TDP: పురం రోడ్ల అభివృద్ధికి రూ.45 కోట్లు
ABN , Publish Date - Aug 12 , 2025 | 12:09 AM
హిందూపురం నియోజకవర్గంలో ఆర్‌అండ్‌బీ రహదారులు, వంతెన నిర్మాణం కోసం రూ.45కోట్లు నిధులు విడుదలైనట్లు మున్సిపల్ చైర్మన రమేష్, ఎమ్మెల్యే పీఏ వీరయ్య తెలిపారు.
హిందూపురం, ఆగస్టు 11(ఆంధ్రజ్యోతి): హిందూపురం నియోజకవర్గంలో ఆర్‌అండ్‌బీ రహదారులు, వంతెన నిర్మాణం కోసం రూ.45కోట్లు నిధులు విడుదలైనట్లు మున్సిపల్ చైర్మన రమేష్, ఎమ్మెల్యే పీఏ వీరయ్య తెలిపారు. సోమవారం ఎమ్మెల్యే కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ నియోజకవర్గంలో పలుచోట్ల ఆర్‌అండ్‌బీ రోడ్లు మరమ్మతులు, నూతన రోడ్లు, వంతెనల నిర్మాణానికి ప్రభుత్వం రూ.45కోట్లు పరిపాలన అనుమతులు ఇచ్చిందన్నారు. త్వరలోనే వీటికి సంబంధించి టెండర్లు పిలుస్తారన్నారు. హిందూపురం, పెనుకొండ రహదారిలో కొట్నూరు మరువవద్ద బ్రిడ్జి నిర్మాణం, కొడికొండవద్ద చిత్రావతిపై వంతెన నిర్మాణం, కిరికెర నుంచి బేవనహళ్లిపై వంతెన నిర్మాణానికి అనుమతులు వచ్చాయన్నారు. కంచిసముద్రం, చిలమత్తూరు మండలం కర్ణాటక సరిహద్దులో తారురోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయన్నారు. రాచపల్లి, చలివెందుల- కొండూరు మీదుగా రోడ్డు నిర్మాణానికి సంబంధించి త్వరలోనే పనులకు టెండర్లు పిలుస్తారన్నారు. అప్పటికే పట్టణంలో సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి రూ.92.5కోట్లు, అహుడా నుంచి రూ.15కోట్లు, అమృతపథకం ద్వారా రూ.108కోట్లు అభివృద్ధి పనులకు సంబందించి టెండర్ల ప్రక్రియలో ఉన్నాయన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ ఎక్కడున్నా నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషిచేస్తున్నారన్నారు.