Share News

లోపల పంచ.. బయట బెంచ ..!

ABN , Publish Date - Nov 19 , 2025 | 12:40 AM

జిల్లా కేంద్రంలోని పెద్దాస్పత్రి డాక్టర్లు కొందరు డ్యూటీలకు డుమ్మా కొడుతున్నారు. విధులకు వచ్చినట్లు ఎఫ్‌ఆర్‌ఎ్‌స(ఫేషియల్‌ రికగ్నిషన సిస్టమ్‌)ను వేసి వెళ్లిపోతున్నారు. టీచింగ్‌ ఫ్యాకల్టీలోని ప్రొఫెసర్‌, అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లతో పాటు పీజీ విద్యార్థులు మొత్తం 539మంది ప్రభుత్వ వైద్యవిద్యకళాశాల పరిధిలో పని చేస్తున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు విధులు నిర్వర్తించాలి. ఉదయం 9.10గంటల్లోపు ఎంట్రీ ఎఫ్‌ఆర్‌ఎస్‌, సాయంత్రం ...

లోపల పంచ..  బయట బెంచ ..!
Renuka, an associate professor in the Department of Gynecology, and her husband, an associate professor in the Department of Anesthesia, were leaving the Medical College on the morning of the 12th after completing their FRS.

పెద్దాస్పత్రిలో డ్యూటీలకు డాక్టర్ల డుమ్మా..!

ఎఫ్‌ఆర్‌ఎస్‌ వేసి వెళ్లిపోతున్న కొందరు

సూపర్‌ స్పెషాలిటీ, క్యాన్సర్‌ యూనిట్‌లో విధులు

కాలేజీలోనే ఎఫ్‌ఆర్‌ఎస్‌ వేస్తున్న వైద్యులు

పర్యవేక్షణ కొరవడటం వల్లే సమస్యలు

అనంతపురం వైద్యం, నవంబరు 18(ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని పెద్దాస్పత్రి డాక్టర్లు కొందరు డ్యూటీలకు డుమ్మా కొడుతున్నారు. విధులకు వచ్చినట్లు ఎఫ్‌ఆర్‌ఎ్‌స(ఫేషియల్‌ రికగ్నిషన సిస్టమ్‌)ను వేసి వెళ్లిపోతున్నారు. టీచింగ్‌ ఫ్యాకల్టీలోని ప్రొఫెసర్‌, అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లతో పాటు పీజీ విద్యార్థులు మొత్తం 539మంది ప్రభుత్వ వైద్యవిద్యకళాశాల పరిధిలో పని చేస్తున్నారు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకు విధులు నిర్వర్తించాలి. ఉదయం 9.10గంటల్లోపు ఎంట్రీ ఎఫ్‌ఆర్‌ఎస్‌, సాయంత్రం 4గంటలపైన ఎగ్జిట్‌ ఎఫ్‌ఆర్‌ఎస్‌ వేయాలని నిబంధన పెట్టారు. విధించిన సమయానికి అరగంట సమయం వెసులుబాటును కల్పించి ఎఫ్‌ఆర్‌ఎ్‌సకు లాక్‌ పెట్టలేదు. ఇదే అదనుగా కొందరు డాక్టర్లు ఉదయం 6గంటల నుంచి 9గంటలలోపు ఎంట్రీ ఎఫ్‌ఆర్‌ఎస్‌ వేసి వెళ్లిపోతున్నారు. అనంతరం సాయంత్రం 4గంటలపైన వచ్చి ఎగ్జిట్‌ ఎఫ్‌ఆర్‌ఎ్‌సను వేస్తున్నారు. డ్యూటీ లోకేషనను ఫిక్స్‌ చేయకపోవడంతో వైద్యవిద్య కళాశాలలోనే ఎఫ్‌ఆర్‌ఎస్‌ వేసి వెళ్లిపోతున్నారు.

నాలుగు జీపీఎస్‌ పాయింట్లు...

ప్రభుత్వ వైద్యవిద్య కళాశాలలో పనిచేస్తున్న డాక్టర్లు, పీజీ విద్యార్థుల హాజరును లెక్కించేందుకు నేషనల్‌ మెడికల్‌ కమిషన(ఎనఎంసీ) దేశవ్యాప్తంగా ఈ ఏడాది ప్రారంభం నుంచి ఎఫ్‌ఆర్‌ఎ్‌సను ప్రవేశపెట్టింది. గతంలో బయోమెట్రిక్‌ ద్వారా హాజరు విధానం ఉండేది. ఈ డేటా రాష్ట్ర ప్రభుత్వానికి, సంబంధిత కళాశాలకే పరిమితమయ్యేది. దేశంలోని అన్ని వైద్య కళాశాలల హాజరును లెక్కించేందుకు జీపీఎస్‌ ద్వారా అటెండెన్సను తీసుకునేలా ఆనలైన ఎఫ్‌ఆర్‌ఎ్‌సను ప్రవేశపెట్టింది. మొబైల్‌ యాప్‌ను రూపొందించి సంబంధించిన వారికి లాగిన ఐడీ కేటాయించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ వైద్యవిద్య కళాశాల, వైద్యశాల, సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌, క్యాన్సర్‌ యూనిట్‌ ఒక్కొక్కటిగా నాలుగు పాయింట్లను జీపీఎస్‌ లొకేషనకు అనుసంధానం చేశారు. ఒక్కోపాయింట్‌కు 30నుంచి 50 మీటర్ల పరిధిలో లొకేషనను ఫిక్స్‌ చేశారు. దీని ప్రకారం వైద్యులు డ్యూటీలు చేస్తున్న లోకేషనలోనే ఎఫ్‌ఆర్‌ఎ్‌సను వేయాలి. అయితే డాక్టర్లు డ్యూటీలు చేస్తారన్న నమ్మకంతో నాలుగు లొకేషన్లు ఎఫ్‌ఆర్‌ఎ్‌సకు అనుసంధానం చేశారు. ఎనఎంసీ నమ్మకాన్ని వమ్ముచేస్తూ మెడికల్‌ కాలేజ్‌లో ఎఫ్‌ఆర్‌ఎస్‌ వేసి వెళ్లిపోతున్నారు.

పర్యవేక్షణ ఏదీ?

ప్రభుత్వ వైద్యవిద్య కళాశాలలో బాధ్యతగా పనిచేయాల్సిన కొందరు డాక్టర్లు పని దొంగలుగా మారిపోయారు. ఎవరికి వారే సొంతంగా ప్రైవేట్‌ ఆస్పత్రులు, క్లినిక్‌లు డయాగ్నస్టిక్‌ సెంటర్‌లను ఏర్పాటు చేసుకుని వాటిలో పని చేసేందుకు అధిక సమయం, ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎఫ్‌ఆర్‌ఎస్‌ అటెండెన్స రావడంతో కనీసం ఉదయం 9 నుంచి సాయంత్రం 4గంటల వరకైనా ప్రభుత్వ విధుల్లో ఉండి వైద్యసేవలందిస్తారని రోగులు భావించారు. కానీ అది నెరవేరడం లేదు. ఎఫ్‌ఆర్‌ఎస్‌ విధానాన్ని తీసుకువచ్చినా పర్యవేక్షణ లోపం వల్ల ఎవరికి వారుగా జారుకుంటున్నారు. డ్యూటీలు సక్రమంగా చేసే డాక్టర్లు మాత్రం ఉదయం 9 నుంచి 9.30గంటల్లోపు ఎఫ్‌ఆర్‌ఎస్‌ వేసి విధుల్లో ఉండిపోతున్నారు. అయితే అరగంట ఎందుకు ఆలస్యంగా వస్తున్నారని వీరికి అధికారులు చీవాట్లు పెడుతున్నారు.

బహిరంగమే అయినా

డాక్టర్లు సక్రమంగా డ్యూటీలు చేయడం లేదన్న విషయం బహిరంగ రహస్యమే. వారిని కట్టడి చేయాల్సిన బాధ్యత అధికార యంత్రాంగంపై ఉంది. 539మంది ఎఫ్‌ఆర్‌ఎస్‌ అటెండెన్సను వారానికి ఒకసారి పరిశీలించాలి. ఉదయం ఎన్నిగంటలకు ఎఫ్‌ఆర్‌ఎస్‌ వేస్తున్నారు. సాయంత్రం ఎన్నింటికి ఎఫ్‌ఆర్‌ఎ్‌సవేసి పోతున్నారో ఆనలైన డేటాను తీయాలి. కళాశాలలోని డిపార్ట్‌మెంట్స్‌ డాక్టర్లు సంబంధిత లోకేషనలోనే ఎఫ్‌ఆర్‌ఎస్‌ వేస్తున్నారా?. వైద్యశాల, సూపర్‌ స్పెషాలిటీ, క్యాన్సర్‌ యూనిట్‌లో డ్యూటీ చేయాల్సిన డాక్టర్లు ఆయా లోకేషన్లలో ఎఫ్‌ఆర్‌ఎ్‌సను ఎందుకు వేయడంలేదు? అన్నది గమనించాలి. సక్రమంగా డ్యూటీ చేయని వైద్యులను ప్రశ్నించాలి. ఇలా ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటే వైద్యుల్లో కొంతైన బాధ్యత పెరిగే అవకాశం ఉంటుందని ఆస్పత్రి వచ్చే రోగులు, వారి సహాయకులు పేర్కొంటున్నారు.

మీరే వెతుక్కోండి

డ్యూటీ రోస్టర్‌ మేరకు ఫలనా డాక్టర్‌ ఆరోజు విఽధుల్లో ఉంటారని భావించి, వారితో చికిత్స చేయించుకోవాలని వస్తే ఆ వైద్యుడు కనిపించడం లేదని రోగులు వాపోతున్నారు. ఇదే విషయంపై కళాశాల ప్రిన్సిపాల్‌ను ప్రశ్నిస్తే ‘ఎక్కడున్నారో మీరే వెతికి పట్టుకోండి’ అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని రోగులు మండిపడుతున్నారు. కాగా ఎఫ్‌ఆర్‌ఎస్‌ వేసి వెళ్లిపోతున్న డాక్టర్ల అంశంపై ప్రిన్సిపాల్‌ విజయశ్రీని వివరణ కోరగా ఎఫ్‌ఆర్‌ఎస్‌ ఎక్కడైనా వేయవచ్చని సమాధానం చెప్పారు. అయితే ఇది ఎనఎంసీ నిబంధనలకు విరుద్ధం కావడం గమనార్హం.

Updated Date - Nov 19 , 2025 | 12:40 AM