Share News

NIMAJJANAM: వినాయకా.. వీడ్కోలిక..!

ABN , Publish Date - Sep 05 , 2025 | 12:21 AM

వినాయక చవితి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. గణేష్‌ విగ్రహాలు గురువారం మధ్యాహ్నం నుంచి గుడ్డం కోనేరు వద్ద నిమజ్జనానికి క్యూకట్టాయి. భక్తులు రంగులు చల్లుకుంటూ కులమతాలకు అతీతంగా నృత్యాలు చేస్తూ లంబోధరుడి ఊరేగింపులో ముందుకు సాగారు.

NIMAJJANAM: వినాయకా.. వీడ్కోలిక..!
Ganapati in procession

రాత్రి 9 గంటలకు 35 విగ్రహాలే

నేడు అతిపెద్ద విగ్రహాల నిమజ్జనం

హిందూపురం, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): వినాయక చవితి ఉత్సవాలు ముగింపు దశకు చేరుకున్నాయి. గణేష్‌ విగ్రహాలు గురువారం మధ్యాహ్నం నుంచి గుడ్డం కోనేరు వద్ద నిమజ్జనానికి క్యూకట్టాయి. భక్తులు రంగులు చల్లుకుంటూ కులమతాలకు అతీతంగా నృత్యాలు చేస్తూ లంబోధరుడి ఊరేగింపులో ముందుకు సాగారు. భక్తి పారవశ్యంతో జైభోలో గణేష్‌ మహరాజకి జై అంటూ నినాదాలు చేశారు. మళ్లీ రావయ్య గణేశా అంటూ విగ్రహాలను కోనేరుకి తరలించారు. చిన్నా పెద్దా తేడా లేకుండా వంద దాకా డీజేలు ఏర్పాటుచేసుకున్నారు. పట్టణంలో సూగూరు ఆంజనేయస్వామి సర్కిల్‌ నుంచి గురునాథ్‌ సర్కిల్‌ వరకు శ్రీకంఠపురం నుంచి పరిగి రోడ్డులోని కట్టుకాలువ వరకు విగ్రహాలు ఊరేగింపుగా ముందుకు సాగాయి. కోలాహలంగా కార్యక్రమం కొనసాగింది. పలు విగ్రహాల వద్ద లడ్డూలు వేలం పాట నిర్వహించారు. రాత్రి 9 గంటల వరకు చిన్న చిన్న విగ్రహాలు 35 మాత్రమే నిమజ్జనమయ్యాయి. ఇంకా 160కి పైగా విగ్రహాలు నిమజ్జనం కావాల్సి ఉంది. అయితే రాత్రి 12 గంటల వరకు మహా అయితే 60 నుంచి 70 వరకు నిమజ్జనం కావచ్చు. ఒక్కో విగ్రహం నిమజ్జనం కావడానికి పది నుంచి పదేహేను నిమిషాల సమయం పడుతోంది. రాత్రంతా రెండు క్రేన్లతో నిమజ్జనం చేసినా శుక్రవారం వరకు కొనసాగుతుంది.


ఎప్పటిలాగే నిమజ్జనం ఆలస్యం

ఈసారి కూడా వినాయక ప్రతిమలు మంటపాల నుంచి ఆలస్యంగానే ముందుకు కదిలాయి. అయితే ఉదయమే కదిలిన విగ్రహాలు రోడ్డెక్కి ముందుకు కదలకుండా ఆపేశారు. డీజేలు ఉండటం వలన ప్రతి విగ్రహం సాయంత్రం తరువాతే ముందుకు సాగింది. రాత్రి 9 గంటల సమయంలో కూడా శ్రీకంఠపురం సర్కిల్‌ నుంచి బాబా గుడి ఆర్చి వరకు ఉన్నాయి.

పెద్ద విగ్రహాలు నేడు నిమజ్జనం

హిందూపురంలో ఏర్పాటుచేసిన పెద్ద విగ్రహాలు శుక్రవారం నిమజ్జనం జరగనున్నాయి. అవి పట్టణం చుట్టేసుకొని గుడ్డం చేరుకునే సమయానికి తెల్లారుతుంది. దీంతో ఆ విగ్రహాల నిమజ్జనం శుక్రవారం రోజే జరుగునట్లుగా కనిపిస్తోంది.

పూజల్లో పాల్గొన్న టీడీపీ నాయకులు:

వినాయక నిమజ్జనం సందర్భంగా మున్సిఫల్‌ చైర్మన రమేష్‌, ఎమ్మెల్యే పిఏ బాలాజీ, పట్టణ కన్వీనర్‌ వెంకటేష్‌, వాల్మీకి కార్పోరేషన డైరెక్టర్‌ ఆనంద్‌, నాయకులు మంగేష్‌, చంద్రమోహన, మంజునాథ్‌, పవన, అంజి, అమరనాథ్‌, కౌన్సిలర్లు, నాయకులు పూజల్లో పాల్గొన్నారు. గుడ్డం వద్ద పలు విగ్రహాలకు పూజలు నిర్వహించి నిమజ్జనం చేశారు.

భద్రత కట్టుదిట్టం

గతంలో జరిగిన కొన్ని సంఘటనల నేపథ్యంలో ఈసారి పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను చేపట్టారు. పలు సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టగా, కొన్ని విగ్రహాల వద్ద పోలీసులు బందోబస్తు ఏర్పాటుచేశారు. ఎస్పీ రత్న, డీఎస్పీలు మహేష్‌, మహబూబ్‌బాషా, ఆదినారాయణ తదితరలతో పాటు పోలీసులు విగ్రహాలను ముందుకు కదలించారు. ఎస్పీ పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ రూంలో కూర్చొని విగ్రహాల నిమజ్జనాన్ని వీక్షించారు. అనంతరం ఆమె పలు ప్రాంతాల్లో నడుచుకుంటూ భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Updated Date - Sep 05 , 2025 | 12:22 AM