HAZ: మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది
ABN , Publish Date - Aug 09 , 2025 | 12:31 AM
ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని హజ్‌కమిటీ రాష్ట్ర చైర్మన హుస్సేనబాషాసాబ్ అన్నారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కార్యాలయం వద్ద ఆయన్ను హిందూపురానికి చెందిన ముస్లింలు సత్కరించారు.
హిందూపురం, ఆగస్టు 8(ఆంధ్రజ్యోతి):ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని హజ్‌కమిటీ రాష్ట్ర చైర్మన హుస్సేనబాషాసాబ్ అన్నారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కార్యాలయం వద్ద ఆయన్ను హిందూపురానికి చెందిన ముస్లింలు సత్కరించారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ హజ్‌యాత్రకు వెళ్లే ప్రతి ఒక్కరికీ రూ.లక్ష ప్రభుత్వం అందజేస్తుందన్నారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. 2014-2019వరకు ముస్లిం మైనార్టీలకు పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందన్నారు. మసీదుల్లో పనిచేసే ఇమాం, మౌజన్లకు నెలనెల వేతనాలు అందించే పథకాన్ని తీసుకొచ్చింది తెలుగుదేశమేనన్నారు. హిందూపురంలో జామియా మసీదు నిర్మాణానికి రూ.2.5కోట్లు మంజూరు చేయడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణకు ముస్లిం పట్ల ఉన్న అభిమానం చెప్పకనే చెప్పవచ్చన్నారు. ఉప ముఖ్యమంత్రి పవనకళ్యాణ్, నారాలోకేష్ ముస్లింల అభివృద్ధి సంక్షేమానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారన్నారు. త్వరలోనే దుల్హన పథకం అమలు చేస్తామన్నారు. హజ్‌యాత్రికులకు విజయవాడ విమానాశ్రయం నుంచి ప్రయాణాన్ని ప్రారంభిస్తే వారి ఖాతాలో రూ.లక్ష జమ అవుతుందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. మున్సిపల్ చైర్మన రమేష్, పట్టణాధ్యక్షుడు వెంకటేశ, హజ్‌కమిటీ సభ్యులు డైమండ్‌బాబా, మాజీ మున్సిపల్ చైర్మన అనీల్, టీడీపీ మైనార్టీ నాయకులు అయూబ్, అస్మతుల్లా, నజీర్, దాదాఖాన, అమీర్, ఫకృద్దీన, అన్వర్, మహబూబ్‌బాషా, షబ్బీర్ పాల్గొన్నారు.