SACHIVALAYAM: విధులకు సచివాలయ సిబ్బంది డుమ్మా..!
ABN , Publish Date - Nov 22 , 2025 | 12:05 AM
వేపరాళ్ల పంచాయతీ సచివాలయంలో శుక్రవారం విధులకు డుమ్మా కొట్టారు. సిబ్బంది రాకపోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఇక్కడ 9 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఏ ఒక్కరూ సచివాలయంలో లేకపోవడం, వివిధ సమస్యలపైన వచ్చిన ప్రజలు వెనుతిరిగినట్లు తెలిసింది.
గాండ్లపెంట, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): వేపరాళ్ల పంచాయతీ సచివాలయంలో శుక్రవారం విధులకు డుమ్మా కొట్టారు. సిబ్బంది రాకపోవడంతో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఇక్కడ 9 మంది ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ఏ ఒక్కరూ సచివాలయంలో లేకపోవడం, వివిధ సమస్యలపైన వచ్చిన ప్రజలు వెనుతిరిగినట్లు తెలిసింది. సచివాలయంలో వివిధ శాఖల అధికారులు ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన వారు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఉద్యోగులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉద్యోగులు ఎప్పుడు వస్తారో, ఎప్పుడు వెళ్తారో తెలియ పరిస్థితి. కార్యాలయంలో విలువైన రికార్డులను, కంప్యూటర్‌లను వదిలేసి ఎక్కడికి వెళ్లారోనని పలువురు చర్చించుకుంటున్నారు. సచివాలయంలో విధులు నిర్వహించే అధికారులు సర్వేల పేరుతో సాకులు చెప్పి విధులకు డుమ్మా కొడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కనీసం హాజరు పట్టికలో కూడా 12 గంటలు అయినా ఒకరో, ఇద్దరో సంతకాలు చేశారు కానీ మిగిలిన వారు ఇటువైపు కన్నెత్తి చూసినట్లు లేదని తెలుస్తోంది. దీనిపై ఎంపీడీఓ రామకృష్ణను ఫోనలో సంప్రదించగా సిబ్బంది ఎక్కడికి వెళ్లారో తెలుసుకుంటానని సమాధానమిచ్చారు.