Share News

MLA RAJU : మడకశిర సమగ్ర అభివృద్ధే లక్ష్యం

ABN , Publish Date - Dec 30 , 2025 | 12:04 AM

మడకశిర నగర పంచాయతీని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు అన్నారు. సోమవారం నగర పంచాయతీ కార్యాలయంలో కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించారు.

MLA RAJU : మడకశిర సమగ్ర అభివృద్ధే లక్ష్యం
MLA M.C. Raju speaking

మడకశిరటౌన, డిసెంబరు 29 (ఆంధ్రజ్యోతి): మడకశిర నగర పంచాయతీని అన్ని విధాలా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు అన్నారు. సోమవారం నగర పంచాయతీ కార్యాలయంలో కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి వార్డులోనూ మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకొంటున్నామన్నారు. రూ.2కోట్లతో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి టెండర్లు పిలవాలని సూచించారు. తాజ్‌క్లినిక్‌ రోడ్డు నిర్మాణం, 15వవార్డు ప్రభుత్వ ఆస్పత్రి వెనకభాగంలో సీసీరోడ్డు, మారుతీనగర్‌, మాళేరొప్పం, యాదవకాలనీ, టైలర్స్‌ కాలనీ తదితర చోట్ల రోడ్ల నిర్మాణానికి అన్ని చర్యలు తీసుకొంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో నగర పంచాయతీ చైర్మన నరసింహరాజు, వక్కలిగ కార్పొరేషన చైర్మన లక్ష్మీనారాయణ, కమిషనర్‌ జగన్నాథ్‌, వైస్‌ చైర్‌పర్సన వెంకటలక్ష్మమ్మ, ప్రభావతమ్మ, కౌన్సిలర్లు, అధికారులు పాల్గొన్నారు.

రైతులకు నష్టం చేకూరిస్తే సహించం: నియోజకవర్గంలో ట్రాన్సఫార్మర్ల కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు నష్టం చేకూరిస్తే సహించేది లేదని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎంఎస్‌ రాజు హెచ్చరించారు. ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో నియోజకవర్గంలోని ఏడీ, ఏఈలతో సమావేశమయ్యారు. ఆయన మాట్లాడుతూ.. రైతులు లోఓల్టేజీతోకానీ ఇతర ఏ సమస్యల వల్ల పెట్టిన పంటలు ఎండకుండా అన్ని విధాలా ఆదుకోవాలన్న లక్ష్యంతో ట్రాన్సఫార్మర్‌లను అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. కొందరు అధికారులు అందుకు భిన్నంగా అర్హత ఉన్న రైతులను వదిలి ఇతర మార్గాల్లో ట్రాన్సఫార్మర్లను వేరొకరికి అందిస్తున్నట్లు తమదృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వాటిని ఉపేక్షించబోమన్నారు. రైతుల వద్ద ట్రాన్సఫార్మర్ల కోసం ఇష్టానుసారంగా ఒప్పందాలు కుదుర్చుకొని రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని తీవ్ర స్థాయిలో మందలించారు. వెంటనే విద్యుత శాఖ ఎస్‌ఈకి ఫోనచేసి అధికారుల తీరుపట్ల వివరించారు. తీరు మార్చుకోకపోతే పరిణామాలు మరోలా ఉంటాయన్నారు. అర్హత ఉన్న రైతులకు న్యాయం జరిగి తీరాల్సిందే అని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏడీ రఘు, ఏఈలు పాల్గొన్నారు.

Updated Date - Dec 30 , 2025 | 12:04 AM