PANCHAYAT WORKERS: పారిశుధ్య పనులు చేయలేం
ABN , Publish Date - Sep 05 , 2025 | 12:25 AM
గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులను సకాలంలో వేతనాలు అందకపోవడంతో పనులు మానేస్తున్నారు. దీంతో గామాల్లో అపరిశుభ్రత తాండవిస్తోంది. చాలా గ్రామాల్లో ప్రజలు జ్వరాలబారిన పడుతున్నారు.
కనీస వేతనం రూ.15 వేలు ఇవ్వాలి
గ్రామాల్లో పేరుకుపోయిన చెత్త
లోపించిన పారిశుధ్యం
మడకశిర రూరల్, సెప్టెంబరు 4(ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులను సకాలంలో వేతనాలు అందకపోవడంతో పనులు మానేస్తున్నారు. దీంతో గామాల్లో అపరిశుభ్రత తాండవిస్తోంది. చాలా గ్రామాల్లో ప్రజలు జ్వరాలబారిన పడుతున్నారు. మండలంలో 16 పంచాయతీలు ఉండగా, 49 మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తుండేవారు. ఒక్కో కార్మికుడికి రోజుకు రూ.200 చొప్పున నెలకు రూ.6 వేలు ఇస్తుండేవారు. చాలీచాలని జీతాలతో ఎదో విధంగా కుటుంబాన్ని పోషించుకునేవారు. ఇస్తున్న ఆ అరకొర వేతనాలు కూడా 10 నెలలుగా సక్రమంగా ఇవ్వకపోవడంతో కుటుంబ పోషణ కష్టంగా మారడంతో చేస్తున్న పనులు వదలివేసి కార్మికులు ప్రత్యామ్నాయ మార్గలను ఎంచుకుంటున్నారు. దీంతో పనులు చేసువారు లేక గ్రామాల్లో ఎక్కడ చెత్త అక్కడే నిలిచిపోయింది. గ్రామాలు అపరిశుభ్రంగా దర్శనం ఇస్తున్నాయి. ఆప్పటికై ఉన్నతాధికారులు స్పందించి వెంటనే కార్మికులకు వేతనాలు చెల్లించి గ్రామాలను శుభ్రంగా ఉంచాలని ప్రజలు కోరుతున్నారు.
కనీస వేతనం రూ.15 వేలు ఇవ్వాలి
ఫ హనుమంతరాయప్ప, పారిశుధ్య కార్మికుడు
పారిశుధ్య కార్మికులకు రోజుకు రూ.500 చొప్పన, నెలకు కనీసవేతనం రూ.15 వేలు వేతనం ఇవ్వలి. ప్రస్తుతం రోజుకు రూ 200 చొప్పున నెలకు రూ.6 వేలు మాత్రమే ఇస్తున్నారు. అది కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. చాలా మంది కార్మికులకు 10 నెలల వేతనాలు చెల్లించాల్సి ఉంది. కుటుంబ పోషణ కష్టాంగా మారడంతో పనిమానేసి ఇతర పనులకు వెళుతున్నారు. హరేసముద్రం పంచాయతీలో ఆరుగురు కార్మికులు పనిచేయాల్సి ఉంది. నేను మాత్రమే పనిచేస్తున్నా. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలి.
నిధులు రాగానే వేతనాలు చెల్లిస్తాం
- సోనీబాయి, ఎంపీడీఓ, మడకశిర
మండలంలో 16 పంచాయతీల్లో 49 మంది పారిశుధ్య కార్మికులు పనిచేస్తున్నారు. వేతనాలు చెల్లించాల్సిన మాట వాస్తవమే పంచాయతీలకు నిధులు విడుదలైన వెంటనే కార్మికులందరికీ వేతనాలు చెల్లిస్తాం.