MLA RAJU: విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యం
ABN , Publish Date - Dec 13 , 2025 | 12:25 AM
విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యమని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. విద్యాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ కృషి చేస్తుంటే ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే విధంగా మీరు ప్రవర్తిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు.
మడకశిరటౌన, డిసెంబరు 12(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల భవిష్యత్తే ముఖ్యమని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. విద్యాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ కృషి చేస్తుంటే ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే విధంగా మీరు ప్రవర్తిస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామితో కలిసి నియోజకవర్గంలోని రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపాళ్లు, ఎస్‌ఓలు, వార్డెనలతో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ మీ నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. మీ నిర్లక్ష్యం వల్ల వారి విద్య కుంటుపడే ప్రమాదం ఉందని, వారి భవిష్యత్తుతో చెలగాటం ఆడవద్దని హెచ్చరించారు. కూరగాయలు పశువులు తినే విధంగా కూడా లేవని, అలాంటి వాటితో వండి విద్యార్థులకు ఎలా పెడతారని మండిపడ్డారు. కలెక్టర్‌తోపాటు తనిఖీ చేసిన సమయంలో అనేక లోటుపాట్లు వెలుగులోకి వచ్చాయని, మీ నిర్లక్ష్యం వల్ల అందరూ ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొందన్నారు. విద్యార్థుల విషయంలో రాజీపడే ప్రసక్తే ఉండదని, అధికారులు, ప్రజా ప్రతినిధులు ఏం చేస్తారులే అంటూ అహంకార ధోరణితో మీ వ్యవహార శైలి ఉందని, మార్చుకోకపోతే పరిణామాలు మరోలా ఉంటాయన్నారు.
ప్రజా సమస్యలు పరిష్కరించడమే లక్ష్యం
ప్రతి సమస్యను సకాలంలో పరిష్కరించడమే లక్ష్యమని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామితో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొన్నారు. నియోజకవర్గం నుంచి సమస్యలు చెప్పుకొనేందుకు ప్రజలు తరలివచ్చారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చే ప్రతి సమస్యను కాలపరిమితి నిర్ణయించుకొని పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు.