Share News

బీటీపీ పనులు సకాలంలో పూర్తి చేస్తాం

ABN , Publish Date - Oct 25 , 2025 | 12:41 AM

బీటీపీ కాలువ పనులను సకాలంలో పూర్తి చేసి, రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లోని ప్రతి చెరువును కృష్ణా జలాలతో నింపుతామని ఎమ్మెల్యేలు కాలవ శ్రీనివాసులు, అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు. బ్రహ్మసముద్రం మండలంలోని బీటీపీ ప్రాజెక్టు వద్ద శుక్రవారం గంగపూజ, జలహారతి చేపట్టారు. వారం రోజులుగా బీటీపీ ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వరద నీరు ప్రాజెక్టుకు వచ్చి చేరు..

బీటీపీ పనులు సకాలంలో పూర్తి చేస్తాం
MLAs Kalava and Amilineni bowing to Goddess Gangamma at BTP

చెరువులన్నింటినీ కృష్ణాజలాలతో నింపుతాం

ఎమ్మెల్యేలు కాలవ, అమిలినేని

కళ్యాణదుర్గం/రాయదుర్గం, అక్టోబరు24(ఆంధ్రజ్యోతి): బీటీపీ కాలువ పనులను సకాలంలో పూర్తి చేసి, రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల్లోని ప్రతి చెరువును కృష్ణా జలాలతో నింపుతామని ఎమ్మెల్యేలు కాలవ శ్రీనివాసులు, అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు. బ్రహ్మసముద్రం మండలంలోని బీటీపీ ప్రాజెక్టు వద్ద శుక్రవారం గంగపూజ, జలహారతి చేపట్టారు. వారం రోజులుగా బీటీపీ ఎగువ ప్రాంతంలో కురుస్తున్న వర్షాలకు వరద నీరు ప్రాజెక్టుకు వచ్చి చేరుతోంది. దీంతో టీడీపీ నాయకులు, రైతులతో కలిసి ఎమ్మెల్యేలు కాలవ, అమిలినేని గంగపూజ, జలహారతి చేపట్టారు. అనంతరం బీటీపీ గెస్ట్‌ హౌస్‌ వద్ద ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అక్కడే మొక్కలు నాటారు. అనంతరం ఎమ్మెల్యే అమిలినేని మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం బీటీపీ కాలువ పనులను పూర్తి చేయకుండా, రైతుల ను నట్టేట ముంచిందని విమర్శించారు. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు చొరవ తీసుకుని బీటీపీ కాలువ స్థితిగతులపై సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారన్నారు. సీఎం సానుకూలంగా స్పందించడంతో బీటీపీ కాలువ పనులను ప్రారంభించామన్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా పనులను వేగంగా పూర్తి చేస్తామన్నారు. ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు వాణి విలాస్‌ సాగర్‌ నిండటంతో ఆ ప్రాజెక్టు నుంచి 3వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారన్నారు. మన ప్రాంతానికి 600 క్యూసెక్కుల ఇనఫ్లో ఉందన్నారు. ఇది మరో ఆరు రోజులు ఇలాగే సాగితే 2 టీఎంసీల నీళ్లతో బీటీపీ డ్యామ్‌ పూర్తిస్థాయిలో నిండుతుందన్నారు. రైతులు ఐకమత్యంగా నీటిని వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బ్రహ్మసముద్రం మండల కన్వీనర్‌ పాలబండ్ల శ్రీరాములు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఆయాశాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2025 | 12:41 AM