Share News

SANITATION: లోపించిన పారిశుధ్యం

ABN , Publish Date - Aug 30 , 2025 | 11:55 PM

గ్రామాల్లో పారిశుధ్యం లోపించడంతో ప్రజలు వ్యాధులబారిన పడుతున్నారు. రెండువారాలపాటు ఎడితెరిపి లేకుండా వర్షాలు కురవడంతో గ్రామాల్లో వీధులు, రహదారులు చిత్తడిగా మారాయి.

SANITATION: లోపించిన పారిశుధ్యం
Sewage flowing between houses

రోగాలతో అల్లాడుతున్న ప్రజలు

పట్టించుకోని పంచాయతీ అధికారులు

మడకశిర రూరల్‌, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): గ్రామాల్లో పారిశుధ్యం లోపించడంతో ప్రజలు వ్యాధులబారిన పడుతున్నారు. రెండువారాలపాటు ఎడితెరిపి లేకుండా వర్షాలు కురవడంతో గ్రామాల్లో వీధులు, రహదారులు చిత్తడిగా మారాయి. దీంతో దోమలు వ్యాప్తిచెంది ప్రజలు రోగాలు బారిన పడుతున్నారు. మండలంలో 16 పంచాయతీలు, 110 గ్రామాలు ఉన్నాయి. చాలా గ్రామాల్లో డ్రైనేజీలు లేకపోవడం, మరికొన్ని గ్రామాల్లో రోడ్లపైనే మురుగునీరు ప్రవహిస్తున్నాయి. చిన్నారులు, వృద్ధులు జ్వరాలు, జలుబు దగ్గు తదితర జబ్బులబారిన పడుతున్నారు. మండలంలోని కదిరేపల్లి, కల్లుమర్రి, గుండుమల, నీలకంఠాపురం గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఒక్కో కేంద్రానికి రోజుకు సగటున 70 నుంచి 120 మంది వరకు రోగులు వస్తున్నారు. మరికొంత మంది ప్రైవేట్‌ క్లినిక్‌లకు వెళుతున్నారు. అయితే పంచాయతీలను పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టించుకోకపోవడంతో సమస్యగా మారింది. డ్రైనేజీల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించే నాథుడు లేడని ఆయా గ్రామాల ప్రజలు వాపోతున్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.

నీరు కలుషితం కాకుండా చూసుకోవాలి

ఫ డాక్టర్‌ నరేష్‌ కుమార్‌, కదిరేపల్లి

నీరు కలుషితం కాకుండా తగుజాగ్రత్త తీసుకోవాలి. పరిసరాల పరిశుభ్రతతో పాటు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. కాచి చల్లార్చిన నీటిని తాగాలి. ఇళ్లలో నీరు నిల్వ ఉంచుకోకుండా ఎప్పటికప్పుడు డ్రమ్ములు, తొట్టెలను శుభ్రం చేసుకోవాలి. చిన్నాపాటి అనారోగ్య సమస్య వచ్చినా నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి.

Updated Date - Aug 30 , 2025 | 11:55 PM