Share News

MLA SUNITHA : ఆర్డీటీ మా జిల్లాలకు వరం

ABN , Publish Date - Sep 23 , 2025 | 12:06 AM

దేశంలోనే అత్యంత కరువు పీడిత ప్రాంతమైన అనంతపురం ఉమ్మడి జిల్లాకు ఆర్డీటీ సంస్థ ఒక వరమని, అలాంటి సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్‌ చేసి కాపాడాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

MLA SUNITHA : ఆర్డీటీ మా జిల్లాలకు వరం

అసెంబ్లీలో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత

అనంతపురం, సెప్టెంబరు22 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే అత్యంత కరువు పీడిత ప్రాంతమైన అనంతపురం ఉమ్మడి జిల్లాకు ఆర్డీటీ సంస్థ ఒక వరమని, అలాంటి సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్‌ చేసి కాపాడాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో సోమవారం ఆమె మాట్లాడుతూ ఐదు దశాబ్దాలకుపైగా ఉమ్మడి అనంత జిల్లాలోనే కాకుండా ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లో మొత్తం 152 మండలాలు, 4 వేల గ్రామాల్లో 5 లక్షల కుటుంబాలకు ఆర్డీటీ ద్వారా సేవలందుతున్నాయన్నారు. సుమారు 20 లక్షల మందికిపైగా ఈ సంస్థపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. వైద్యం, విద్య, వ్యవసాయం, గృహ నిర్మాణాలు, క్రీడలపరంగా సంస్థ సేవలందిస్తోందన్నారు. ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యువల్‌ చేయకపోవడం వల్ల కీలకమైన సేవలు ఆగిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. దీనిపై జిల్లా టీడీపీ నాయకులు, రాష్ట్ర ఎంపీల సహకారంతో కేంద్ర హోంమంత్రి అమితషాని కలిసి విజ్ఞప్తి చేసినా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. అందుకే అసెంబ్లీ సభ ద్వారా కేంద్రానికి ప్రతిపాదన పంపించాలని ఆమె ప్రభుత్వాన్ని కోరారు.

రైతులను ఆదుకోండి

జిల్లాలో వర్షాధారంగానే ఏడు లక్షల హెక్టార్ల వరకూ పంటలు సాగవుతాయని, ప్రతి ఏటా అతివృష్టి లేదా అనావృష్టి మూలంగా జిల్లా రైతాంగం పంటలు నష్టపోతున్నట్లు సభలో పేర్కొన్నారు. ప్రతి ఏటా పంటలు వేయడమే తప్పా లాభం తీసుకున్న సందర్భాలే లేవన్నారు. కనీసం పెట్టుబడులు రాక ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఈ ఏడాది ఖరీఫ్‌ సీజనలో జిల్లాలో వర్షాలు సకాలంలో రాక పంటలు వేయలేకపో యారన్నారు. అరకొరగా విత్తనం వేసినా వర్షాలు లేక ఎండిపోయింద న్నారు. ఐదేళ్ల పాలనలో వైసీపీ బీమా వ్యవస్థను నాశనం చేసిందని మండిపడ్డారు. వేరుశనగకు ప్రత్యామ్నాయంగా మొక్కజొన్న, కంది, ఆముదం పంటలు వేస్తున్నారని, ఇందుకు ప్రభుత్వం నుంచి సహకారం కావాలని కోరారు. మార్కెటింగ్‌ శాఖ ద్వారా టమోటా ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసేలా సహకారం అందించాలని ఆమె ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఉల్లి రైతులకు హెక్టారుకు రూ. 50 వేలు ఇస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వానికి పరిటాల సునీత ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - Sep 23 , 2025 | 12:07 AM