వేరే ఎరువు కొంటేనే యూరియా..!
ABN , Publish Date - Sep 20 , 2025 | 12:27 AM
యూరియా కావాలా నాయనా..? అయితే మరో ఎరువు కొంటే ఇస్తామంటూ ప్రైవేటు డీలర్లు రైతులకు బలవంతంగా ఇతర ఎరువులు అంటగడుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో కొందరు కొంటున్నారు. విడపనకల్లులోని ఓ ఫర్టిలైజర్ షాపులో మూడు రోజుల కిందట ఇదే గ్రామానికి చెందిన ఆసుపత్రి లింగన్న అనే రైతు ప్రైవేటు డీలరు వద్ద రెండు ...
అంటగడుతున్న ప్రైవేటు డీలర్లు
లబోదిబోమంటున్న అన్నదాతలు
విడపనకల్లు, సెప్టెంబరు 19(ఆంధ్రజ్యోతి): యూరియా కావాలా నాయనా..? అయితే మరో ఎరువు కొంటే ఇస్తామంటూ ప్రైవేటు డీలర్లు రైతులకు బలవంతంగా ఇతర ఎరువులు అంటగడుతున్నారు. విధిలేని పరిస్థితుల్లో కొందరు కొంటున్నారు. విడపనకల్లులోని ఓ ఫర్టిలైజర్ షాపులో మూడు రోజుల కిందట ఇదే గ్రామానికి చెందిన ఆసుపత్రి లింగన్న అనే రైతు ప్రైవేటు డీలరు వద్ద రెండు బస్తాల యూరియా కొనేందుకు వెళ్లాడు. యూరియా కావాలంటే నేను ఇచ్చే ఇతర ఎరువులు కూడా తీసుకోవాలని ఆ షాపు యజమాని రైతుపై ఒత్తిడి పెంచాడు. గత్యంతం లేక ఆషాపు నుంచి రెండు యూరియా బస్తాలతో పాటు రెండు బకెట్లలో ఇతర ఎరువులు రైతు కొన్నాడు. దీంతో మొత్తం బిల్లు రూ.2700 చేసి పంపాడు. రెండు యూరియా బస్తాలు తీసుకుంటే రూ.750 అవుతుంది. అలాంటిది ఇతర ఎరువులు అంటగట్టి రూ. 2వేలు అదనంగా ఖర్చు చేయించారని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ఎలాంటి బిల్లు ఇవ్వకుండా, ఏ ఎరువుకు ఎంత రేటు వేశారనే విషయం కూడా తెలపకుండా రూ.2700 తీసుకున్నట్లు రైతు వాపోయాడు. ప్రైవేటు డీలర్లు వద్ద యూరియా ఉన్నా రైతులకు ఇవ్వటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై ఏఓ పెన్నయ్యను వివరణ కోరగా విడపనకల్లు గ్రామానికి మాత్రమే 12 టన్నుల యూరియా వచ్చిందని తెలిపారు. యూరియా కోసం రైతులు ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ప్రతీ రైతుకు రెండు బస్తాలు తప్పకుండా ఇస్తామన్నారు. రైతును కలిసి, ప్రైవేటు డీలరు ఎవరు అనేది విచారించి, యూరియా ఇవ్వని డీలర్లపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
యూరియా కోసం రైతుల ఆందోళన
యూరియా కోసం మండల కేంద్రంలో రైతులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. విడపనకల్లుకు 12 టన్నుల యూరియా వచ్చింది. దీన్ని మండలకేంద్రంలోని రైతులకు శుక్రవారం పంపిణీ చేశారు. అయితే వచ్చిన యూరియా మధ్యాహ్నానికే అయిపోయింది. దీంతో వ్యవసాయ అధికారులతో రైతులు వాగ్వాదానికి దిగారు. పలుకుబడి ఉన్న వారికే యూరియా ఇస్తున్నారని, సామాన్య రైతులను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రైతుల అరుపులు వినలేక వ్యవసాయ శాఖ సిబ్బంది రైతు సేవా కేంద్రానికి తాళం వేసుకుని వెళ్లి పోయారు. యూరియా దొరకని వందలాది రైతులు శాపనార్థాలు పెట్టుకుంటూ వెళ్లిపోయారు.త