PRASAD: తేజ ప్రసాద్ కన్నుమూత
ABN , Publish Date - Jan 06 , 2025 | 11:59 PM
సీనియర్ జర్నలిస్టు తేజ ప్రసాద్(66) సోమవారం కన్నుమూశారు. ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన అసలు పేరు నందినేని దేవ ప్రసాద్.

నేడు ప్రెస్‌క్లబ్ నుంచి అంతిమయాత్ర
అనంతపురం ప్రెస్‌క్లబ్/అర్బన, జనవరి 6(ఆంధ్రజ్యోతి): సీనియర్ జర్నలిస్టు తేజ ప్రసాద్(66) సోమవారం కన్నుమూశారు. ఆయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఆయన అసలు పేరు నందినేని దేవ ప్రసాద్. 1995 నుంచి దాదాపు 30 ఏళ్లుగా అనేక మీడియా సంస్థల్లో పనిచేశారు. స్ఫూర్తిదాయకమైన కథనాలు రాశారు. ఎలకా్ట్రనిక్ మీడియాలో ప్రవేశించి, తేజ న్యూస్ చానల్ తరఫున సేవలు అందించడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయనను తేజ ప్రసా ద్, జెమినీ ప్రసాద్ అని పిలుచుకునేవారు. మృదుస్వభావి, అందరితో కలుపుగోలుగా ఉండే ఆయన మృతి పట్ల ఉమ్మడి జిల్లా జర్నలిస్టులు, ఫొటో, వీడియో జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాల నాయకులు ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. ఆయన పార్థివ దేహాన్ని మెడికల్ కాలేజీకి అప్పగించాలని నిర్ణయించారు. అనంతపురం నగరంలోని ప్రెస్‌క్లబ్ నుంచి మంగళవారం ఉదయం 10 గంటలకు అంతిమయాత్ర మొదలవుతుంది.
ఫ సీనియర్ జర్నలిస్టు దేవ ప్రసాద్ మృతికి ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ సంతాపం వ్యక్తం చేశారు. జిల్లాలోని తొలితరం జర్నలిస్టు, జర్నలిజానికి తన జీవితాన్ని అంకితం చేసిన దేవ ప్రసాద్ మృతి జర్నలిస్టు లోకానికి తీరని లోటు అని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఫ సీనియర్ జర్నలిస్టు దేవ ప్రసాద్ మృతికి ప్రభుత్వ విప్ కాలవ శ్రీనివాసులు, అనంతపురం అర్బన ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్ సంతాపం వ్యక్తం చేశారు. సుదీర్ఘకాలంపాటు మీడియా రంగంలో పనిచేసిన ఆయన సేవలు మరువలేనివని వారు కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవున్ని ప్రార్థించారు.
ఫ సీనియర్ జర్నలిస్టు దేవ ప్రసాద్ మాజీ మంత్రి, దివంగత పరిటాల రవీంద్రకు అత్యంత సన్నిహితులని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత, టీడీపీ ధర్మవరం నియోజకవర్గ ఇనచార్జి పరిటాల శ్రీరామ్ గుర్తు చేసుకున్నారు. ఆయన మృతికి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. ఆయనకు కుటుంబ సభ్యులు లేకున్నా.. జర్నలిస్టులే కుటుంబమని, ఆయన జ్ఞాపకార్థం చేయాల్సిన పనులకు తమ కుటుంబం సహకరిస్తుందని తెలిపారు.