Share News

MLA SUNITHA: బీసీ హాస్టళ్లలో సౌకర్యాలు కల్పించండి

ABN , Publish Date - Mar 11 , 2025 | 12:13 AM

బీసీ సంక్షేమ వసతిగృహాల్లో సౌకర్యాలు కల్పించాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీలో సోమవారం ఆమె మాట్లాడుతూ వైసీపీ ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ వసతిగృహాలు, పాఠశాలలు అధ్వానస్థితికి చేరాయన్నారు.

MLA SUNITHA:  బీసీ హాస్టళ్లలో సౌకర్యాలు కల్పించండి

అనంతపురం, మార్చి10(ఆంధ్రజ్యోతి): బీసీ సంక్షేమ వసతిగృహాల్లో సౌకర్యాలు కల్పించాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీలో సోమవారం ఆమె మాట్లాడుతూ వైసీపీ ఐదేళ్ల పాలనలో ప్రభుత్వ వసతిగృహాలు, పాఠశాలలు అధ్వానస్థితికి చేరాయన్నారు. గత పాలకులు నిర్లక్ష్యం కారణంగా పేద విద్యార్థులకు సరైన వసతులు అందక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత బడ్జెట్‌లో బీసీల సంక్షేమానికి రూ. 47వేల కోట్లు నిధులు కేటాయించి వారి అభివృద్ధికి తోడ్పాటు నందించింద న్నారు. గతంలో బీసీల విద్యార్థుల కోసం పాఠశాలలు, వసతిగృహాలు ఏర్పాటు చేశారన్నారు. అందులో భాగంగానే రాప్తాడు నియోజకవర్గంలోని నసనకోటసమీపంలో గత టీడీపీ ప్రభుత్వంలో ఎంజేపీ బాలికల పాఠశాల నిర్మించి రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలిపారన్నారు. ప్రస్తుతం ఆ పాఠశాలను జూనియర్‌ కళాశాలగా అప్‌గ్రేడ్‌ చేసినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకి ఆమె ధన్యవాదాలు తెలిపారు. అయితే జిల్లాలోని బీసీ వసతిగృహాలు, ఎంజేపీ, మోడల్‌ పాఠశాలల్లో విద్యార్థులకు తగినన్ని మరుగుదొడ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారన్నారు. చెన్నేకొత్తపల్లి బీసీ బాలుర వసతిగృహం, పేరూరు ఎంజేపీ బాలుర పాఠశాల, కనగానపల్లి మోడల్‌ పాఠశాలల్లో మౌలిక వసతులు కరువయ్యాయన్నారు. వెనుకబడిన అనంత జిల్లాలో పేద విద్యార్థులు చదువుకునేందుకు సౌకర్యాలు కల్పించాలన్నారు. బీసీలకు ఇస్తున్న సబ్సిడీ రుణాల సంఖ్యను మరింత పెంచాలని కోరారు. అసెంబ్లీలో తాను ప్రస్తావించిన అంశాలు సూటిగా, స్పష్టంగా ఉన్నాయని డిప్యూటీ స్పీకర్‌ రఘురామకృష్ణంరాజు అభినందించారని ఆమె తెలిపారు.

Updated Date - Mar 11 , 2025 | 12:13 AM