MURDER: వృద్ధురాలి హత్య
ABN , Publish Date - Jan 07 , 2025 | 12:02 AM
నగర శివారులోని టీచర్స్‌కాలనీలో ఒంటరిగా నివాసముంటున్న పొమ్మల సావిత్రమ్మ(63)ను గొంతుకోసి హత్య చేశారు. ఈ హత్య సోమవారం మధ్యాహ్నం 1.30గంటల నుంచి 4గంటల మధ్యలో జరిగి ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు.

అనంతపురం క్రైం, జనవరి 6 (ఆంధ్రజ్యోతి): నగర శివారులోని టీచర్స్‌కాలనీలో ఒంటరిగా నివాసముంటున్న పొమ్మల సావిత్రమ్మ(63)ను గొంతుకోసి హత్య చేశారు. ఈ హత్య సోమవారం మధ్యాహ్నం 1.30గంటల నుంచి 4గంటల మధ్యలో జరిగి ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. సావిత్రమ్మ భర్త ఓబులేసు అటవీశాఖలో రిటైర్డ్ అయ్యారు. కొన్నేళ్ల కిందటే ఆయన మృతి చెందారు. అప్పటి నుంచి ఆమె ఒంటరిగా ఉంటోంది. వారికి ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. పెద్దకుమారుడు విజయ్‌కుమార్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఆయన ప్రస్తుతం తన కుటుంబంతో కోవూరునగర్‌లో నివాసముంటున్నాడు. రెండో కుమారుడు జయకుమార్, కుమార్తె పూర్ణిమ అమెరికాలో ఉంటున్నారు. పెద్ద కుమారుడు విజయ్‌కుమార్ సోమవారం తన తల్లికి భోజనం క్యారియర్ ఇచ్చి వెళ్లాడు. సాయంత్రం 4.30గంటల సమయంలో ఇంట్లో పనులు చేయడానికి పనిమనిషి రమణమ్మ వచ్చింది. ఎంతసేపు పిలిచినా సావిత్రమ్మ పలకలేదు. దీంతో అడ్డంగా వేసిన డోర్‌ను తెరిచి లోపలికి వెళ్లింది. అక్కడ రక్తపు మడుగులో ఉన్న సావిత్రమ్మను చూసి, వెంటనే విషయాన్ని పెద్దకుమారుడికి ఫోన చేసి చెప్పింది. దీంతో విజయ్‌కుమార్ నాలుగో పట్టణ పోలీసులకు సమాచారం అందించాడు. ఫోర్త్‌టౌన సీఐ సాయినాథ్, ఎస్‌ఐ రాంప్రసాద్ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సావిత్రమ్మ గతంలో అంగనవాడీ టీచర్‌గా పనిచేసినట్లు చెబుతున్నారు. 2015లో ఆమె ఆ పోస్టుకు రిజైన చేసినట్లు సమాచారం.
తెలిసిన వారి పనేనా...?
సావిత్రమ్మ మెడపై పదునైన ఆయుధంతో కోసినట్లు కనిపిస్తోంది. ఆమె మెడలోని బంగారు గొలుసును మాత్రమే లాక్కెళ్లినట్లు తెలుస్తోంది. ఆమె చేతికున్న బంగారు గాజులు, చెవికున్న జుంకీలు అలాగే ఉన్నాయి. ఇంట్లోని బీరువాను పగులకొట్టిన ఆనవాళ్లు కనిపించలేదు. ఈ కోణంలో ఆలోచిస్తే దొంగలు పని కాదని తెలుస్తోంది. ఆ కుటుంబానికి లేదా ఆమెకు తెలిసిన వారే ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారనే అనుమానం వ్యక్తమవుతోంది. పోలీసులు వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్‌టీం, డాగ్‌స్క్వాడ్‌ల ద్వారా విచారణ ప్రారంభించారు. హత్యకు సంబంధించిన సమాచారం ఇస్తే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని సీఐ సాయినాథ్ తెలిపారు.