తామని, అగ్రిమెంట్ చేసుకోవాలని అధికారులు కోరినా ససేమిరా అన్నట్లు తెలిసింది.
రబీపైనే రైతుల ఆశలు
ఖరీ్‌ఫలో వర్షాలు సరిగా కురవలేదు. పంటలు ఆశాజనకంగా లేవు. గత నెల నుంచి కురుస్తున్న వరుస వర్షాలు రబీపై ఆశలను పెంచాయి. ప్రభుత్వం సకాలంలో పప్పు శనగ విత్తనాలను సరఫరా చేస్తే తమకు మేలు జరుగుతుందని రైతులు అంటున్నారు. రబీ సీజన ఆరంభంలో పదును వర్షం పడితే పప్పుశనగ విత్తుతామని అంటున్నారు. చిన్న, సన్నకారు రైతులు ప్రభుత్వం సబ్సిడీపై అందించే పప్పుశనగ విత్తనాల కోసం ఎదురుచూస్తున్నారు. గత ఏడాది తరహాలోనే ఈ సారి కూడా సకాలంలో విత్తన పంపిణీ చేపట్టాలని కోరుతున్నారు.
సకాలంలో ఇస్తాం..
పప్పుశనగ పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. రబీ సీజనకు సకాలంలో పప్పు శనగ విత్తనం అందేలా చూస్తాం. రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు పప్పుశనగ విత్తన సరఫరా కోసం టెండర్లు పిలిచారు. విత్తన సరఫరాదారులతో చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే సబ్సిడీ ధరలు ఖరారయ్యే అవకాశం ఉంది.
- సుబ్బయ్య, ఏపీసీడ్స్ జిల్లా మేనేజర్