ROADS: రోడ్లకు మహర్దశ
ABN , Publish Date - Dec 30 , 2025 | 12:00 AM
మండల కేంద్రంలో 25ఏళ్ల క్రితం జనాభా తక్కువ ఉన్న సమయంలో వారపుసంతను రోడ్డుపై నిర్వహించేవారు. రాను రాను పట్టణం విస్తరించింది. మేజర్ పంచాయతీలో 20వేలకుపైగా జనాభా ఉంది. నేటికీ పాతూరుకు వెళే ్లదారిలోనే వారపుసంత నిర్వహిస్తున్నట్లు వ్యాపారులు అంటున్నారు.
మండల వ్యాప్తంగా రూ.8.60కోట్లతో పనులు
మంత్రి సవిత చొరవతో అభివృద్ధి పరుగులు
పరిగి, డిసెంబరు 29(ఆంధ్రజ్యోతి): ఎంతో కాలంగా ప్రజలు, వాహనదారులు ఎదుర్కొంటున్న రహదారుల సమస్యకు మంత్రి సవిత చొరవతో బ్రేక్‌పడింది. గ్రామాల నుంచి పరిశ్రమలకు వెళ్లే మహిళలు ఆటో, దిచక్రవాహనాల్లో ప్రయాణించాలంటే రోడ్లు సరిగాలేక తీవ్ర ఇబ్బందులు పడేవారు. రాత్రి సమయాల్లో ప్రయాణమంటే నరకప్రాయంగా ఉండేది. అధికారంలోకి వచ్చిన వెంటనే రహదారుల సమస్యను పరిష్కరిస్తామని మంత్రి సవిత ఇచ్చిన హామీ మేరకు సంవత్సరానికే విట్టాపల్లి నుంచి తిరుమలదేవరపల్లికి రూ.కోటితో తారు రోడ్డు, ఊటకూరు నుంచి అక్కంపల్లికి దాదాపు 2కి.మీ మేర రూ.1.90కోట్లతో సీసీరోడ్డు, పరిగి హైవే నుంచి తిరుమలదేవరపల్లి కి.మీ మేర రూ.1.70కోట్లతో తారు రోడ్డు, పైడేటి రోడ్డు నుంచి మూడిండ్లపల్లి మీదుగా ముద్దిరెడ్డిపల్లి రూ.1.20కోట్లతో సీసీరోడ్డు, తారురోడ్డు, కొడికొండ-శిర హైవేలో సింగిరెడ్డిపల్లి క్రాస్ నుంచి బసవనపల్లి వరకు రూ.1.60కోట్లతో సీసీరోడ్డు, పరిగి నుంచి బోరెడ్డిపల్లి మీదుగా రూ.80లక్షలతో సీసీరోడ్డు నిర్మించారు. బీచిగానిపల్లి నుంచి పాత్రగానిపల్లి వరకు రూ.80లక్షలు రోడ్డుకు నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. మంత్రి సవిత అదిష్టానంతో రోడ్డు సమస్యపై చర్చించి పరిగి మండలానికి రూ.8.60కోట్ల నిధులు మంజూరు చేయించారు.
అక్కమ్మపల్లికి సీసీ రోడ్డు..
పెన్నానది తీరంలో ఉన్న అక్కంపల్లి గ్రామానికి 40ఏళ్లుగా దారిలేక ప్రజలు ఇబ్బందులు పడుతుండటంతో వెంటనే సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లగా ఆమె స్పందించి ఊటకూరు పంచాయతీ రైతులతో చర్చించారు. రైతులు తమ భూమిని దారికోసం ఇవ్వడానికి ముందుకురాగా రూ.1.70కోట్లతో సీసీరోడ్డు ఏర్పాటు చేయించారు.