స్త్రీ శక్తితో ఆర్టీసీకి నష్టం లేదు
ABN , Publish Date - Aug 20 , 2025 | 12:41 AM
మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం నుంచి ఆర్టీసీకి ఆర్థికంగా ఎలాంటి నష్టం ఉండదనీ, నిర్వహణ భారం మాత్రమే ఉంటుందని ఎండీ ద్వారకాతిరుమలరావు తెలిపారు. మంగళవారం ఆయనతోపాటు ఆర్టీసీ రీజనల్ చైర్మన పూల నాగరాజు రాయదుర్గం డిపోను సందర్శించారు. డిపోలో పనిచేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులతో మాట్లాడి బస్టాండ్ భవనాన్ని పరిశీలించారు. అనంతరం ...
ఎండీ ద్వారకా తిరుమలరావు
రాయదుర్గం, ఆగస్టు 19(ఆంధ్రజ్యోతి): మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్త్రీ శక్తి పథకం నుంచి ఆర్టీసీకి ఆర్థికంగా ఎలాంటి నష్టం ఉండదనీ, నిర్వహణ భారం మాత్రమే ఉంటుందని ఎండీ ద్వారకాతిరుమలరావు తెలిపారు. మంగళవారం ఆయనతోపాటు ఆర్టీసీ రీజనల్ చైర్మన పూల నాగరాజు రాయదుర్గం డిపోను సందర్శించారు. డిపోలో పనిచేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులతో మాట్లాడి బస్టాండ్ భవనాన్ని పరిశీలించారు. అనంతరం శిథిలావస్థకు చేరుకున్న ఆర్టీసీ బస్టాండు భవనాన్ని పునఃనిర్మించేందుకు నిధులు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం ఎండీ మాట్లాడుతూ.. బస్సుల్లో ఆక్యుపెన్సీ ప్రస్తుతం 93 శాతానికి చేరుకుందన్నారు. అంతరాష్ట్ర సర్వీసుల్లో సరిహద్దు స్టేజ్ వరకు ఉచిత ప్రయాణాన్ని కల్పించే విషయంపై పరిశీలిస్తున్నామన్నారు. త్వరలో సానుకూల నిర్ణయం తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో కడప ఈడీ చంద్రశేఖర్, ఆర్‌ఎం శ్రీలక్ష్మి, డిపో మేనేజర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.
సరిహద్దు స్టేజ్ వరకు అమలు చేయండి
ఆర్టీసీ ఎండీకి ఎమ్మెల్యే కాలవ విజ్ఞప్తి
అంతరాష్ట్ర బస్సు సర్వీసుల్లో రాష్ట్ర సరిహద్దు స్టేజ్ వరకు మహిళల ఉచిత ప్రయాణానికి అనుమతి ఇవ్వాలని ఏపీఎ్‌సఆర్టీసీ ఎండీ ద్వారకాతిరుమలరావుకు ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు విజ్ఞప్తి చేశారు. రాయదుర్గానికి వచ్చిన ఆయనను ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో మంగళవారం ఎమ్మెల్యే కలిసి వివిధ అంశాలపై వినతిపత్రాలు సమర్పించారు. రాష్ట్ర సరిహద్దు స్టేజ్ వరకు ఉచిత ప్రయాణం అమలు చేయకపోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోందని వివరించారు. వెనుకబడ్డ నియోజకవర్గంలో రాయదుర్గం నుంచి కర్ణాటక సరిహద్దు ప్రాంతాలు చాలా దగ్గరంలో ఉన్నాయన్నారు. ఆయా ప్రాంతాలకు అనేక పల్లెవెలుగు బస్సులు అంతర్రాష్ట్ర సర్వీసులుగా నడుస్తున్నాయన్నారు. స్త్రీ శక్తి పథకం అంతర్రాష్ట్ర సర్వీసులకు వర్తించకపోవడం వల్ల మహిళలు ఉచితంగా ప్రయాణించలేకపోతున్నారని వివరించారు. రాయదుర్గం నుంచి బళ్లారికి వెళ్లే పల్లెవెలుగు బస్సులు ఆంధ్ర సరిహద్దు వరకు దాదాపు 48 కి.మీ. ప్రయాణం చేస్తాయనీ, 11 కి.మీ. మాత్రమే కర్ణాటకలో నడుస్తాయన్నారు. ఇలాంటి ప్రాంతాలలో నడిచే పల్లెవెలుగు అంతర్రాష్ట్ర బస్సు సర్వీసుల్లో రాష్ట్ర సరిహద్దు స్టేజ్ వరకు స్త్రీశక్తి పథకాన్ని అమలు చేయడం వల్ల మహిళలకు ప్రయోజనం చేకూరకుతుందని తెలిపారు. దీనిపై ద్వారకా తిరుమలరావు సానుకూలంగా స్పందించారు. ఇదివరకే ముఖ్యమంత్రితో ఈ అంశంపై చర్చించామన్నారు. రాష్ట్ర సరిహద్దు స్టేజ్ వరకు అమలు చేయడం వల్ల ఆర్టీసీపై ఏ మేరకు అదనపు భారం పడుతుందో సమగ్ర వివరాలు అందించాలని ముఖ్యమంత్రి ఆదేశించారని ఎండీ తెలియజేశారు.